మన జీవితానికి అర్థం ఇదీ!!

Meaning of life

జీవితం బాగుంది. అనిపించాలంటే చాలా విషయాలు మనకు అనుకూలంగా ఉండాలి. మంచి ఆరోగ్యం, చక్కని కుటుంబ సంబంధాలు, ఆర్థిక భద్రత, సమాజంలో గౌరవం, నచ్చిన ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు… ఇలాంటివి ఎన్నో ఉంటే కానీ జీవితం బాగుంది అనే సంతృప్తి కలగదు. ఇవన్నీ వాస్తవమే అయినా… మన జీవితానికి అర్థం ఉంది… అనే భావం కలిగితే చాలు… మన రోజువారీ జీవితంలో మానసికంగా శారీరకంగా ఆనందంగా సంతృప్తిగా ఉండగలం అంటున్నారు మానసిక పరిశోధకులు. అంటే… మనం ఇందుకోసమే బతుకుతున్నాం.. అనేంతగా మనకు నచ్చిన ఆశయమో, ఆకాంక్షో మన జీవితంలో ఉండాలన్న మాట.

అసలు ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియటం లేదు, నా జీవితానికి అర్థమే లేకుండా పోయింది. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు సినిమాలలో, సీరియళ్లలో వినబడుతుంటాయి. నిజ జీవితంలో కూడా ఈ తరహా గందరగోళం కొంతమందిలో ఉంటుంది. జీవితంలో ఏదోఒకరకంగా నిరాశా నిస్పృహలకు గురవుతున్నవారుతమ జీవితానికి అర్థమే లేకుండా పోయిందని బాధపడుతుంటారు. ఇలాంటివారు జీవితానికి అర్థం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది.

నిరాశపడేవారిపై  వారి ఆలోచనలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?

జీవితానికి అర్థం ఉంది అని భావించడం వలన ఆరోగ్యం బాగుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా వయసు పెరుగుతున్న దశలో ఉన్నవారికి ఇలాంటి భావం ఉండటం మరింత అవసరం. పనిచేయలేని స్థితిలో ఉన్నవారికి తాము ఏమీ చేయలేకపోతున్నామని, తమ అవసరం ఎవరికీ లేదనే నిరాశ ఉంటుంది. దాంతో వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేరు. ఆనందంగా ఉత్సాహంగా ఉండలేరు. దాంతో ఆరోగ్యం మరింతగా దిగజారుతుంది. జీవితానికి అర్థం లేదనుకుంటే ఆరోగ్యం దిగజారటం ఒక సమస్య అయితే … అనారోగ్యాలకు గురయిన సమయంలో… జీవితానికి అర్థం లేదని భావిస్తే వాటినుండి కోలుకోవటం మరింత కష్టంగా, మరొక సమస్యగా మారుతుంది.

నా అవసరం ఎవరికీ లేదు… నేను బతికి ఏం లాభం… లాంటి ఆలోచనలు జీవితేచ్ఛని, జీవించాలనే కోరికని హరించివేస్తాయి. అలాగే ఒక్కోసారి రోజంతా చాలా బిజీబిజీగా గడుపుతున్నవారికి కూడా జీవితానికి అర్థం లేదనే నిరాశ ఎదురు కావచ్చు. ఇలాంటప్పుడు మనం రొటీన్ గా చేసే పనులు మనకు ఆనందం ఇవ్వటం లేదని అర్థం చేసుకోవాలి. అలాగే ఎంత కష్టపడుతున్నా… ఏ వైపునుండి చిన్నపాటి ప్రశంస కానీ మెచ్చుకోలు కానీ లేకపోయినా జీవితం నిరర్ధకమనే అనిపిస్తుంది. కుటుంబాల్లో మహిళలు ఇలాంటి ప్రేమరాహిత్యానికి ఎక్కువగా గురవుతుంటారు. అందరికోసం పనిచేయటంలో ఆనందం ఉందనుకునేవారు… తమకోసం కూడా తాము జీవించాలని తెలుసుకోవాలి. అలాగే ఏ కారణంగా అయినా అనుకున్నవి నెరవేరకపోయినా జీవితం అర్ధవంతంగా లేదనిపిస్తుంది. ఇలాంటివారిలో ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నా జీవితానికి అర్థం ఉంది, అనే భావం వయసు మళ్లినవారిపై చూపే ప్రభావం!

సాధారణంగా వయసులో ఉండి శరీరంలో శక్తి ఉన్నపుడు జీవితం బాగున్నట్టుగా ఉంటుంది. జీవితంలో చేయాల్సిన పనులు సైతం చాలా ఉంటాయి. పిల్లలను పెంచి పెద్దచేయటం, ఉద్యోగబాధ్యతలు నిర్వహించడం, సమాజంలో గుర్తింపు ఇవన్నీ ఉన్నదశలో… నిరుత్సాహం నీరసం వంటివి ఉండవు. నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారో, నేను ఆరోగ్యంగా లేకపోతే నా కుటుంబాన్ని చూసుకునేవారు ఎవరూ ఉండరు.. అనే ఆలోచనలు ఉత్సాహంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఎన్ని పనులు ఉన్నా అలసిపోకుండా ఎప్పటిపనులు అప్పుడు చేసుకుంటూ పోవటం మనం గమనిస్తుంటాం. నా జీవితానికి అర్థం ఇదీ… అని ఎప్పుడూ అనుకోకపోయినా వీరికి తమ జీవితానికి ఉన్న అర్థం ఏమిటో తెలుసు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు బాగుండటం అనేది వీరి శారీరక మానసిక ఆరోగ్యాలను కాపాడుతుంటుంది.

తనను ప్రేమించే వ్యక్తులు ఉన్నారనే బలం, ఆశ వారికి తమ జీవిత అర్థంగా పరమార్ధంగా అనిపిస్తాయి. అలాగే మనసుని ఆనందంగా ఉంచే స్నేహాలకు ప్రాధాన్యతని ఇవ్వటం వలన కూడా జీవితం అర్థవంతంగా కనబడుతుంది. ఇక పెద్ద వయసు వారికి జీవితం అర్థవంతంగా అనిపించాలంటే వారికి తమ కుటుంబ సభ్యుల నుండి ప్రేమ దొరకాలి. తాము చేయాల్సిన పనులేమీ లేవని, తాము ఎవరికీ అక్కర్లేదని వారు నిరాశ చెందకుండా ఉండాలంటే వారు కుటుంబానికి చాలా ముఖ్యమని, విలువైన వ్యక్తులని అర్థమయ్యేలా చేయాలి. ఆ ప్రభావంతో వయసు మళ్లటం వలన వచ్చే అనారోగ్యాలు అంతగా ప్రభావం చూపవు.

జీవితానికి అర్థం లేదు…. అనే ఆలోచనలు వస్తున్నపుడు అర్థం కల్పించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. ఇందుకోసం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడు మనకు నచ్చిన, మనం ప్రేమించే పనులను చేయాలి. మనకిష్టమైన కళలు, అభిరుచులకు సమయం కేటాయించాలి. ఇప్పుడు ఇవి అవసరమా అని భావించకూడదు. మనకోసం మనం జీవించే సమయం కొంతయినా ఉన్నపుడు జీవితం ఆనందంగా ఆహ్లాదంగా అర్థవంతంగా అనిపిస్తుంది.

మన జీవితానికి అర్థం ఇదీ అని ఎలా తెలుసుకోవాలి?

చాలామంది జీవితానికి అవసరమైన పనులను మాత్రమే చేయాలనే తాపత్రయంతో తమకు నచ్చిన పనులను ఎంతోకాలంగా వాయిదా వేస్తుంటారు. పిల్లల చదువులు, ట్యూషన్లు, పెద్దవాళ్ల ఆరోగ్యపరీక్షలు లాంటివన్నీ ఆపకుండా చేసేవారు … తమకు ఎంతో ఆత్మీయులైన స్నేహితులతో కలిసి భోజనం చేయాలనే చిన్న కోరికని వాయిదా వేస్తుండవచ్చు. ఇలా తరచుగా చేస్తూ పోతుంటే… మనసుకి ఆనందాన్నిచ్చే అంశాలేమీ లేనట్టుగా జీవితం విసుగ్గా నిస్సారంగా అనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పనులనే కాదు… ఆనందాన్ని, మనసుకి ఆహ్లాదాన్ని ఇచ్చే పనులకోసం కూడా కొంతసమయం కేటాయించాలి. అప్పుడు మాత్రమే అర్థవంతంగా జీవిస్తున్నాం అనిపిస్తుంది.

ప్రతిమనిషికి చిన్నతనం నుండీ కొన్ని అభిప్రాయాలు ఆలోచనలు ఉంటాయి. వాటిని పక్కనపెట్టేసి యాంత్రికంగా బతికేస్తున్నా  జీవితం నిరర్దకంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తికి సామాజిక సేవ అంటే ఇష్టం ఉంటే… దానిని నిర్లక్ష్యం చేయటం మంచిదికాదు. కనీసం వారానికి, పదిరోజులకు ఒకసారయినా ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాలుపంచుకోవటం మంచిది.

అర్థవంతంగా జీవించడం ఎలా?

నలుగురు మెచ్చుకునేలా గొప్పగా బతకాలనే లక్ష్యం అందరికీ ఉంటుంది. చాలావరకు అదే దిశగా మన జీవన ప్రయాణం సాగుతుంటుంది. అంటే నలుగురి కళ్లతో మనల్ని మనం చూసుకుంటున్నామన్న మాట. అందరూ మెచ్చుకునే చదువు, అందరూ గొప్పగా చెప్పుకునేలా ఉద్యోగం, అందరికంటే ఎక్కువ సంపాదన… ఇలాంటి లక్ష్యాలతో ఉన్నపుడు మనకేం కావాలో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు. మన మనసుకి సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చే పనులు చాలా చిన్నవయినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండటంలో ఎంతో ఆనందం దొరుకుతుంది. ఒక్కోసారి అవే జీవితానికి అర్థం అనిపించవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top