ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వందల్లో మరణాలు, వేలల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా ను అరికట్టే టీకా ఎప్పుడు వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో కరోనా వ్యాధిని అరికట్టడంలో రోగనిరోధక శక్తిదే కీలక పాత్ర అని వైద్యులు చెబుతున్నారు. అందులో విటమిన్ సి తో పాటు విటమిన్ డి కూడా కరోనాను కట్టడి చేయడంలో బాగా ఉపయోగపడుతోంది.
సూర్యరశ్మి చాలా ముఖ్యం
దాదాపు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉదయించగానే భూగోళం మీద జీవరాశి నిద్ర మత్తుని వదిలించుకుంటుంది. కొత్త చైతన్యాన్ని రెక్కలుగా తొడుక్కుని కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. అంతెందుకు ఈ భూమి మీద ప్రాణకోటి సజీవంగా ఉంది అంటే దానికి కారణం కూడా సూర్యుడే. సూర్యుడితో మన బంధం అంత బలమైనది.
దురదృష్టవశాత్తు ఆ సూర్యున్ని అశ్రద్ధ చేయడం వల్లే మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే చాలామంది విస్తుపోవచ్చు. కానీ ఇది నిజం.
సూర్యరశ్మితో ముడిపడిన విటమిన్ డి లోపించడం వల్ల లెక్కలేనన్ని జబ్బులొస్తున్నాయని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
విటమిన్ డి లోపానికి కారణాలు
మన శరీరంలో జీవక్రియలు సాఫీగా జరగాలంటే విటమిన్స్ అనేవి చాలా అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ డి లోపించడం తరచుగా చూస్తున్నాం. ప్రతి వంద మందిలో ఎనభై మందికి విటమిన్ డి లోపం ఏర్పడింది. ఇప్పుడు అన్నీ ఆఫీసుల్లో కూర్చుని చేసే ఉద్యోగాలే. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వలన కూడా ఎవరూ సూర్యరశ్మిని పొందటం లేదు. దీనివల్ల ఎవరికీ సహజంగా సూర్యుడి నుంచి అందాల్సినంత విటమిన్ డి అందటం లేదు.
విటమిన్ డి లోపానికి కారణమయ్యే జబ్బులు
అల్సరేటివ్ కొలైటిస్, మాలా అబ్సార్ప్షన్ సిండ్రోమ్, లాక్టోజ్ ఇంటాలరన్స్, గ్లూటన్ ఇంటాలరన్స్ వంటి జబ్బుల వలన కూడా మన శరీరం గ్రహించాల్సిన పరిమాణంలో విటమిన్లను గ్రహించదు. కాలేయం, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో కూడా విటమిన్ డి తగ్గిపోతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో, డయాలసిస్ చికిత్సలో ఉన్నవారిలో, ఫ్యాటి లివర్ సమస్య ఉన్నవారిలో, కామెర్లు ఉన్నవారిలో, తరచుగా స్టిరాయిడ్స్ తీసుకునే వారిలో, కడుపులో గ్యాస్, అల్సర్లు ఉన్నవారిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది.
విటమిన్ డి లోపం వలన కలిగే అనర్ధాలు
విటమిన్ డి అనేది క్యాల్షియం, ఫాస్ఫరస్ మెటబాలిజంలోనే కాకుండా కార్డియో వ్యాస్క్యులర్ హెల్త్, న్యూరో మస్క్యులర్ హెల్త్ ఇంకా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కరోనా బారినపడి మరణిస్తున్న వారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. సైటోకైన్ స్టార్మ్ అంటే ఇమ్మునిటీని పెంచి ఇన్ఫెక్షన్ పై పోరాడే వ్యవస్థ ఇన్ఫెక్షన్ తగ్గగానే నార్మల్ కి రావాలి కానీ అలా జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం విటమిన్ డి లోపమే. సైటోకైన్ స్టార్మ్ వ్యవస్థని నియంత్రణలో ఉంచడంలో విటమిన్ డి పాత్ర చాలా ఉంటుంది. కానీ విటమిన్ డి లోపం వలన సైటోకైన్ స్టార్మ్ నియంత్రణ కోల్పోయి తిరిగి రోగి ఇతర అవయవాల మీద దాడి చేస్తోంది.
అంటే మనలోపల ఉన్న సైటోకైన్ స్టార్మ్ ఎప్పుడైతే ఊపిరితిత్తుల మీద దాడి చేస్తుందో, అప్పుడు రక్తనాళాల నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ఇలా రోగనిరోధక శక్తి సరిగా పనిచేయకపోవడం వలన అవయవం పూర్తిగా డ్యామేజ్ అవడం జరుగుతోంది.
విటమిన్ డి గురించి ఇన్నాళ్ళు ఎందుకు ఆలోచించలేదు?
ఇంతకుముందు రోజుల్లో విటమిన్ డి అంటే ఎముకలకు బలాన్ని ఇస్తూ ఎముకలు విరక్కుండా, రికెట్స్ అనే వ్యాధి నుంచి కాపాడుతుంది అని మాత్రమే తెలుసు. నిదానంగా చాలా పరిశోధనలు జరిగిన తరువాత విటమిన్ డి కి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందని తెలుస్తోంది. 30 ఏళ్ల క్రితం విటమిన్ డి టెస్ట్ చేయడం అనేది చాలా లాబ్స్ లో ఉండేది కాదు. కానీ ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లు కూడా విటమిన్ డి టెస్ట్ చేయించి అవసరమైన మందులు ఇస్తున్నారు.
అసలు విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది?
విటమిన్ డి అనేది దాదాపు 80 శాతం వరకు మన శరీరంలోనే తయారవుతుంది. దీనికి సమృద్ధిగా లభించే సూర్యరశ్మి అవసరం. మిగిలిన 20 శాతం ఆహారం ద్వారా లభిస్తుంది. రెండింటినీ కలిపి విటమిన్ D3 రూపంలో శరీరానికి ఉపయోగపడేలా తయారు చేసుకుని తన అవసరాలను తీర్చుకుంటుంది మన శరీరం.
సూర్య రశ్మి అందేలా ఎండలో కూర్చున్నా ఒక ప్రత్యేకమైన సమయంలో కూర్చుంటేనే విటమిన్ డి మన శరీరానికి అందుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఆరు గంటల సమయంలో ఎండలో కూర్చుంటేనే విటమిన్ డి సమృద్ధిగా శరీరానికి అందుతుంది. సూర్యుడు ఎప్పుడైతే ప్రకాశవంతంగా ఉంటాడో అప్పుడు ఎండలో కూర్చుంటేనే కావలసినంత విటమిన్ డి శరీరం గ్రహిస్తుంది. ఇందులో కూడా అల్ట్రా వైలెట్ కిరణాలు (UVB) 280 నుండి 350 నానో మీటర్ మోతాదులో విడుదలైతేనే శరీరానికి విటమిన్ డి సరిపడా అందుతుంది.
ఎండలో కూర్చుంటే విటమిన్ డి ఎంతమేరకు అందుతుంది?
అయితే ఎంత సమయం కూర్చోవాలి అనేది ఎవరి అవగాహనలో లేదు. కాస్త తెలుపు రంగు చర్మం కలిగి ఉన్నవారు 20 నుంచి 25 నిమిషాల పాటు ప్రకాశిస్తున్న సూర్యుడి కిరణాలను తమ శరేరానికి అందేలా కూర్చుంటే సరిపోతుంది. చామన చాయ రంగు ఉండి, చర్మం మందంగా ఉన్నవారి చర్మం సూర్య కిరణాలను తొందరగా గ్రహించదు. ఇలాంటి వారు కస్త ఎక్కువసేపు అంటే 35 నుంచి 40 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి. అయితే కొంతమందిలో ఉన్న అపోహ ఏంటంటే ‘ఎక్కువసేపు ఎండలో కూర్చుంటే ఎక్కువ విటమిన్ డి దొరుకుతుంది అని’ ఇందులో నిజం లేదు.
విటమిన్ డి లోపం ఉన్నపుడు
మన శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నపుడు అలసట, నీరసం, జుట్టు రాలటం, ఒళ్ళునొప్పులు, కీళ్ల నొప్పులు, చురుకుదనం లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్నపుడు దాన్ని అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. మనం అనుకున్నట్టుగానే విటమిన్ డి ఆహారం, ఎండ నుండి దొరుకుతుంది. మనదేశంలో ఇప్పటివరకు ఉన్న అధ్యయనాలు చూస్తుంటే 80 శాతం మందిలో విటమిన్ లోపం ఉన్నట్లు తెలుస్తుంది.
ఎవరెవరిలో ఎంతశాతం?
మరో అధ్యయనంలో స్కూల్ పిల్లల్లో 90శాతం మందిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు వెల్లడైంది. అలాగే స్త్రీలలో 90 శాతం కంటే ఎక్కువగా విటమిన్ డి లోపం ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. కొన్ని మతాలు, వాళ్ళ ఆచారాల కారణంగా కూడా స్త్రీలకు విటమిన్ డి లోపం పెరుగుతోందని తెలుస్తోంది. వస్త్రధారణ, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా పిల్లలు, వృద్ధులు, స్త్రీలలో విటమిన్ డి లోపం ఏర్పడుతోందని తేలింది. ఈ లోపానికి కారణం వారికి ఎండ తగలకపోవడమే. విటమిన్ డి లోపంతో బాధపడే డాక్టర్లు కూడా మనదేశంలో ఉన్నారు.
స్కూల్ పిల్లలు, స్త్రీలు, ఎయిర్ ఫోర్స్, నావి, ఇండోర్ గేమ్స్ ఆటగాళ్లు, క్రికెటర్లలో కూడా విటమిన్ డి లోపం ఉందని తేలింది.
రాబోయే తరాలకు ఈ విటమిన్ లోపం రాకుండా అపగలమా అన్నది నేడు అందరికీ ఎదురవుతున్న ప్రశ్న.
విటమిన్ డి ఏ ఆహారంలో ఎక్కువ?
విటమిన్ డి అనేది శాఖాహారంలో చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆహారం ద్వారానే విటమిన్ డి తీసుకోవాలనుకుంటే చేపలు, లివర్ లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. అయితే మేము ఎండలో బాగానే కూర్చుంటున్నాము, మాంసాహారం బాగానే తీసుకుంటున్నాము అయినా కూడా మాకు విటమిన్ డి ఎందుకు తక్కువగా ఉంటోంది అనేవాళ్లూ ఉన్నారు. మారిపోయిన మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వలన మన పేగులు విటమిన్ డి ని గ్రహించలేకపోతున్నాయి.
ఎంతమోతాదులో విటమిన్ డి ఉండాలి?
అయితే శరీరంలో విటమిన్ డి ఎంతవరకు ఉండాలి అంటే రక్తంలో 32 nanograms/milliliter కన్నా ఎక్కువ ఉంటేనే మనశరీరంలోకి విటమిన్ డి నార్మల్ గా ఉన్నట్టు. 20 నుంచి 30 మధ్యలో ఉంటే విటమిన్ డి లెవెల్ తక్కువగా ఉంది అనుకోవచ్చు. 20 కన్నా తక్కువగా ఉంటే దాన్ని విటమిన్ డి లోపంగా గుర్తించవచ్చు. బరువు తగ్గడానికి వాడే మందుల వలన కూడా శరీరం విటమిన్ డి ని తక్కువగా గ్రహిస్తుంది. మనం వాడే రకరకాల మందులు శరీరంలో విటమిన్ డి లోపానికి కారణం కావచ్చు. పాలు ఎక్కువగా తాగేవారిలో కూడా లాక్టోజ్ ఇంటాలరన్స్ ఏర్పడి అది కూడా విటమిన్ డి లోపానికి దారి తీస్తోంది.
ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి?
అందుకే సీజన్ ని బట్టి మన ఆహారాన్ని మార్చుకోవాలి. వర్షాకాలం, చలికాలంలో విటమిన్ డి సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇష్టం ఉన్నట్లు ఆహారపు అలవాట్లు మార్చేయడం, సమతులాహారం తీసుకోకవడం వలన విటమిన్ డి లోపంతో పాటు విటమిన్ B12 లోపం, రక్తహీనత కూడా వస్తోంది. క్యాల్షియం తగ్గి ఎముకల సమస్యలు వస్తున్నాయి. మధ్యపానం అలవాటు మనం తినే పోషకాహారాలు, ఖనిజ లవణాలను శరీరం గ్రహించే శక్తిని తగ్గిస్తుంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఒకటి ఆల్కహాల్ మానేయడం లేదా డాక్టర్ సమక్షంలో విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం.