ఒక్కసారి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చూద్దాం.

Know your lungs

మన రెండు ఊపిరితిత్తులు ఒకే సైజులో ఉంటాయా?

కుడి వైపున ఉన్న ఊపిరితిత్తి ఎడమ వైపున ఉన్న ఊపిరితిత్తి కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే ఎడమ వైపున ఛాతీ భాగంలో మన గుండె ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది.  అయితే మన రెండు ఊపిరితిత్తులు ఐదు విభాగాలుగా విభజించబడి ఉంటాయి వీటినే లోబ్ అంటారు. కుడివైపున ఉన్న ఊపిరితిత్తిలో మూడు లోబ్ ఉంటాయి. అలాగే ఎడవైపున ఉన్న ఊపిరితిత్తి రెండు లోబ్స్ ను కలిగి ఉంటుంది. ఈ రెండు ఊపిరితిత్తుల బరువు కలిపి 1.3కిలోల లోపే ఉంటుంది.

ఎన్ని గ్యాలన్ల గాలిని మనం రోజూ పీల్చుకుంటాం?

2100 నుండి 2900 గ్యాలన్ల గాలిని మనం రోజూ పీలుస్తాము. గాలిలో మన శరీరానికి కావల్సినంత ఆక్సీజన్ నిండి ఉంటుంది. గుండె శరీర అవయవాలకు పంపు చేసే రక్తం ద్వారా ఆక్సీజన్ ను ఆన్ని అవయవాలకు అందజేస్తుంది. ఇలా రక్తప్రవాహం ద్వారా మన అవయవాలకు ఆక్సీజన్ సరఫరా అవుతుంది. మనం ఒక నాలుగు నిమిషాలపాటు శ్వాస తీసుకోవడం ఆపేస్తే మన శరీరంలోని అవయవాలు శాశ్వతంగా దెబ్బతింటాయి.

వయసు పెరుగుతున్నకొద్దీ ఊపిరితిత్తుల సామర్ధ్యం తగ్గుతుందా?

మీరు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసులో ఉన్నపుడు ఊపిరితిత్తులు చాలా బాగా పనిచేస్తాయి. ఆ తరువాత వయసు పెరుగుతున్నకొద్దీ డయాఫ్రామ్ బలహీనపడుతుంది. ఊపిరితిత్తుల కణజాలం కూడా క్రమంగా సాగే గుణాన్ని కోల్పోతూ ఉంటుంది.

డయాఫ్రామ్ ఎలా పనిచేస్తుంది?

డయాఫ్రామ్ మీ ఊపిరితిత్తుల క్రింది భాగంలో గోడ లాంటి ఆకారాన్ని కలిగి ఉన్న కండరం. ఇది ఉదరభాగాన్ని ఛాతీ భాగం నుంచి వేరు చేస్తుంది. మనం శ్వాస పీల్చుకున్నపుడు ఈ కండరం కిందికి తోయబడి గాలిని ఊపిరితిత్తుల్లోకి అనుమతిస్తుంది. శ్వాసని వదిలినపుడు ఈ డయాఫ్రామ్ అనే కండరం పైకి నెట్టబడి ఊపిరితిత్తుల్లోంచి కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్లడానికి సహాయపడుతుంది.

శరీరంలో శ్వాస వ్యవస్థని నియంత్రించే అవయవం ఏది?

శ్వాస వ్యవస్థ మన మెదడు అధీనంలో పనిచేస్తుంది. శ్వాసని ఎప్పుడు తీసుకోవాలో మెదడు శరీరానికి సిగ్నల్ పంపుతుంది. శరీరంలోని కండరాలు, ఊపిరితిత్తులు మెదడు నుంచి వచ్చిన సిగ్నల్ అందుకుని శ్వాసని పీల్చడం, వదలడం చేస్తాయి. మెదడు నుంచి సరైన సంకేతాలు అందకపోతే శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. మనం నిద్రలో ఉన్నపుడు శ్వాస వ్యవస్థలో సమస్యలు వచ్చే పరిస్థితినే స్లీప్ అప్నియా అంటారు.

ఊపిరితిత్తులకు టాక్సిన్ ల నుంచి రక్షణ కల్పించే సిలియా

ఊపిరితిత్తులు గాలిని పీల్చినపుడు గాలిలో ఉన్న సూక్ష్మ క్రిములు, దుమ్ము ధూళి గాలి ద్వారా లోపలికి వెళ్ళి  వాయునాళాల శ్లేశ్మానికి ఆతుక్కుంటాయి. సిలియా అని పిలువబడే చిన్న వెంట్రుకల సమూహం సూక్ష్మక్రిములు చేరిన శ్లేశ్మాన్ని బయటికి తీసుకురావడంలో సహాయపడుతుంది. అలా బయటికి వచ్చిన కఫాన్ని మీరు మింగడం లేదా బయటికి దగ్గడం చేస్తారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చి శ్వాసతీసుకోవడం బాగా ఇబ్బందిగా మారినపుడు శరీరంలోని తెల్ల రక్తకణాలు ఆ ఇన్ఫెక్షన్ తో పోరాడతాయి.

నిమోనియా శ్వాస వ్యవస్థని ఎలా ఇబ్బంది పెడుతుంది?

నిమోనియా వచ్చినపుడు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలోని కణాలకు ఆక్సీజన్ ను అందించే శ్వాస వ్యవస్థను ఇది ప్రమాదంలోకి నెడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలాసార్లు వైరస్ వల్ల సంక్రమిస్తుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియా, ఫంగస్ కూడా నిమోనియాకు కారణం కావచ్చు. చాలామంది కొన్ని వారాల్లోనే నిమోనియా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడతారు. అయితే చిన్నపిల్లల్లో, యుక్త వయసు పిల్లల్లో, 65 ఏళ్ల వయసు దాటిన వృద్ధుల్లో, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో ఇంకా రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలోనూ ఇది ప్రాణాంతకమవుతుంది.

ఆస్తమా మరియు బ్రాంకైటిస్ శ్వాస వ్యవస్థలో ఏ భాగాన్ని బాగా దెబ్బతీస్తాయి?

ఆస్తమా లేదా బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వచ్చినపుడు శ్వాస వ్యవస్థలోని వాయునాళాలు వాపుకు గురవుతాయి. ఈ వాపు గాలిని ఊపిరితిత్తులకు అందకుండా చేస్తుంది. ఆ సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.

బ్రాంకైటిస్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా బ్రాంకైటిస్ రావచ్చు. ఇంకొన్నిసార్లు ఊపిరితిత్తులను ఇబ్బందికి గురిచేసే ఏవైనా కెమికల్స్ పీల్చడం వలన కూడా ఈ బ్రాంకైటిస్ బారిన పడవచ్చు.

చివరిగా

ఆస్తమా రావడానికి ఖచ్చితమైన కారణాలను డాక్టర్ లు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీన్ని పూర్తిగా తగ్గించే చికిత్సలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి అస్తమాను మందులతోనే నియంత్రణలో పెట్టుకోవాలి. ఇన్ఫెక్షన్ వ్యాప్తికి కారణమయ్యే వస్తువులకు, పదార్థాలకు దూరంగా ఉండాలి. శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఊపిరితిత్తులను ఉత్సాహ పరచవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top