ADHD ఉన్న పిల్లలకు చికిత్స ఎప్పుడు అవసరం అవుతుందంటే?

ADHD in Children
ADHD in Children

పిల్లల అతి ప్రవర్తనగా చెప్పే ఏ డీ హెచ్ డి అనే వ్యాధికి కచ్చితమైన కారణమంటూ లేకపోయినా, అది అనేక విషయాల ఉమ్మడి ప్రభావమని డాక్టర్లు భావిస్తున్నారు.

  • జన్యువుల ప్రభావం
  • మెదడులో రసాయనాలు అదుపు తప్పటం
  • గర్భిణులు మాదకద్రవ్యాలకు అలవాటు పడటం
  • సీసం లాంటివి మెదడును ప్రభావితం చేయటం
  • మెదడుకు దెబ్బతగలటం లాంటి కారణాలతో పిల్లలకు  ఈ సమస్య వస్తున్నట్టు వైద్య నిపుణులు భావిస్తున్నారు.

పిల్లల్లో ఎ డి హెచ్ డి లక్షణాలను మూడు రకాలుగా వర్గీకరించి చెబుతారు. దేన్నీ సరిగా పట్టించుకోక పోవటం ఒక రకం.

  • ఊరికే దృష్టి మళ్లిపోవటం
  • చెప్పినమాట వినకపోవటం, చేయకపోవటం
  • అసలు వింటున్నట్టే ఉండకపోవటం
  • నిర్లక్ష్యంగా ఉంటూ తప్పులు చేయటం
  • రోజువారీ పనులు కూడా మరచిపోవటం
  • కదలకుండా కూర్చొని చేయాల్సిన పనులు ఇష్టపడకపోవటం
  • తరచూ వస్తువులు పోగొట్టుకోవటం
  • పగటి కలలు కంటూ ఉండటం ఈ రకం లక్షణాలు. మరో రకం లక్షణాలు అతి చురుకుదనం కిందికి వస్తాయి.
  • కదలకుండా కూర్చోలేకపోవటం
  • నిశ్శబ్దంగా ఉండలేకపోవటం
  • ఎప్పుడు పరుగు తీయటమో పైకి ఎక్కటమో చేస్తూ ఉండటం
  • అతిగా మాట్లాడటం
  • వెనుక ఎవరో తరుముతున్నట్టు వెళ్ళటం
  • తనవంతు వచ్చేదాకా ఆగలేకపోవటం
  • హడావిడిగా జవాబులు చెప్పే ప్రయత్నం చేయటం
  • ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుపడటం లాంటివన్నీ ఈ రకం. ఈ రెండు రకాలూ కలగలిపి ఇతర లక్షణాలు ప్రదర్శిస్తే అది మూడో రకం కిందికి వస్తుంది. ఈ లక్షణాలను బట్టి ప్రాథమికంగా ఒక అంచనాకు రావటానికి వీలుంది.

పిల్లల్లో ఎ డి హెచ్ డి ని నిర్థారించటం చాలా కష్టం. ఏ ఒక్క పరీక్షతోనో గుర్తించటం కుదిరే పని కాదు. పిల్లవాడితో, తల్లిదండ్రులతో టీచర్లతో సుదీర్ఘంగా ఆ లక్షణాలను చర్చించి పిల్లవాడి ప్రవర్తనను పరిశీలించిన తరువాత మాత్రమే డాక్టర్లు ఒక అంచనాకు రాగలుగుతారు. ఎన్ని లక్షణాలు ఎంతకాలంగా ఉన్నాయనేది కూడా చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని పరిశీలించటానికి వారిమీద అనేక పరీక్షలు జరుపుతారు. నిజానికి ఇది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, సైకోథెరపిస్టుల లాంటి స్పెషలిస్టుల పని. పిల్లవాడితోబాటు ఆ కుటుంబ సాంఘిక, వైద్య చరిత్రను తెలుసుకుంటారు. చూపు, వినికిడి, మాటలు, నడక గమనిస్తారు. తెలివితేటలు, వ్యక్తిత్వ వికాసం, విశ్లేషణ సామర్థ్యం లాంటివి అంచనావేయటానికి మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం కొంత సమాచారాన్ని తల్లిదండ్రుల ద్వారా సేకరిస్తారు. న్యూరో సైకియాట్రిక్ అంచనా వ్యవస్థ ఆధారంగా మెదడు తరంగాలను లెక్కగడతారు. ఈ తరంగాల నిష్పత్తి సాయంతో ఏ డి  హెచ్  డి ఉన్నదీ లేనిదీ నిర్థారిస్తారు.

ఎ డి హెచ్ డి చికిత్సకు రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. అయితే పరిశోధనలలో తేలిందేమిటంటే అనేక విధాలుగా లక్షణాల తీవ్రత తగ్గించటమే మేలు అని. లక్షణాలలో చాలావరకు మందుల ద్వారా, థెరపీ ద్వారా తగ్గే అవకాశాలున్నాయి. అయితే థెరపిస్టులు, డాక్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం, సహకారం ఎంతో అవసరం. మందులుగా ఉత్ప్రేరకాల వాడకం మీద వివాదాలున్నాయి. అవసరాన్ని మించిన మోతాదులో వాడతారన్నదే పెద్ద విమర్శ. పిల్లల అతి చురుకుదనానికి అడ్డుకట్టవేయటంతోబాటు వాళ్ళ ఏకాగ్రత సమయాన్ని పెంచటానికి ఆ మందులు పనికొస్తాయి. అందరికీ ఉత్ప్రేరక మందులు పనిచేయపోవచ్చు. ఆరేళ్ళు పైబడ్డ వారికి ఇతర మందులు ఇస్తారు. అందులో యాంటీ డిప్రసెంట్స్ కూడా ఉండవచ్చు. కాకపోతే ఏ డీ హెచ్ డి కి వాడే మందుల వల్ల ఆతృత, ఆకలి మందగించటం, నిద్రరాకపోవటం, చర్మం మీద మచ్చలు ఏర్పడటం, తలనొప్పి లాంటి సమస్యలు రావటానికి అవకాశముంది. ప్రవర్తనలో మార్పుకోసం కొన్ని రకాల థెరపీలు చేస్తారు. కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కలిగిస్తారు.

పిల్లలు కొంతమంది అతిగా అల్లరిచేయటమో, నిర్లక్ష్యంగా ఉంటూ సరిగా స్పందించకపోవటమో చేస్తూ ఉంటే ఆ లక్షణాలను అతిగా చేసే అల్లరికి నిదర్శనంగా భావించి అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ లేదా ఏ డీ హెచ్ డి అని నిర్థారించుకోవాల్సి ఉంటుంది. లక్షణాల ఆధారంగా డాక్టర్లు దీనిని నిర్థారించి మందుల ద్వారా లక్షణాలను నిదానింపజేస్తారు. కొన్ని ఉత్ప్రేరకాల సాయంతో చేసే ఈ చికిత్స సాధారణంగా ఐదేళ్ళలోపు పిల్లల మీద బాగా పనిచేస్తుంది. మందులకు బదులుగా కొన్ని రకాల థెరపీల ద్వారా కూడా లక్షణాల తీవ్రత తగ్గిస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top