చిన్నపిలల్లో మెదడు ఎదుగుదలకు సంబంధించిన ఒక అపశ్రుతి ఆటిజం. మానసికంగా ఎదుగుదలలో ఒడిదుడుకుల కారణంగా నలుగురిలో మాట్లాడాలన్నా ఇబ్బంది కలిగించే సమస్య తెలెత్తుతుంది. చిన్నతనంలో మొదలై రాను రాను పెరిగే ఈ సమస్యకు తొలిదశలోనే చికిత్స చేస్తే అలాంటి పిల్లల జీవితం చాలా బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం మీద అవగాహన పెంచుతూ ఇది ఒక సమస్యే కాదని, ఒక రకమైన జీవనశైలిగా భావించాలని తెలియజెప్పి తల్ల్లిదండ్రుల్లో కూడా ఆత్మవిశ్వాసం నింపేందుకు ఏటా జూన్ లో ఆటిస్టిక్ ప్రైడ్ డే జరుపుతారు.
పిల్లల్లో ఆటిజం గుర్తించవచ్చా?
ఆటిజం అనేది ఒక అంతుచిక్కని సమస్య. సాధారణంగా ఏడాదిన్నర మొదలుకొని రెండేళ్ళ లోపు పిల్లల్లో దీని లక్షణాలు మొదలవుతాయి. కొంతమందిలో ఏడాదికి కూడా కనబడవచ్చు. అప్పటినుంచి మానసిక ఎదుగుదల మందగించటంతో ఆటిజం లక్షణాలు బైటపడుతూ వస్తాయి. ఇది ముదిరిపోయాక చికిత్స లేకపోయినా, తొలిదశలో గుర్తిస్తే మాత్రం దీని ప్రభావాన్ని బాగా తగ్గించ గలిగే చికిత్సావిధానాలు అందుబాటులోకి వచ్చాయి.
పిల్లల్లో ఆటిజం: లక్షణాలు
పిల్లలు పుట్టినప్పటినుంచీ వాళ్ళ ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తే ఆటిజం లక్షణాలు ఏవైనా ఉంటే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే ముందుగా తల్లిదండ్రులకు ఆ లక్షణాల గురించి తెలిసి ఉండాలి. పిల్లలు నేరుగా మనల్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూడకపోయినా, దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని సరిగా పట్టించుకోకపోయినా, స్పందించకపోయినా అనుమానించాలి. సాధారణంగా రెండేళ్ళకి లక్షణాలు కనబడటం మొదలవుతాయి.
- నేర్చుకున్న మాటలు సైతం మాట్లాడక పోవటం.
- నేర్చుకోలేకపోవటం.
- సగటు కంటే తక్కువ తెలివితేటలు ప్రదర్శించటం లాంటివన్నీ ఆటిజం లక్షణాలే.
- అయితే కొంతమందిలో తెలివితేటలు బాగానే ఉన్నా, ఇతరులతో మాట్లాడటంలో ఇబ్బంది పడతారు.
- తెలిసిందే అయినా చెప్పలేరు.
ఇలా భిన్నమైన లక్షణాలు కలగలసి ఉండటం వల్లనే గుర్తించటం చాలా కష్టమవుతుంది. అందుకే సాధారణ లక్షణాల మీద అవగాహన ఆవసరం.
- వినిపించుకోకపోవటం
- పేరు పిలిచినా స్పందించకపోవటం
- దగ్గరకు తీసుకొని వీపు నిమురుతుంటే విసుక్కోవటం
- ఒంటరిగానే ఆడుకోవటానికి ఇష్టపడటం
- ముఖంలో ఎలాంటి భావమూ కనబడకపోవటం
- కళ్లలో కళ్ళు పెట్టి చూడకపోవటం
- సరిగా మాట్లాడక పోవటం లేదా మాట్లాడినా బాగా ఆలస్యంగా మాట్లాడటం
- అంతకు ముందు చెప్పగలిగే మాటలు, వాక్యాలు చెప్పలేకపోవతం లాంటి లక్షణాలు కనబడతాయి.
ఆటిజం సమస్య రావటానికి ఏ ఒక్క నిర్దిష్తమైన కారణమూ లేదు. బహుశా చాలా కారణాలు ఉండి ఉంటాయని డాక్టర్లు చెబుతారు. జన్యువులు, పర్యావరణం రెండూ కారణాలు కావచ్చునంటారు. అయితే, వంశపారంపర్యంగా అనే కాకుండ ఆకస్మికంగా జీన్స్ లో మార్పులవలన కూడా ఇలా జరగటానికి అవకాశముంది. వైరల్ ఇన్ఫెక్షన్లలాంటివి కారణమై ఉండవచ్చా అనే విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయి.
పిల్లల్లో ఆటిజం: ఎలా నిర్థారిస్తారు? చికిత్స వలన ఫలితం ఉంటుందా?
ఆటిజం ఎవరిలోనైనా రావచ్చు. అయితే ఆడపిల్లలకంటే నాలుగురెట్లు ఎక్కువగా మగపిల్లల్లోనే వస్తున్నట్టు తేలింది. కుటుంబంలో ఒక పిల్లవాడికి ఈ లక్షణాలుంటే రెండో పిల్లవాడికీ వచ్చే అవకాశాలెక్కువ. ఆరు నెలలలోపే పుట్టిన పిల్లలకు కూడా ఆటిజం వస్తున్నట్టు గుర్తించారు. దీనివలన తల్లిదండ్రుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఇంతకీ దీన్ని నివారించటానికి మార్గాలేమైనా ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. కాకపోతే చికిత్సకు మాత్రం మార్గాలున్నాయి. అందుకే వ్యాధి నిర్థారణ మీద దృష్టిపెట్టాలి. మామూలుగా డాక్టర్లు రెగ్యులర్ వైద్య పరీక్షల సందర్భంగా లక్షణాలు గుర్తించి హెచ్చరిస్తారు.
అప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి పంపితే రకరకాల పరీక్షల ద్వారా నిర్థారించటం సాధ్యమవుతుంది. వినికిడి, మాట్లాడటం, ప్రవర్తన లాంటివి గమనిస్తే తల్లిదండ్రులకు కూడా ప్రాథమికంగా అర్థం కావచ్చు. నిజానికి ఆటిజం పూర్తిగా నయం కావటానికి వైద్య పరంగా ఎలాంటి చికిత్సాలేదనే చెబుతారు. అయితే, క్రమంగా లక్షణాల తీవ్రత తగ్గించే ప్రయత్నాలు చేయవచ్చు.
స్కూలుకు వెళ్ళకముందే గుర్తించగలిగితే నేర్చుకోవటంలో ఉండే నైపుణ్యాలను మెరుగుపరచటానికి వీలుంటుంది.సామాజికంగా నలుగురిలో కలిసేలా, మాట్లాడేలా ప్రవర్తనలో మార్పులకు ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించవచ్చు, థెరపీల ద్వారా అది సాధ్యమవుతుంది.
అందుకే ఒకవైపు బైట ఇలాంటి థెరపీ చేయిస్తూనే ఇంట్లో చేయాల్సినవి ఇంట్లో చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా ప్రవర్తనలో తగిన మార్పులు రావటానికి చేయించే థెరపీకి ప్రాధాన్యం ఉంటుంది.
ఆటిజం ఉన్న పిల్లలు మందులు ఎలా వాడాలి?
మందుల వాడకం వలన ఆటిజం సమస్య ప్రధాన లక్షణాలకు ఎలాంటి విముక్తీ లభించదు. అయితే హైపర్ యాక్టివ్ గా ఉంచటానికి వాడే మందుల లాంటివాటితో ప్రవర్తనా సంబంధమైన మార్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆత్రుత తగ్గటానికి యాంటీ డిప్రెషన్ మందులు కూడా సూచించవచ్చు. ఏ మందులు వాడినా డాక్టర్ సకహా మేరకు మాత్ర మే వాడాలి. కొన్ని మందులవలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం.
పిల్లల్లో ఆటిజం: తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన కల్పించాలి?
సామాజికంగా ఇతర పిల్లల మధ్య ఆత్మన్యూనతాభావం ఏర్పడకుండా చూడటం తల్లిదండ్రులతోనే మొదలు కావాలి. సాధారణంగా అటిజం ఉన్నపిల్లల్లో నిద్రలేమి, మూర్ఛ. పరిమిత ఆహారం లాంటి ఇతర సమస్యలు కూడా ఉండవచ్చు కాబట్టి వీటన్నిటినీ ఎలా నెగ్గుకు రావాలో డాక్టర్ సలహా తీసుకోవాలి.
సమస్య జటిలమైనదే అయినా, ఆ భావం కనబడకుండా ఆటిజం తో బాధపడుతున్న పిల్లలతో వ్యవహరించాలి. మెల్లగా అన్నీ నేర్పటానికి ప్రయత్నించాలి. వాళ్ళను భారంగా చూడకుండా వాళ్లలో మానసిక ఎదుగుదలకు ప్రయత్నించాలి.
కొత్త విషయాలు నేర్చుకోవటం పట్ల మెల్లగా ఆసక్తి కలిగిస్తూ నేర్పాలి. నలుగురిలో ఉన్నప్పుడు ఎవరూ తక్కువగా చూడకుండా ఉండాలంటే ముందుగా తల్లిదండ్రులే బాగా చూసుకోవాలి. ముందు వాళ్లకు వాళ్ళు డిప్రెషన్ కి లోను కాకుండా ఉండాలి.
సమస్యకు ఎవరో కారణం కాదు గనుక ఆ సమస్యతో సానుకూలమైన సహజీవనానికి అలవాటు పడాలి. పిల్లలు ఎదిగే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటారు. మామూలు పిల్లలకంటే కాస్త వెనుకబడినా ఎదుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్లను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించాలి.
వేగం తక్కువే అయినా ముందుకు సాగుతూ ఉంటారు అనే ధైర్యంతో తల్లిదండ్రులు కూడా ముందుకు సాగాలి. వాళ్ళ భవిష్యత్తు, పై చదువులు, ఉద్యోగం లాంటి విషయాలలోనూ కాస్త వెనుకబడినా ముందుకెళ్ళటం సాధ్యమన్న విషయాలు తెలియజేస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి. నిజానికి ఆటిజం అనేది ఒక సమ్స్యే కాదన్న భావన తల్లిదండ్రు లలో ఏర్పడి ఓపికగా వ్యవహరిస్తే సగానికి పైగా సమస్యను అధిగమించినట్టే అవుతుంది.
చివరిగా…
చిన్నపిల్లలో వచ్చే ఆటిజం సమస్యను బూతద్దంలో చూడకుండా దాన్ని పరిష్కరించుకునే దిశలో పనిచేయటం ముఖ్యం. అందుకే తల్లిదండ్రులే దీనికి తొలి పరిష్కర్తలు. తొలిదశలోనే గుర్తించటం వలన తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ నష్తనివారణకు ప్రయత్నించవచ్చు.
ఆటిజాన్ని పూర్తిగా నివారించలేకపోయినా, దాని లక్షణాల తీవ్రతను తగ్గిమ్చవచ్చుననే అవగాహన కల్పించటం మీద దృష్టి సారించాలి. ఇది ఒక జీవనశైలి మాత్రమే అని చాటిచెబుతూ ఏ మాత్రం కుంగిపోనక్కర్లేదని, కాస్త వెనుకబడినా ఎప్పటికీ ముందడుగేస్తూనే ఉంటామని చెప్పటమే ఈ నినాద లక్ష్యం. అందుకే ఆటిజం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం, లక్షణాలను గుర్తించి డాక్టర్ ను సంప్రదించటం చాలా ముఖ్యం.
Youtube:
Watch: Tips for Good Parenting by Dr Anitha Are, Clinical Psychologist