రక్తం మన శరీరానికి జీవ ఇంధనం
మనలోని అణువణువుకూ ప్రాణవాయువుతోపాటు, పోషక పదార్థాల్ని అందించే సంజీవని. ఒంట్లో రక్తం తగ్గితే చెట్టంత మనిషి సైతం అంతులేని నీరసంతో, నిస్సత్తువతో నిర్వీర్యం అవుతాడు. శరీరంలో తగినంత రక్తం లేకపోవడం అనేది ఇవాళ మన దగ్గర ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. ముఖ్యంగా పిల్లలు, స్త్రీలలో రక్తహీనత అనేది బాగా ఎక్కువగా కనిపిస్తోంది. మన ప్రభుత్వాల లెక్కల ప్రకారమే ఐదేళల్లోపు పిల్లలో సుమారు 69.5 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అసలు పిల్లల్లో రక్తహీనత అనేది ఎందుకొస్తోంది? కారణాలేంటి?
రక్తహీనత అంటే…?
మన శరీరంలో ఉండాల్సిన దానికంటే రక్తం తక్కువగా ఉండటం. పిల్లల విషయంలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే చాలామంది పిల్లల్లో హిమోగ్లోబిన్ విలువలు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు పౌష్టికాహార లోపం మొదలుకుని పొట్టలో నులి పురుగుల వరకూ అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
రక్తహీనతతో బాధపడే పిల్లల్లో ప్రాణ వాయువును మోసుకెళ్లే ఎర్ర రక్త కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో శరీర కణాలకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా పిల్లలు నీరసం, నిస్సత్తువతో కూలబడిపోతుంటారు. శరీరం అంతా తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటుంది. ఆకలి సరిగా ఉండదు. ఒంటికి నీరు కూడా పడుతుంటుంది. ఇవన్నీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు, చదువుల్లో ఏకాగ్రత తగ్గేలా చేస్తాయి.
రక్త హీనత ఉన్నపుడు…
రక్త హీనతతో కేవలం నీరసం, నిస్సత్తువ మాత్రమే కాదు… నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులనూ తెచ్చిపెడుతుంది. గుండె, కిడ్నీలు, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి కీలక అవయవాల పనితీరు క్రమంగా మందగించిపోయే అవకాశం ఉంది. పిల్లల్లో రక్తహీనత కనిపిస్తున్నపుడు అందుకు మూలకారణాన్ని గుర్తించి తగిన చికిత్స చేయాలి.
పౌష్టికాహార లోపం మూలంగా రక్తహీనత వస్తున్నట్లైతే సమతులాహారాన్ని అందివ్వడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఇక పొట్టలో నులి పురుగులు ఉన్నపుడు వాటిని నాశనం చేయడం ద్వారా రక్తహీనత బారి నుంచి పిల్లల్ని కాపాడవచ్చు. ఇనుమును అందించే ఫోలిక్ యాసిడ్ మాత్రల్ని పిల్లలకు అందించడం ద్వారా రక్తహీనత సమస్య కాకుండా నివారించవచ్చు.
ఈ జాగ్రత్తలతో పిల్లలని రక్తహీనతతో కాపాడవచ్చు
పిల్లల్ని ప్రతి రోజూ ఏదో ఒక ఆకుకూరను తినేలా ప్రోత్సహించడం ద్వారా వారిలో రక్తహీనత సమస్యను చాలా తేలికగా నివారించవచ్చు. ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించి, చవకగా అందుబాటులో ఉండే అన్ని రకాల తాజా ఆకుకూరలు అంటే తోటకూర, పుంటికూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గంగబాయిల కూర రోజు తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.
ఎండు ఖర్జూరం, బాదం, జీడిపప్పు, మాంసం, కాలేయం వంటి పదార్థాల్లో కూడా ఇనుము పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ పిల్లలకు పెడుతుండాలి. రక్తహీనత నివారణకు ఉప్పులో ఇనుమును కలిపే శాస్త్రీయ పద్ధతిని జాతీయ పోషకాహార సంస్థ వారు కనుగొన్నారు. మామూలు ఉప్పు బదులుగా క్రొత్తగా తయారుచేసిన ఇనుము కలిపిన ఉప్పును రోజూ వంటలో వాడడం ద్వారా ఇనుము లోపం వలన వచ్చే రక్త హీనతను నివారించవచ్చు.