గర్భం దాల్చినట్టు తెలిసిన రోజు నుండి ప్రసవించే వరకు గర్భిణులు తమ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే మొదటి మూడు నెలలు, రెండవ మూడునెలలు, మూడవ మూడునెలలు… ఇలా గర్భధారణ నెలలను బట్టి మరింత ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించుకోవాల్సిన వైద్యపరీక్షలు ఉంటాయి. బిడ్డ తల్లికడుపులో సురక్షితంగా ఉండటంలో, ఆరోగ్యంగా జన్మించడంలో ఇవి తోడ్పడతాయి.
గర్భం ధరించిన స్త్రీలు తగినంత పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండటంతో పాటు వైద్యపరీక్షలు చేయించుకోవటం కూడా అవసరం. రెండవ త్రైమాసికంలో అంటే నాలుగు, ఐదు, ఆరు ఈ మూడు నెలల కాలంలో నెలకోసారి వైద్యపరీక్షలకు వెళుతుండాలి. దీనివలన గర్భిణి సాధారణ ఆరోగ్యంతో పాటు … పొట్టలోని పాపాయి ఆరోగ్యం, పెరుగుదలలను గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. రెండవ త్రైమాసికంలో అంటే 13, 28 వారాల మధ్యకాలంలో గర్భిణులకు వైద్యులు నిర్వహించే వైద్య పరీక్షల వివరాలను ఇప్పుడు చూద్దాం.
గర్భిణులు ఎలా కనబడుతున్నారు, వారిలో రక్తపోటు ఎలా ఉంది, పోషకాహారం తీసుకుంటున్నారా, బిడ్డ సరిగ్గా బరువు పెరుగుతుందా… లాంటి విషయాలను వైద్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకునే తీరుని గమనిస్తారు. గర్భిణికి కాళ్లు పాదాల్లో వాపు ఉందాని పరీక్షిస్తారు. బరువు సవ్యంగానే పెరుగుతున్నారా లేదా అనేది పరీక్షించి బరువు అవసరమైన దానికంటే ఎక్కువగా పెరుగుతుంటే ఆహారం తగ్గించమని, తక్కువ బరువుంటే ఆహారం సవ్యంగా తీసుకోవాలని చెబుతారు. గర్భధారణ కారణంగా హార్మోన్లలో, రక్తం పరిమాణంలో మార్పులు రావటం వలన రక్తపోటు తగ్గుతుంటుంది. రక్తపోటు మరీ తక్కువగా ఉంటే పడుకుని, కూర్చుని లేచేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
రక్తపోటు అధికంగా ఉంటే దానికారణంగా వచ్చే సమస్యలను నివారించే ప్రయత్నం చేస్తారు. గర్భధారణలో మూడు నెలల నుండి ఆరునెలల లోపు చేసే పరీక్షల్లో ఆల్ఫా ఫీటో ప్రొటీన్ స్క్రీనింగ్ ఒకటి. గర్భస్థ శిశువు లివర్ నుండి ఉత్పత్తి అయ్యే ప్రొటీన్ ని పరీక్షించే టెస్ట్ ఇది. ఈ ప్రొటీన్ శిశువు చుట్టూ ఉండే ఉమ్మనీటిలోనే కాకుండా మాయ ద్వారా తల్లి రక్తంలోకి కూడా చేరుతుంది. అందుకే తల్లి రక్తపరీక్ష ద్వారా ఆల్ఫా ఫీటో ప్రొటీన్ స్థాయిని కనుగొంటారు. ఈ పరీక్ష పూర్తి పేరు మ్యాటర్నల్ సిరం ఆల్ఫా ఫీటో ప్రొటీన్ స్క్రీనింగ్. ఈ ప్రొటీన్ ఎక్కువ స్థాయిలో ఉంటే బిడ్డలో డౌన్ సిండ్రోమ్ లేదా మెదడు వెన్నుపాములకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే కచ్ఛితంగా సమస్య ఉందని చెప్పలేము. దానిని నిర్దారించాలంటే ఆల్ట్రాసౌండ్ లేదా ఆమ్నియో సెంటిసెస్ పరీక్షని చేయాల్సి ఉంటుంది.
గర్భస్థ శిశువులో ఉన్న మెదడుకి సంబంధించిన సమస్యలను తెలుసుకునే మరొక పరీక్ష సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఎ టెస్ట్. పదివారాల గర్భధారణ కాలం అనంతరం దీనిని చేస్తారు. తల్లి రక్తం తీసుకుని అందులో తిరిగే గర్భస్థ శిశువు తాలూకూ డిఎన్ఎ ని పరీక్షిస్తారు. డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోములకు సంబంధించిన సమస్యలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. బిడ్డ లైంగికతకు సంబంధించిన సమాచారాన్ని సైతం ఈ పరీక్ష అందిస్తుంది. డౌన్ సిండ్రోమ్ సమస్య ఉన్న ప్రెగ్నెన్సీలలో 99శాతాన్ని ఇది కనుక్కుంటుంది. అలాగే క్రోమోజోములకు సంబంధించిన అన్ని రకాల అసాధారణతలను సైతం ఈ పరీక్ష ద్వారా కనుగొంటారు.
ఇక ఇరవయ్యవ వారంలో ఆల్ట్రాసౌండ్ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్షలను గర్భధారణ సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు. భిన్నమైన అంశాలను ఆల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రసవం తేదీ, ఒకరికంటే ఎక్కువశిశువులు గర్భంలో ఉండటం, పిండం పెరుగుదల నెమ్మదిగా ఉండటం లాంటి విషయాలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే నిపుణులకు చూపించుకోమని లేదా తరువాత స్థాయి జన్యు పరీక్షలకు వెళ్లమని సూచించడం జరుగుతుంది.
24 నుండి 28 వారాల గర్భధారణ సమయంలో కడుపుతో ఉన్న స్త్రీలో మధుమేహం ఉందా అని పరిశీలించే పరీక్ష చేస్తారు. ఈ గ్లూకోజ్ స్క్రీనింగ్ టెస్ట్ ని సర్వసాధారణంగా చేస్తుంటారు. పుట్టబోయే బిడ్డకు తల్లికి హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.
సాధారణంగా గర్భవతులకు 16నుండి 20 వారాల వ్యవధిలో ఆమ్నియో సెంటీసిస్ అనే పరీక్షని నిర్వహిస్తారు. జన్యుపరమైన లోపాలను గురించి తెలుసుకునే పరీక్ష ఇది. మెదడు, వెన్నుపాముల్లో అభివృద్ధిపరమైన సమస్యల కారణంగా పుట్టుకతో వచ్చే లోపాలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వయసులో గర్భం ధరించిన మహిళలకు ఈ పరీక్షవలన మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ పరీక్షకు వెళ్లేవారు దీని గురించిన పూర్తి వివరాలను, దీని మంచి చెడులను వైద్యులను అడిగి తెలుసుకోవటం మంచిది.
ఆమ్నియోసెంటీసిస్ పరీక్ష తరువాత 15 వారాలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం సగటున 0.2శాతం నుండి 0.5శాతం వరకు ఉంటుంది. అయితే ఈ పరీక్ష మెదడు వెన్నుపాము, వెన్నెముకల పెరుగుదలకు ముందు ఏర్పడే న్యూరల్ ట్యూబ్ లో లోపాలను 99శాతం వరకు కనిపెడుతుంది. అలాగే కొన్ని రకాల జన్యుపరమైన లోపాలను నూరుశాతం కనుగొంటుంది. ఇదే రెండవ త్రైమాసికంలో ఫీటల్ డాప్లర్ ఆల్ట్రాసౌండ్ పరీక్షని చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా గర్భస్థ శిశువుకి, ప్లాసెంటాకి రక్త ప్రసారం సాధారణంగా ఉందా లేదా అనేది గుర్తిస్తారు.
అలాగే ఫీటాస్కోపీ అనే పరీక్ష ద్వారా ఇతర పరీక్షల ద్వారా గుర్తించలేని గర్భస్థ శిశువులోని లోపాలను కనుగొనే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరీక్ష ద్వారా తల్లీ బిడ్డలకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే బిడ్డలో లోపాలు ఉండే ప్రమాదం ఎక్కువగా ఉందనిపించినప్పుడు మాత్రమే ఈ పరీక్షని నిర్వహిస్తారు.
గర్భధారణలో నాలుగు నుండి ఆరు నెలల వరకు గర్భవతులకు నిర్వహించే పరీక్షలు అత్యంత కీలకమైనవి. గర్బస్థ శిశువులో ఏర్పడే పలులోపాలను కనుగొనేందుకు ఇవి తోడ్పడతాయి. గర్భిణి ఆరోగ్యపరిస్థితిని బట్టి… వైద్యులు ఈ మూడునెలల కాలంలో ఏ పరీక్షలు ఎప్పుడు అవసరం అనేది నిర్ణయించి చేస్తారు. అయితే పుట్టబోయే బిడ్డ పెరుగుదలను, ఆరోగ్యాన్ని తెలిపే ఈ కీలకమైన పరీక్షలను గురించిన అవగాహన గర్భిణులకు ఉండటం మంచిది. అప్పుడే వారు ఆందోళనకు గురికాకుండా పరీక్షలు చేయించుకోగలుగుతారు. అలాగే క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించగలుగుతారు.