అధిక బరువున్నవారు దానిని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారం తక్కువ తినటం, తినే ఆహారంలో మార్పులు చేసుకోవటంతో పాటు వ్యాయామం, యోగా వంటివి కూడా ఆచరిస్తుంటారు. అయితే ఈ ప్రయత్నంలో కొంతమంది త్వరగా బరువు తగ్గితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం బరువు తగ్గరు. ఏం చేసినా బరువు తగ్గటం లేదే… అని బాధపడేవారు తమ అలవాట్లు జీవనశైలిని ఒకసారి పరిశీలించుకోవాలి…. వారి ఆశని నేరవేరనీయకుండా చేస్తున్న అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం, నిద్రపై శ్రద్ధ అవసరం
బరువు తగ్గటం విషయంలో ఆహారమే ముఖ్యమైన అంశం. అందులో సందేహం లేదు. కానీ మరికొన్ని అంశాలు సైతం మనకు తెలియకుండానే మన బరువుపైన ప్రభావాన్ని చూపుతుంటాయి. అలాంటివాటిలో నిద్ర కూడా ఒకటి. తొమ్మిది గంటలకు మించి, ఐదు గంటలకు తక్కువగా నిద్రపోయే వారిలో ఆకలిని నిర్దేశించే హార్మోన్లలో మార్పు వస్తుంది. అలాగే నిద్ర తక్కువై శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోతే వ్యాయామం సైతం చేయలేరు. ఈ కారణాల వలన బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గాలనుకునేవారు దాహమేసినప్పుడు నీటిపైనే ఆధారపడాలి.
నీరు మన శరీరంలోకి ఏ మాత్రం కేలరీలను చేర్చకుండా దాహం తీరుస్తుంది. నీటిని తాగటం వలన సోడాలు, పళ్లరసాలు, కెఫిన్ ఉన్న డ్రింకులు వంటివి తాగకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. బరువుని పెంచడంలో ఇలాంటి డ్రింకులు సైతం ప్రధాన పాత్రని పోషిస్తుంటాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ పరిమాణంలో తినటం మంచిది కాదు. అలా చేయటం వలన శరీరంలో జీవక్రియలు మందగించి కేలరీలు ఎక్కువగా ఖర్చు కావు. దాంతో బరువు పెరుగుతారు. అలా జరగకుండా ఉండాలంటే చిన్న పరిమాణంలో ఆహారాన్ని ఎక్కువసార్లు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇంటి భోజనం ఆరోగ్యకరం
ఇంటి భోజనం ఆరోగ్యకరమని మనందరికీ తెలుసు. ఇంటి భోజనం బరువుని సైతం అదుపులో ఉంచుతుంది. అలాకాకుండా ప్రతిరోజూ లేదా తరచుగా హోటళ్లలో తినేవారు అవసరానికంటే అదనంగా తినటం, బరువు పెరగటం జరుగుతుంది. ఎక్కువ సమయం కూర్చుని ఉద్యోగాలు చేసేవారు, టీవీ చూసేవారు అనవసరంగా అదనంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. తమకు తెలియకుండానే అలా చేసే అవకాశం ఉంది. అలాంటివారు తప్పనిసరిగా రోజులో మూడు నాలుగుసార్లు కొన్ని నిముషాల పాటయినా వాకింగ్ చేయటం మంచిది.
బరువు తగ్గకుండా అడ్డుపడేవి ఇవే
బరువు తగ్గడానికి వ్యాయామాలు చేసేవారు వర్కవుట్ల అనంతరం మరీ ఎక్కువగా తినేస్తుంటే వ్యాయామం చేసిన ఫలితం దక్కదు. అలాగే స్పోర్ట్స్ డ్రింకులు, ప్రొటీన్ బార్లు తీసుకునే అలవాటు ఉంటే మానేయాలి. ఇలాంటివాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ సైతం బరువుని పెంచుతుంది. ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నవారు కూడా అనవసరంగా తింటారు. అలాగే వీరిలో ఆరోగ్యకరం కాని ఆహారం తినే అలవాటు ఉంటుంది. ఇవన్నీ బరువు తగ్గనీయకుండా అడ్డుపడుతుంటాయి.
అతిగా తినకూడడు
బరువు తగ్గాలంటే ఆహారం విషయంలో ప్లానింగ్ తో ఉండాలి. ఏది రుచికరంగా అనిపిస్తే దానిని తినేయాలని అనుకోకూడదు. జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ లాంటి వి చూసినప్పుడు ఆగలేక తినేస్తుంటారు కొందరు. వీటిలో పీచు ఉండకపోవటం వలన ఎంత తిన్నా సంతృప్తి అనేది ఉండదు. దాంతో అవసరానికి మించి మరింత ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సివస్తుంది. థైరాయిడ్ లోపాలు ఉన్నా బరువు పెరుగుతారు.
థైరాయిడ్ సమస్య ఉందో లేదో తెలుసుకోవాలి
బరువుపెరుగుతున్నవారు తమకు థైరాయిడ్ సమస్య లేదని నిర్దారించుకోవటం అవసరం. కొన్నిరకాల మందులు సైతం శరీర బరువుని కొంతవరకు పెంచుతాయి. ఉదాహరణకు స్టిరాయిడ్స్ వాడినప్పుడు జీవక్రియలలో మార్పులు వచ్చి ఆకలి పెరుగుతుంది. దాంతో ఎక్కువ తింటారు. కనుక మందుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
బరువు పెరిగేందుకు మనం ఊహించని అంశాలు సైతం కారణం అవుతుంటాయి. ఉదాహరణకు మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో హార్మోన్ల మార్పు వచ్చి బరువు పెరిగే అవకాశం ఉంది. కొన్నిరకాల అనారోగ్యాలున్నపుడు కూడా బరువు పెరుగుతుంటారు. అలాగే కొంతమంది జన్యుపరంగా కూడా అధిక బరువుతో ఉంటారు. ఒబేసిటీతో బాధపడుతూ ఎన్నిప్రయత్నాలు చేసినా బరువు తగ్గకపోతే ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది.