ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ అంటారు – ప్రతి ఒక్కరూ ప్రజ్ఞావంతులే. కానీ మనం చేపను చెట్టెక్కమని ఆదేశిస్తే… ఆ పని చేయలేక అది జీవితాంతం తనను తానొక మూర్ఖుడిగా భావించుకుంటుంది… అని. అంటే పిల్లల్లో సహజాతమైన ప్రజ్ఞను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు. పిల్లల్లో తెలివితేటలను ఎలా గుర్తించాలి? వాళ్లల్లో తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలి? పిల్లల తెలివితేటలకు, వారి మానసిక స్థితికి సంబంధం ఏమిటి?
పిల్లల్లో తెలివితేటల్లో జన్యువుల పాత్ర కొంత వరకూ ఉంటుంది. అయితే జెనెటిక్స్ని పక్కనబడితే, పిల్లల ప్రజ్ఞా పాటవాలు ఎలా వృద్ధి చెందుతాయి? వాళ్లకు పోషకాహారం అందివ్వడం, టాక్సిన్స్ నుంచి రక్షణ కల్పించడం, తగినంత సమయం ఆడుకునేందుకు ప్రోత్సహించడం, ఎక్సర్‌సైజ్‌కి సమయం కేటాయించేలా చేయడం. చాలామంది శిశు వికాస నిపుణులు ప్రజ్ఞా పాటవాలను కొలవడం కంటే, ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా పిల్లలు పూర్తి మేధో సామర్ధ్యం సంతరించుకునే విధంగా సాయం చేయడంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
పుట్టినప్పటి నుంచి నాలుగు సంవత్సరాలు వయసు వచ్చే వరకూ మెదడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆరేళ్ల కంటే ముందే… వారి మెదడు… పెద్దవారి మెదడులో తొంభై శాతానికి చేరుతుంది. సరిగ్గా ఈ సమయమే నేర్చుకోవడానికి కీలకమైన దశగా గుర్తించవచ్చు. అలాగని నాలుగేళ్లు వయసు వచ్చేసరికి మెదడు ఎదుగుదల నెమ్మదిస్తుందో, ఆగిపోతుందో అని అనుకోనక్కర్లేదు. నిజానికి బాల్యమంతా మెదడు తనను తాను సమాయత్తం చేసుకుంటుంది, తనను తాను పునర్నిర్మించుకుంటుంది. మెదడులో ఈ మార్పులు కౌమారదశ దాటి యుక్త వయసు వచ్చే వరకూ కొనసాగుతాయి.
ఈ క్రమంలో మెదడు నిర్మాణం మరింత సంక్లిష్టమవుతుంది. అయితే దురదృష్టవశాత్తూ పిల్లల్లో మెదడు ప్రారంభ ఎదుగుదల సమయంలో వాళ్ల తల్లిదండ్రులు అనవసరంగా హైరానా పడి తమ పిల్లలు అన్ని ఒకేసారి నేర్చేసుకోవాలనే ఆతృతలో వారిని ప్రీప్రైమరీ స్కూల్సులో చేర్చుతున్నారు. ఆటబొమ్మలు, కంప్యూటర్ ప్రోగ్రాములు, పాటల వీడియోలు… వీటికంటే కూడా పిల్లల్లోని అంతర్ దృష్టులు వారి ఐక్యూని పెంచడంలో సాయపడతాయి.
చాలామంది పేరెంట్స్ తమ పిల్లలు చిన్నప్పుడే చకచకా నేర్చుకుంటే, పెద్దయ్యేక కూడా చురుగ్గా ఉంటారని గాఢంగా విశ్వసిస్తారు. కానీ పిల్లలు ఒత్తిడితో కాక, సహజంగా నేర్చుకుంటేనే ఉత్తమంగా నేర్చుకోగలుగుతారు. చిన్నప్పుడు వేగంగా నేర్చుకున్న పిల్లలు కూడా హైస్కూలు స్థాయికి చేరుకునే సరికి నెమ్మదిస్తారు. అప్పుడు సాధారణ విద్యార్థులు వారిని అందుకుంటారు. అయితే పిల్లల్లో మేధో వికాసంలో ప్రారంభ సంవత్సరాలు కీలకమైనవే. ఈ సంవత్సరాల్లో బ్రెయిన్ లోని లోయర్ సర్క్యూట్స్, హయ్యర్ సర్క్యూట్స్ కంటే ముందే నిర్మితమవ్వాలి. అప్పుడే అధునాతన నైపుణ్యాలు, ప్రాథమిక నైపుణ్యాల ఆధారంగా అలవడతాయి.
ఈ ప్రాథమిక నైపుణ్యాల్లో ఒకటి సన్నిహిత సంబంధాల కోసం మెదడు ఒక టెంప్లేట్‌ని తయారు చేసుకోవడంలో సహాయపడుతుంది… సాధారణంగా అది తల్లిదండ్రుల, సంరక్షకుల ముందస్తు అనుబంధం ద్వారా సాధ్యపడుతుంది. శిశువుకు తన చుట్టూ ఉన్న వాళ్లతో ఏర్పడే అనుబంధం, కీలకమైన భావోద్వేగాలు ఇంకా సామాజిక అభివృద్ధి… అన్నీ కలసి తెలివైన శిశువు రూపొందడానికి దోహదం చేస్తాయి.
పిల్లల్లో ‘‘స్థిర మానసిక స్థితి’’, ‘‘ఎదిగే మానసిక స్థితి’’ అనే రెండు రకాల మానసిక స్థితులను మనం గమనించొచ్చు. ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉన్న పిల్లలు… అప్పటికే వారికి ఉన్న ‘తెలివైన పిల్లలు’ అనే ట్యాగ్‌ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాము ఏదైతే బాగా చేయగలమో అదే చేస్తారు. అదే సమయంలో గ్రోత్ మైండ్‌సెట్ ఉన్న పిల్లలు కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. తొలి ప్రయత్నంలో వాళ్లు ఓడిపోయినా సరే, రెండో ప్రయత్నంలో విభిన్నంగా ప్రయత్నించడం లేదా మరింత గట్టిగా కృషి చేయడం ద్వారా సవాల్‌ని అధిగమిస్తారు.
అందుకే మీరు తెలివైన వాళ్లు అని ఒక ముద్ర ముందుగానే వారిపై వేసేసి, వారికి ఏదైనా తేలిగ్గానే వచ్చేస్తుందనే భావన కలిగించడం సరికాదు. అలా రానప్పుడు వాళ్లు నైరాశ్యానికి లోనయ్యే అవకాశముంటుంది. వాళ్ల శక్తి సామర్థ్యాలపై నమ్మకాన్ని ఉంచుతున్నామనే విషయాన్ని పెద్దలు వాళ్లకు తెలియజేస్తూనే, ఏదైనా సాధించాలంటే శ్రమించడం కూడా ముఖ్యం అని వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వారిని ఏదైనా కొత్తది నేర్చుకొనేటప్పుడు ఆసక్తి, ఉత్సాహం, కొంచెం శ్రమ మిళితం చేసి నేర్చుకోమని నిర్దేశించాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.
నిజానికి మెదడు కూడా ఒక కండరం లాంటిదే. రోజూ వ్యాయామం చేస్తూ, దేహ కండరాల్ని ఎలా బలోపేతం చేసుకుంటున్నామో, రోజూ పజిల్స్, ప్రాబ్లమ్స్ వంటి వాటితో మెదడుకు మేతనందిస్తూ, దానిని కూడా బలోపేతం చేసుకోవచ్చు. తద్వారా తెలివితేటలు పెంచుకోవచ్చు.