దేవుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడు అనే మాటని మనం వింటూ ఉంటాం. అవును ఏ ఇంట్లో అయినా ఒక్క అమ్మే ఉంటుంది. కానీ ఆమె చేయాల్సిన పనులు మాత్రం చాలా ఉంటున్నాయి. అమ్మ ఉద్యోగిని కూడా అయితే… అటు ఆఫీస్ లో ఇటు ఇంట్లో… ఎలాంటి అసంతృప్తులు లేకుండా సమర్ధవంతంగా తన పనులు తాను చేయడానికి చాలా శ్రమ పడుతుంది. నేటి మహిళలు అత్యంత ప్రభావవంతంగా ఇంటిని, ఆఫీస్ పనిని ఎలా బ్యాలన్స్ చేస్తున్నారు.
మహిళలు చాలా విషయాల్లో ప్రాక్టికల్ గా ఉండలేరు. వారు మెదడుతోనే కాదు.. మనసుతో కూడా పనిచేస్తుంటారు. అలాంటప్పుడే పని మరీ భారంగా మారుతుంది. అలాకాకుండా ఉండాలంటే తప్పకుండా తమకుతాము కొన్ని పరిమితులు పెట్టుకోవాలి. ఉదాహరణకు సాయంత్రం ఆరు దాటాక ఇక ఆఫీస్ పనిని ముట్టుకోను… అని గట్టిగా నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే ఇంటినుండి పనిచేసేవారు ఆఫీస్ పనిలో ఉన్నపుడు తనకు ఆటంకం కలిగించవద్దని ఇంట్లోవారికి స్పష్టంగా చెప్పవచ్చు. ఆఫీస్ పనిని చేస్తున్నప్పుడు ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి. ఈ కాస్త పని చేసేస్తే రేపు శ్రమ తప్పుతుంది కదా అని అలాగే పనిని కొనసాగిస్తుంటారు కొందరుఇంటిపనుల్లాగే ఆఫీస్ పనులను సైతం వెంటనే పూర్తి చేసేయాలనే మనస్తత్వం ఉన్నవారు పనిని ఆపలేరు.
కానీ రేపు చేసినా పరవాలేదనిపించే పనులను ఈ రోజు చేయటం వలన… ఈ రోజు… ఇంటికి సంబంధించిన అత్యవసరమైన పనులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే టైమ్ ప్రకారం వర్కుని మొదలుపెట్టటం, ఆపటం రెండూ ఒక నియమంగా పెట్టుకోవటం మంచిది. అలాంటి నియమం ఉన్నపుడు ఆ సమయం లోపునే అన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇంట్లోంచి పనిచేసేవారు ఆఫీస్ పనికోసం ఇంట్లో ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించుకుంటే… పనిలో నూరుశాతం ఏకాగ్రతని పెట్టగల అవకాశం ఉంటుంది.
మహిళలకు ఇంటిపని నుండి విరామం అంటూ ఉండదు. కానీ ఆఫీస్ పనికి మాత్రం సెలవులు ఉంటాయి. వాటిని వినియోగించుకోవాలి. ఆరోగ్యం బాగా లేనప్పుడు తీసుకునే అవకాశం ఉన్న సిక్ లీవులు, టూర్ వెళ్లేందుకు అవకాశం ఇచ్చే లీవులు… ఇలాంటివన్నీ ఉపయోగించుకోవటం మంచిది. పనికి కాస్త విరామం ఉంటే మనసు శరీరం రెండూ విశ్రాంతిని పొందుతాయి. అలసట, విసుగు, బోర్ వంటివి పోయి తిరిగి ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఆఫీస్ పని అనంతరం మగవారు రిలాక్స్ అయినట్టుగా మహిళలు అవరు. వారు వెంటనే ఇంటిపనిలోకో మరో షాపింగ్ పనికో వెళ్లిపోతుంటారు.
కానీ విశ్రాంతి చాలా అవసరం. దానిని అపరాధంగా భావించకూడదు. ‘నేను రోబోని కాదు… విశ్రాంతి, మానసిక ఉత్సాహం, ఉల్లాసం లేకుండా నిరంతరం పనిచేయటం మంచిది కాదు…’ అని తమకు తాము చెప్పుకోవాలి. పని నుండి విరామం తీసుకుని రిలాక్స్ అయ్యేందుకు తనకూ అర్హత ఉందని గుర్తించాలి. ఎవరేమనుకుంటారో అనే సందేహాలు భయాలు వదిలి… తమ మనసు శరీరం ఏమంటున్నాయి… అనే అంశంపై దృష్టిపెడితే… సమర్ధవంతంగా ఇంటిని ఆఫీస్ పనిని బ్యాలన్స్ చేయటం సాధ్యమవుతుంది.
ఆడవాళ్లలో చాలామందికి పనులను ఇతరులకు చెప్పకుండా తమకు తామే చేసుకుని పోయే అలవాటు ఉంటుంది. ఎంత ఇంటి పనిచేస్తే.. అంత గొప్పవాళ్లు… అనే ముద్ర మహిళలపై సమాజం వేసినందువలన అలాంటి దృక్పథం ఉంటుంది వారిలో. కొన్ని ఇళ్లలో నిరంతరాయంగా మిషన్లలా పనిచేసే మహిళలు కనబడుతుంటారు మనకు. అదే తమ గుర్తింపుగా, ఉనికిగా వారు భావించడం వలన శ్రమని లెక్కచేయకుండా అలా చేస్తుంటారు. అయితే ఈ అలవాటుని తగ్గించుకుని, తగిన విశ్రాంతి తీసుకుంటూ ఇంటా బయటా అవసరం ఉన్నచోట ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాలి.