మన ఆరోగ్యాన్ని హరించి వేసే అంశాల్లో చెడు అలవాట్లదే మొదటి స్థానమని చెప్పవచ్చు. చెడు అలవాట్లనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది సిగరెట్టే. అవును… ఆల్కహాల్ తో పాటు అంతేస్థాయిలో వ్యాపించి ఉన్న అలవాటిది. పైగా చిన్న వయసులోనే దీని బారిన పడుతుంటారు చాలామంది. పొగాకుని ఏ రూపంలో వినియోగించినా… అది ఆరోగ్యాన్ని పొగచూరిపోయేలా చేస్తుందని అందరికీ తెలుసు. కానీ దానిని వదిలించుకునే శక్తి లేక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ దానిని వాడుతుంటారు. మరి పొగతాగే అలవాటు వలన కలిగే నష్టాలు. దానిని వదిలించుకుంటే కలిగే ఆరోగ్య లాభాలను గురించి తెలుసుకుందాం.
‘సిగరెట్లు, చుట్ట, గుట్కా వంటి అలవాట్లు ఉన్నవారు అవన్నీ తమకు ఆనందాన్ని ఇస్తున్నాయనే అనుకుంటారు. వాటి వలన హాని కలుగుతుందని తెలిసినా వారు భవిష్యత్తులో కలిగే హానిని ఊహించలేరు. అప్పటికి తాము పొందుతున్న ఆనందమే ముఖ్యమని భావిస్తారు. పొగాకు వలన దానిని వినియోగించే వారి శరీరానికి ఊహించలేనంత స్థాయిలో హాని జరుగుతుంది. సిగరెట్ల వలన హాని జరుగుతుందని కొంతమంది… సిగార్, పైప్, హుక్కా లాంటివాటికి మారుతుంటారు. కానీ వాటి వలన కూడా అంతే స్థాయిలో హాని ఉంటుందని మర్చిపోకూడదు. సిగరెట్ కాలి బూడిద అవుతున్నపుడు ఏడువేల రకాల రసాయనాలు విడుదల అవుతాయని అమెరికన్ లంగ్ అసోసియేషన్ చెబుతోంది. వీటిలో చాలా రసాయనాలు విషపూరితమైనవి. 69 రసాయనాలు క్యాన్సర్ కారకాలు కూడా.
పొగతాగే అలవాటు ఉన్నవారి శరీరంలో కలిగే మార్పులు
సిగరెట్ మొదలుపెట్టినవారికి వెంటనే లభించేది థ్రిల్, ఆనందమే కావచ్చు కానీ… దీర్ఘకాలంలో వచ్చేవి మాత్రం అనారోగ్యాలే. సిగరెట్ అది మండుతున్నట్టే ఉన్నా… దానిని తాగే వారిని సైతం లోలోపల మండిస్తుందనేది అందరికీ తెలిసిన నిజం. పొగాకులో ఉన్న నికోటిన్ దానిని వినియోగించిన వెంటనే మెదడుకి కొంత సమయంపాటు ఉత్తేజాన్ని ఇస్తుంది. నికోటిన్ వల్లనే పొగాకుకి అలవాటు పడినవారు దానిని వదిలించుకోలేరు. నికోటిన్ కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపటం వలన దానిని మానాలనుకున్నపుడు ఆందోళన, తలనొప్పులు, చిరాకు, డిప్రెషన్ లాంటి సమస్యలు కలుగుతాయి. అలాగే సిగరెట్లు ఊపిరితిత్తులపై చూపే ప్రభావం గురించి చెప్పనక్కర్లేదు. తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు లంగ్ క్యాన్సర్ కి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. సిగరెట్లలోని నికోటిన్ రక్తనాళాలను కుచించుకుపోయేలా చేసి గుండె వ్యాధులను కలగజేస్తుంది. సిగరెట్ల వలన అధిక రక్తపోటు, రక్తం గడ్డకట్టటం, స్ట్రోక్ వంటి అనారోగ్యాలు కలగవచ్చు.
సిగరెట్ తాగేవారి పక్కనున్న వారికి కూడా ప్రమాదమే
సిగరెట్లు వాటిని తాగేవారికే కాదు వారితో పాటు ఉండే వారి కుటుంబ సభ్యులకు సైతం హాని చేస్తాయి. సిగరెట్ తాగేవారికి చేరువగా ఉన్న పిల్లలకు న్యూమోనియా, బ్రాంకైటిస్ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగాకు చర్మంపైన కూడా ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ల వలన చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గోళ్లకు ఇన్ ఫెక్షన్లు సైతం వచ్చే అవకాశం ఉంది. నికోటిన్ వలన జుట్టుకి సైతం విపరీతంగా హాని కలుగుతుంది. జుట్టు ఊడటం, తెల్లబడటం, బట్టతల లాంటి సమస్యలు రావచ్చు. పొగాకు, సిగరెట్ల వలన నోరు, గొంతు, స్వరపేటిక అన్నవాహికలతో పాటు పాంక్రియాస్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
సిగరెట్ తాగితే లైంగిక సామర్ధ్యం తగ్గుతుంది
పొగ ఇన్సులిన్ పైన ప్రభావం చూపటంతో శరీర కణాలు ఇన్సులిన్ ని తీసుకోలేని పరిస్థితి కలగవచ్చు. దీంతో మధుమేహం వచ్చే ప్రమాదం సైతం పెరుగుతుంది. సిగరెట్లు స్త్రీపురుషుల లైంగిక అవయవాల ఆరోగ్యంపైన కూడా ప్రభావాన్ని చూసే అవకాశం ఉంది. అయితే సిగరెట్ ఇన్ని విధాలుగా హాని చేసినా… ఒక ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే… దీనిని మానేసిన వెంటనే శరీరం కోలుకోవటం మొదలుపెడుతుంది. వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పొగతాగేవారు దానిని మానేయటం మంచిది.
సిగరెట్ మానేసిన ఒక్కరోజులోనే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
సిగరెట్ తాగటం వలన కలిగే హాని గురించి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం అయితే దానిని మానేసిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే మానాలనే కాంక్ష పెరుగుతుంది. సిగరెట్ తాగిన అనంతరం ఒక గంట వరకు తిరిగి సిగరెట్ కాల్చకుండా ఉంటే ఆ వ్యవధిలో గుండె కొట్టుకునే వేగం తిరిగి సాధారణస్థితికి చేరుతుంది. రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. సిగరెట్ తాగిన అనంతరం 12 గంటల వరకు మరో సిగరెట్ తాగకుండా ఉంటే… సిగరెట్ల కారణంగా శరీరంలో చేరిన కార్బన్ మోనాక్సైడ్ తగ్గి… ఆక్సిజన్ స్థాయి పెరగటం మొదలవుతుంది. ధూమపానం మానేసిన ఒక్కరోజులో గుండె ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభమవుతుంది.
సిగరెట్లు మానితే జరిగే అధ్బుతాలు
ధూమపానం మానేసిన ఒక్క రోజులోనే ఆక్సిజన్ స్థాయి మెరుగుపడటం వలన గుండె ఆరోగ్యాన్ని పెంచేలా శారీరక శ్రమ చేసే శక్తి పెరుగుతుంది. రెండురోజుల అనంతరం నరాలు కోలుకోవటం మొదలవుతుంది. మూడురోజుల అనంతరం శరీరంలో నికోటిన్ స్థాయి క్షీణించడంతో తలనొప్పి, చిరాకు, ఆందోళన లాంటి లక్షణాలు పెరుగుతుంటాయి. అయినా పట్టుదలగా దానికి దూరంగా ఉంటే ఒక నెల తరువాత ఊపిరితిత్తులు కోలుకోవటం మొదలవుతుంది. ఒక సంవత్సరం తరువాత సిగరెట్ల కారణంగా గుండెవ్యాధులు వచ్చే ప్రమాదం సగం వరకు తగ్గుతుంది. ఐదేళ్ల తరువాత రక్తం గడ్డకట్టే ప్రమాదం నుండి బయటపడతారు. స్ట్రోక్ వచ్చే ప్రమాదం సైతం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. పదేళ్ల తరువాత సిగరెట్లు తాగుతున్న వ్యక్తితో పోలిస్తే లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం సగం వరకు తగ్గిపోతుంది. ఇరవై ఏళ్లకు ఎప్పుడూ సిగరెట్ తాగని వ్యక్తి స్థాయి ఆరోగ్యం చేకూరుతుంది. సిగరెట్లు మానడానికి ప్రేరణనిచ్చే అద్భుతమైన నిజాలు ఇవి.
సిగరెట్లు తాగటం మొదలుపెట్టినప్పుడు వాటివలన వచ్చే నష్టాలను గురించి ఎవరూ ఆలోచించరు. నష్టాలను గురించి ఆలోచించే సమయం వచ్చినప్పుడు సిగరెట్లు మానటం కష్టంగా మారుతుంది. సరదాగా మొదలైన అలవాటు… ఆరోగ్యానికి, ప్రాణానికి ఎసరు పెట్టే స్థాయికి చేరకముందే దానినుండి బయటపడటం మంచిది. మానాలనే సంకల్పబలం మాత్రమే సిగరెట్టు ఆటని కట్టిస్తుందని మర్చిపోకూడదు.