వాతావరణం వేడెక్కితే పిల్లల శరీరం మరింత వేడెక్కుతుంది. ఈ వేడిని నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో బలహీనంగా ఉండటం వాళ్ళ పిల్లలకు వడదెబ్బ తగులుతుంది. చిన్నపిల్లల చర్మ వైశాల్యం వాళ్ళ బరువుతో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చర్మం ద్వారా వంట్లో ఉన్న నీరు ఆవిరైపోవటం ఎక్కువ. అందుకే పెద్దవాళ్లకంటే పిల్లలకే వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండావాంతులు, విరేచనాలు, కళ్ళకలక, తట్టు లాంటి వ్యాధులు కూడా రావచ్చు.
వేసవిలో పసిపిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. పిల్లల చర్మం చాలా సున్నితం కాబట్టి, శరీరంలో నుంచి నీరు త్వరత్వరగా ఆవిరవుతూ ఉంటుంది. దాంతో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. చిన్నారులు ఎండల్లో ఆడుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి కోమాలోకి వెళ్లడం, మరణించే ప్రమాదం కూడా ఉంది.
చిన్న పిల్లలు వేసవి కాలంలో డీహైడ్రేషన్ కి గురికావటం అనేది మనం తరచుగా చూసేదే. అయితే, దాని లక్షణాలను వెంటనే గుర్తించి తగిన విధంగా నడుచుకోవటం చాలా ముఖ్యం. వంట్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు సహజంగానే దాహం అనిపిస్తుంది. దాహం వేసిందంటే అది డీహైడ్రేషన్ ను తొలి సూచిక. నిస్సత్తువ, నోరు పొడిబారటం, వళ్ళంతా వేడిగా ఉన్నట్టు అనిపించటం లాంటి లక్షణాలన్నీ డీహైడ్రేషన్ నే సూచిస్తున్నట్టు లెక్క. అలాంటప్పుడు పిల్లల్ని ఎండలోనుంచి నీడకు, ఇంకా వీలైతే చల్లటి గదిలోకి తీసుకురావటం మొట్టమొదట చేయాల్సిన పని. చల్లటి మంచి నీళ్ళు ఎక్కువగా తాగించాలి.
అయితే ముందుగా చక్కెర వేసిన పళ్ళరసాలు, సోడా కలిసిన శీతల పానీయాల జోలికి వెళ్ళటం అంత మంచిది కాదు. దేహం వాటిని వేగంగా స్వీకరించదు కాబట్టి మంచినీళ్ళే ఉత్తమం. డీహైడ్రేషన్ లక్షణాలను వెంటనే గుర్తించి తగిన విధంగా స్పందించకపోతే అది వడదెబ్బగా మారుతుంది. ఆ పరిస్థితి మరింత ప్రమాదకరం. అప్పుడు వాంతులు, కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం, కాళ్ళు చేతుల నొప్పి, కంటి చూపు సమస్యలు లాంటివి కూడా ఎదురవుతాయి. సరిగా ఊపిరి ఆడకపోవటం, మూత్రవిసర్జన తగ్గిపోవటం లాంటి లక్షణాలు కనబడితే వడదెబ్బ తగిలినట్టే భావించాలి. అలా వడదెబ్బకు గురైన వెంటనే దేహాన్ని వీలైనంతగా చల్లబరచటం ముఖ్యం.
పిల్లలు వడదెబ్బకు గురైతే చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీరాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి. వైద్యుల సలహా మేరకు ఒఆర్ఎస్ కలిపిన నీటిని తాగించాలి. జ్వరానికి చికిత్స చేయించాలి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కళ్లకలక వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారి కళ్లు ఎర్రగా ఉంటాయి. కంటి నుంచి నీరు వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో దురదగా ఉండడం వల్ల పిల్లలు ఎప్పుడూ కళ్లు నలుపుకుంటూ ఉంటారు. కంటి నుంచి పుసి కారుతూ ఉంటుంది. వీళ్ళ కంటి నల్ల గుడ్డూ చుట్టూ తెల్లటి పొరలాగా వస్తుంది.
అలాంటప్పుడు ఆరుబయట తిరగనివ్వకుండా డాక్టర్ ను సంప్రదించి యాంటీబైయోటిక్ ఐ డ్రాప్స్ వాడాలి. చిన్నారులకు ఆటలమ్మ, తట్టు రావటం కూడా సహజం. జ్వరం, తలనొప్పి, ఆకలి మందగించడం, నీరసం వస్తాయి. ఛాతీపై మచ్చలు, ప్రారంభమై శరీరమంతటికీ వ్యాపించి క్రమంగా బొబ్బలుగా మారుతాయి. అనంతరం విపరీతమైన దురద, మంట, నొప్పి వస్తుంది. తట్టుకోలేక చిన్నారులు ఏమాత్రం వేళ్లతో గోకినా చీము గుంతలు ఏర్పడతాయి. ఈ వ్యాధి సోకిన పిల్లల గోళ్లను కత్తిరించడం, రాత్రిపూట నిద్రించే సమయంలో చేతులకు రుమాలు వంటివి కట్టాలి. డాక్టర్ల సలహా మేరకు మందులు సక్రమంగా వాడాలి. రక్షిత మంచినీటిని మాత్రమే ఇవ్వాలి.
కొంతమంది పిల్లలకు తల్లి పాలు సరిపోకపోవటం వల్ల బరువు కోల్పోతారు. మరీ ఎక్కువగా తగ్గితే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడుతుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్లలో తరుగుదల ఏర్పడుతుంది. సోడియం ఎక్కువై, మూత్రపిండాల సమస్యలు మొదలవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే తల్లులు వైద్యుల సూచనల మేరకు పాల ఉత్పత్తి పెరిగేటట్టు మందులు వాడాలి, లేదా పాలకు ప్రత్యామ్నాయాలు పిల్లలకు వాడాలి. పిల్లలు బాగా బరువు తగ్గినా, ఎక్కువగా ఏడుస్తున్నా, తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత కూడా ఏడుస్తున్నా, రోజుకి 7, 8 సార్ల కంటే తక్కువసార్లు మూత్రవిసర్జన చేస్తున్నా… ఆ పిల్లలు తల్లి పాలు సరిపోక డీహైడ్రేషన్‌కు గురయ్యారని గ్రహించాలి.
ఎండాకాలం పిల్లల్ని బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి నీళ్ళు, ఇతర ద్రవాలు తాగకుండా మొరాయించే పిల్లలకు నచ్చజెప్పి మరీ తాగించాలి. ఎండల్లో తొందరగా నీరసించిపోతారు గనుక ఆరుబయట ఎండలో ఎక్కువసేపు తిరిగకుండా, ఆడకుండా చూడాలి. చెమట ద్వారా లవణాలు కోల్పోయి నీరసించిపోతారని వివరించాలి.. ముఖ్యంగా ఆరేళ్ళ లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, శరీర ఉష్ణోగ్రత పెరిగిన వెంటనే వారికి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వడదెబ్బ తగిలే అవకాశాలు పెద్దల్లో కంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. తగినంత నీరు తాగించటం నీడపట్టునే ఉండేలా చూసుకోవటం, ఏమాత్రం వడదెబ్బ లక్షణాలు కనిపించినా ప్రాథమిక చికిత్స చేస్తూనే డాక్టర్ ను సంప్రదించటం అవసరమని గుర్తించాలి.