పిల్లల్ని కనటానికి కొంతకాలం ఆగాలని అనుకునేవాళ్ళుంటారు. వెంటనే కనాలని కోరుకునే వాళ్ళూ ఉంటారు. ఒకసారి కనాలని అనుకోగానే పిల్లలు పుట్టకపోవచ్చు. అంతా మన చేతుల్లో ఉండదు. కానీ గర్భం ధరించే అవకాశాలు మెరుగు పరచుకోవటానికి మనం చేయాల్సినవి, చెయ్యకూడనివి కొన్ని ఉంటాయని వైద్యశాస్త్రం చెబుతోంది. మరి త్వరగా గర్భం ధరించాలంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదో చూద్దాం.
భార్యాభర్తల బాధ్యతలు
పిల్లల్ని కనాలనే నిర్ణయం అమలు చేయటం మనం అనుకున్నంత సులభం కూడా కాకపోవచ్చు. అంతమాత్రాన అకస్మాత్తుగానే గర్భధారణ జరిగే అవకాశం లేదనీ కాదు. అయితే, కచ్చితంగా గర్భం రావాలంటే మనవైపు నుంచి మనం చేయదగిన పనులు కొన్ని ఉంటాయి. ఇవి పాటించటం వలన గర్భధారణకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు కల్పించటం కచ్చితంగా భార్యాభర్తల బాధ్యత.
పిల్లల్ని కనాలన్న నిర్ణయం తీసుకోగానే చెకప్ చేయించుకొని, పుట్టబోయే బిడ్డకు పుట్టుకతోనే సమస్యకు రాకుండా ఫోలిక్ యాసిడ్ ఉండే విటమిన్ల గురించి డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి. అంటే గర్భధారణకు ముందే ఈ విటమిన్లు తీసుకోవటం మంచిది. ఇంకేవైనా సమస్యలున్నా గర్భధారణకు ముందే తెలుసుకోవటం కూడా అవసరం.
ఆ తరువాత ముఖ్యమైన విషయం ఋతుచక్రం పట్ల సరైన అవగాహన ఉండటం. అంటే, అండాశయం ఫలదీకరణకు అనువైన సమయాన్ని తెలుసుకొని ఆ సమయంలో సంభోగించటం వలన మాత్రమే ఫలితముంటుంది. అండం విడుదలయ్యే సమయంలో ఎక్కువగా పాల్గొనటం వలన గర్భధారణ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఋతుస్రావం అయిన మొదటి రోజునుంచి మొదలుపెట్టి లెక్కబెట్టి తొమ్మిదవ రోజునుంచి ప్రయత్నించాలి.
ఎక్కువమందికి 28 రోజుల ఋతుచక్రంలో 14వ రోజున అండాలు విడుదలయ్యే అవకాశం ఎక్కువ. అయినప్పటికీ వీలైనంత ఎక్కువ అవకాశం ఉండేలా 9వ రోజునుంచి ప్రయత్నించటం మంచిది. సంభోగం తరువాత కనీసం 10 నుంచి 15 నిమిషాలపాటు అలాగే పడుకోవాలి. ఇవన్నీ గర్భధారణకు అనుకూలమైన పనులు కాబట్టి వీటిని పాటించటం మంచిది.
వేగంగా గర్భం ధరించాలంటే?
పిల్లల్ని కనాలనుకునేవాళ్ళలో కొన్ని అపోహలుంటాయి. ముందుగా వాటిని పోగొట్టుకోవాలి. అదే విధంగా గర్భధారణకు అనుసరించకూడని పద్ధతులూ కొన్ని ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. గర్భ నిరోధక సాధనాల వాడకం ఆపేసిన వెంటనే గర్భధారణకు ప్రయత్నించకూడదనేది అపోహ మాత్రమే.
నిజానికి వాటి వాడకం ఆపేసిన వెంటనే ప్రయత్నించవచ్చు. ఋతుస్రావం పూర్తయిన మొదటి వారం రోజుల్లో సంభోగం వలన గర్భ ధారణ జరగదు. అందుకే కుటుంబ నియంత్రణ పాటించాలనుకునేవారు గర్భ నిరోధక సాధనాలు వాదకుండా సంభోగించటానికి ఇది సరైన సమయమని చెబుతారు.
గర్భ ధారణ కోసం సూచించే కొన్ని పద్ధతులు అశాస్త్రీయమైనవీ ఉన్నాయి. సంభోగం ముగిసిన వెంటనే కొంత సేపు అలాగే పడుకోవాలన్నది మాత్రమే శాస్త్రీయం. అంతే తప్ప కాళ్ళు గాల్లోకి పెట్టి ఉంచాలన్నది అర్థం లేని సూచన మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే సంభోగం పూర్తయిన వెంటనే బాత్రూమ్ కి వెళ్ళకూడదు. పురుషులు బిగుతైన దుస్తులు ధరించటం వలన సెర్మ్ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంది.
అందువలన అలాంటి దుస్తుల వాడకాన్ని నివారించాలి. అదే విధంగా పాంటు జేబులో సెల్ ఫోన్లు పెట్టుకునేవాళ్లలో కూడా వీర్యంనాణ్యత తక్కువగా ఉంటున్నట్టు తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సోయా ఉత్పత్తులు ఎక్కువగా తినేవారిలోనూ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటున్నట్టు తేలింది. తిననివాళ్ళనూ, తినేవాళ్ళనూ పరిశీలించినప్పుడు సోయా ఉత్పత్తుల గురించి తెలిసినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతికూల పరిస్థితులు ఉండకూడదు
రోజూ సంభోగించటం వల్ల మాత్రమే గర్భధారణ జరుగుతుందనుకోవటం సరికాదు. అండం విడుదలయ్యే సమయమే చాలా కీలకం. సంభోగం తరువాత వీర్యకణం 72 గంటలపాటు సజీవంగా ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని కనాలనే వత్తిడికి లోను కావటం కూడా మంచిది కాదు. చుట్టుపక్కలవాళ్ళు అంటున్నారని అనవసరమైన వత్తిడి పెంచుకోకూడదు. నిజానికి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది.
త్వరగా గర్భ ధారణ జరగాలనే ఆతృతలో మద్యం సేవించటం లాంటి పనులకు పాల్పడకూడదు. పొగతాగటం వలన కూడా పిల్లల్ని కనగలిగే అవకాశాలు తగ్గిపోతాయి. వ్యాయామం చేయటం ద్వారా బరువు అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది. అదే సమయంలో అతిగా వ్యాయామం చేయటం వలన అండం విడుదలకాకపోయే ప్రమాదం కూడా ఉందని గ్రహించాలి.
రోజుకు అరగంట పాటు వేగంగా నడిస్తే ఆ వ్యాయామమే సరిపోతుంది. అండం విడుదలను లెక్కగట్టి చెప్పగలిగే కిట్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటివలన గర్భ ధారణ అవకాశాలు మెరుగుపరచే సూచనలు కూడా అందుతాయి. ఋతు చక్రం మీద పూర్తి అవగాహన కలుగుతుంది.
గర్భధారణకు అనుకూలించే పరిస్థితులు
ఏమైనా ఆరోగ్యకరమైన జీవితం గడుపుతూ ఉన్నప్పుడు గర్భం ధరించాలనుకుంటే ఎక్కువకాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. తీవ్రమైన మానసిక వత్తిడికి లోను కాకుండా, అవసరమైతే యోగా లాంటివి చేయటం ద్వారా వత్తిడి తగ్గించుకొని గర్భధారణకు అనువైన వాతావరణం కల్పించుకోవచ్చు. ఋతుచక్రాన్ని లెక్కవేసుకుంటూ సరైన సమయంలో సంభోగంలో పాల్గొనటం మంచి ఫలితాలనిస్తుంది.