- మనందరిలో ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది.
- మనకి అత్యంత శత్రువైన వ్యక్తికంటే ఎక్కువగా ఒక్కోసారి మనల్ని మనమే ద్వేషించుకుంటూ ఉంటాం.
అలా ఎందుకు జరుగుతుంది?
మనమీద మనకు ప్రేమ ఉండబట్టే కదా…ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుంటున్నాం. ఎవరైనా ఏదన్నా అంటే ఎదురు తిరుగుతున్నాం, అందంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం అంటారా!
ఇవన్నీ చేస్తున్నా మనపై మనకు ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం వలన వచ్చే సమస్యలుంటాయి. మరి స్వీయ ద్వేషం ఎందుకు కలుగుతుంది?
స్వీయ ద్వేషం ఎక్కడ నుండి పుడుతుంది?
మనం చాలా సినిమాల్లో చూసి ఉంటాం కొడుకు కాలేజీలో చదువుతుంటాడు. తండ్రి నిరుపేద కూలీ అయినా కష్టపడి అతడిని చదివిస్తుంటాడు.
కానీ ఆ కొడుకు మాత్రం సొంత తండ్రిని తండ్రి అని బయటకు చెప్పడు. అలా చెప్పుకోవటం అతనికి నామోషీగా అనిపిస్తుంది. అంతేకాదు తల్లిదండ్రులను ద్వేషిస్తుంటాడు.
ఇక్కడ మనకు కొడుకు తండ్రిని ద్వేషిస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ ఆ ద్వేషం తనపై తనకు ఉన్నది. తన ఉనికినే తాను తట్టుకోలేకపోతున్నాడు. తనేంటో నిజాయితీగా ఒప్పుకోలేకపోతున్నాడు, అదే అతనిలో తల్లిదండ్రుల పట్ల ద్వేషంగా బయటపడింది.
ఇలా చాలా మంది చాలా సందర్భాల్లో తమని తాము ద్వేషించుకుంటూ ఉంటారు.

మనం ఉన్న పరిస్థితులను మనం ప్రేమించలేకపోతే మనపై మనకు ద్వేషం ఉన్నట్టేనా!
రోజువారీ జీవితంలో మనం చేసే పనులు మన కళ్లకు కనబడతాయి. కానీ మన మనసులోని భావాలు ఏమిటో అర్థం కావు. అర్థం చేసుకోవాలని కూడా అనుకోము.
అలాగే స్వీయ ద్వేషం ఉన్నా, అది బయటపడే పరిస్థితి ఉండదు. అసలు దానిని మనం గుర్తించలేము కూడా.
కొంతమంది అనవసరంగా ప్రతి చిన్న విషయానికి అబద్దాలు ఆడుతుంటారు.
నిజానికి మనం అబద్దం ఆడుతున్నామంటే, మనపై మనకు ఎంతోకొంత ద్వేషం ఉన్నట్టే.
రాత్రంతా టీవీ చూస్తూ గడిపిన విద్యార్థి తెల్లవారి ఫ్రెండ్ తో రాత్రంతా కష్టపడి చదివాను అని చెప్పాడనుకోండి. అంటే అర్థం తను ఒరిజినల్ గా ఎలా ఉన్నాడో అలా బయటకు కనబడటం తనకు నచ్చటం లేదన్నమాట.
తను ఉన్న పరిస్థితిని తన పనులను అతను ప్రేమించడం లేదు. వాటిపట్ల సిగ్గుపడుతున్నాడు. అందుకే నిజానికి ముసుగువేసి అబద్దం ఆడుతున్నాడు.
తమ పట్ల తమకు ఎలాంటి ద్వేషం లేకపోతే తాము ఏం చేస్తున్నారో అదే బయటకు చెబుతారు.
చాలా సందర్భాల్లో చాలా మంది ఇతరులకు నచ్చేలా ప్రవర్తించాలని అనుకుంటారు.
తమ ఇష్టాలను భావాలను బయటపెట్టకుండా ఇతరులకు నచ్చేలా, ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడుతుంటారు. ఇలాంటప్పుడు కూడా తమలోని నిజాలకు ముసుగు వేస్తున్నట్టే.
తమకు తాము నచ్చటం లేదు కనుకే ఇతరులకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది.
మనసులో తమని తాము తక్కువగా భావించుకుంటారు. అలా అనుకోవటం వలన కలిగే ఇబ్బందులన్నీ పడుతుంటారు.
స్వీయ ద్వేషం పైకి కనిపించకుండా ఇలాంటి నష్టాలను ఎన్నో కలగజేస్తుంది.
అనుకున్నది సాధించలేకపోయినపుడు మనపై మనకు ద్వేషం కలుగుతుందా?
జీవితంలో అందరికీ ఏవో ఒక కలలు కోరికలు ఉంటాయి. అయితే అందరూ వాటిని నేరవేర్చుకోలేకపోవచ్చు.
మనం అనుకున్నది సాధించినప్పుడు మనగురించి మనకు మంచి ఫీల్ కలుగుతుంది, గర్వంగా అనిపిస్తుంది.
మనసంతా ఆనందంగా పాజిటివ్ గా ఉంటుంది. అయితే అనుకున్నది సాధించలేనప్పుడు తప్పకుండా ఇందుకు వ్యతిరేకమైన భావాలు కొన్నయినా కలుగుతాయి.
మనపైన మనకున్న ఇష్టం, గౌరవం లాంటివి తగ్గుతాయి. చిన్నతనంగా సిగ్గుగా అనిపిస్తుంది.
ఇతరులు మనపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చలేకపోయినప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది.
తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను నిజం చేయలేకపోయినప్పుడు చాలామంది పిల్లలు ఇలాంటి అపరాధభావనకు గురవుతుంటారు.
తమ ఆత్మీయులకు ఆనందాన్ని ఇవ్వలేకపోయామనే బాధ కలుగుతుంది.
దాంతో తాము ఇతరుల ప్రేమకు అర్హత లేని వ్యక్తులుగా వీరు తమని తాము భావించుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కూడా స్వీయ ద్వేషానికి కారణం కావచ్చు.
చిన్నతనం నుండి ప్రేమ పూర్వకమైన వాతావరణంలో పెరగకపోయినా ద్వేషం పెరుగుతుందా?
పిల్లలు చిన్నతనం నుండీ ప్రేమ పూరితమైన నమ్మకమైన వాతావరణంలో పెరగకపోయినా, తల్లిదండ్రులు వారితో ఈ సమాజం మంచిదికాదని ఎవరినీ నమ్మవద్దని చెబుతూ పెంచినా వారిపై నెగెటివ్ ప్రభావం పడుతుంది.
తాము ప్రేమకు అర్హత ఉన్న వ్యక్తులం కామనే భావం కలిగి తమని తాము ద్వేషించుకునే అవకాశం ఉంది.
పసితనంలో బాధలు అవమానాలకు గురయినవారు కూడా తమని తాము ప్రేమించుకునే స్థితిలో ఉండరు.
ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెంటాడినా అది ద్వేషమేనా?
మనమంతా పైకి మనల్ని మనం బాగా ప్రేమించుకునే వ్యక్తులుగానే కనబడుతుంటాం.
కానీ పరిశీలనగా చూస్తే కానీ అర్థం కాని విషయాలు మన మనసుల్లో ఎన్నో ఉంటాయి.
కొంతమందికి ఎప్పుడూ తమ పట్ల తమకు అసంతృప్తి ఉంటుంది. వీరు ఇతరులతో తమని తాము పోల్చి చూసుకుని తాము ఎందుకు పనికిరానివాళ్లమని బాధపడుతుంటారు.
అలాగే నిస్సహాయంగా నిరాశగా కూడా ఉంటారు. తమని తాము విమర్శించుకుంటూ ఉంటారు.
అనుకున్నది సాదించలేకపోయామనే అపరాధభావనకు గురవుతుంటారు ఇవన్నీ స్వీయ ద్వేషంలో భాగాలే.
తమపట్ల తమకు ద్వేషం ఉన్నవారు ఎప్పుడూ తమని తాను విమర్శించుకుంటూ ఉంటారు. తాము ఇతరులతో సమానంగా సమర్ధులం, విలువైన మనుషులం కాదనే భావంతో ఉంటారు.
దాంతో వీరికి అనుబంధాల్లో కూడా సమస్యలు ఉంటాయి. పని ప్రదేశాల్లో కూడా ఇతరులతో కలిసిమెలసి పనిచేయలేరు. అందరూ తమని అవమానిస్తున్నారని, తమకు గౌరవం ఇవ్వటం లేదని భావిస్తుంటారు.
ఇలాంటివారు…
- ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు.
- అవకాశాలు వచ్చినా అందిపుచ్చుకోలేరు. ఎప్పుడూ అలసటగా శక్తిహీనంగా ఉంటారు.
- వీరు ముందు తమని గురించి తాము నెగెటివ్ గా మాట్లాడుకోవటం మానేయాలి.
- తమలోని శక్తిసామర్ధ్యాలను గుర్తించాలి. తమ శక్తిసామర్ధ్యాలను గుర్తించి ఇతరులు అభినందనలు తెలిపితే వాటిని స్వీకరించాలి.
- కొంతమంది తాము ఇతరుల అభినందనలు అందుకోవడానికి కూడా అర్హులు కాదని భావిస్తుంటారు.
- ఆ విజయం తమది కాదని ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందని తాము అంత సమర్ధులం కాదనేది వీరి అభిప్రాయం.
- ఇలాంటి బావాలు కూడా స్వీయ ద్వేషంలో భాగాలే అవుతాయి. సాధారణంగా స్వీయ ద్వేషం ఉన్నవారు ఎప్పుడూ గతం తాలూకూ ఆలోచనల్లో ఉంటారు.
- గతంలో తాము పడిన బాధలు అవమానాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచనల్లోంచి బయటకు రావాలి.
- జీవితాన్ని కొత్తగా చూడటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడో చేసిన తప్పులకు పొరబాట్లకు ఇప్పుడు కుమిలిపోవటం సరికాదని గుర్తించాలి.
- జరుగుతున్న కాలంలో జీవించడం అలవాటు చేసుకుంటే స్వీయ ద్వేషం చాలావరకు తగ్గుతుంది.
చివరిగా
దయ, క్షమాగుణం చాలా గొప్పవని మనకు తెలుసు. అయితే వీటిని ఇతరులపైనే కాదు, మనపైన మనం కూడా చూపించుకోవాలి.
అప్పుడే మనపై మనకున్న కోపం ద్వేషం లాంటి భావాలు తగ్గుతాయి.
నిరంతరం మన ప్రవర్తనపై మనమే తీర్పులు ఇచ్చుకుంటూ, మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటే స్వీయద్వేషం పెరుగుతూనే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఇవి కూడా చదవండి
- Back Pain and Pregnancy గర్భిణీలూ నడుమునొప్పితో బాధపడుతున్నారా… ఇవి తెలుసుకోండి.
- World Mental Health Day: మానసిక అశాంతి శాపం కాకూడదు !!
- Nail Health: గోళ్ళు మన ఆరోగ్యం గురించి తెలిపే నిజాలు
- Mastrubation హస్త ప్రయోగం చేయడం వల్ల కిడ్నీలు పాడవుతాయా?
- Walking Benefits: రోజుకి ఇన్ని అడుగులు నడిస్తే…మంచి ఫలితాలు ఉంటాయి ?
Nice topic and content , much informatic and appreciated