జీవ పరిణామ క్రమంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మనిషి తన అస్తిత్వాన్ని ఈ భూమి మీద ఏర్పరచుకున్నాడు. అప్పుడు మానవుడు ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేవాడు. ఆ సమయంలో తీసుకునే ఆహారం గానీ, మనిషి చేసే ఆలోచనలు గానీ తనకు హాని చేసేవిగా ఉండేవి కాదు. చాలా విచక్షణా జ్ఞానంతో భూమి మీద ఉన్న ప్రతి అంశాన్ని తెలుసుకునేవాడు. ప్రకృతికి అనుగుణంగా తనని తాను మలచుకునేవాడు.
ఎప్పుడైతే మనిషి ప్రకృతిని లోబరుచుకోవాలి అనుకున్నాడో అప్పుడే మనిషి పతనం మొదలైంది. మానవ శరీరానికి విరుద్ధంగా పనిచేసే కొన్ని ఆహారాలు, మానవ మనుగడకి ఆటంకం కలిగించే కొన్ని నియమాలు ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి వాటికి మందును కనుగొనడంలో మనిషి చాలా పురోగతిని సాధించాడు. అది మనిషి ప్రకృతి మీద సాధించిన విజయం. ఆ ఆలోచనే మనిషిని ఇన్నేళ్లుగా ముందుకు నడిపిస్తోంది. అదే నేడు మనం చూస్తున్న సమాజంలోని ఎన్నో మార్పులకు కారణం.
అయితే ఈ సృష్టిలో దేనికైనా ఒక పరిమితి ఉంది. దాని పరిమితిలో ఉపయోగించుకుంటేనే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది ఆహారం కావచ్చు, ఆలోచన కావచ్చు, ఆహార్యం కావచ్చు ఇలా ఏదైనా దానికంటూ ఒక పరిమితిని నిర్ణయించుకుని ఉంది. ఐతే నేటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కారణం మనిషి ఈ పరిమితిని దాటి పోవడమే అనిపిస్తోంది.
ఒకప్పుడు మనిషి ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటూ ప్రకృతి అందించిన సహజ ఆహారాలను ఆరగించి ఎంతో దృఢంగా ఉండేవాడు. ఇప్పుడు ప్రకృతికి విరుద్ధంగా కృత్రిమ ఆహారాలను తయారు చేసుకుని తన వెన్నుని తానే విరుచుకుంటున్నాడు. మానవ సంబంధాలను పటిష్ట పరిచే ఎన్నో సాంప్రదాయాలను, సంస్కృతిని మన పూర్వీకులు మనకు అందించారు. అవి మనిషి జీవితం చాలా సాఫీగా సాగిపోయేలా చేసేవి. మరి ఆ సామాజిక కట్టుబాట్లను ఆచరించని మనిషి నేడు తన మానవ సంబంధాలను కుళ్ళబొడుచుకున్నాడు.
కోరికలే ప్రధానంగా సాగుతున్న మనిషి జీవితం నేడు ఎన్నో ఆటుపోట్లకు గురవుతోంది. నేటి ఆధునిక మనిషి చేస్తున్న అకృత్యాలను భరించలేక ప్రకృతే మనిషి మీద తిరగబడిందా అనేలా ఉంది నేటి కరోనా వ్యవహారం. ఇప్పటికైనా మనం మారాలి. మన భావితరాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకుంటే ఆధునికత రంగుని పులుముకున్న ఈ వేగం తగ్గాలి. ఎటువంటి జెవనశైలిలో మనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళమో, ఏ మానవ సంబంధాలలో మనం మనశ్శాంతిగా బ్రతికేవాళ్ళమో మళ్ళీ మనం అక్కడికి చేరుకోవాలి. లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న కరోనా లాంటి ప్రళయాలు మరెన్నో మనమీద యుద్ధానికి రెడీగా ఉన్నాయి.
ఇకనైనా మేలుకోవాలి మనిషిగా బ్రతకడం నేర్చుకోవాలి.