ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు (ఏప్రిల్ 29, 2020) ప్రపంచానికి దూరమయ్యారు. చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన లండన్ లో చికిత్స పొందుతూ ఈ మధ్యనే ఇండియా వచ్చారు. కొద్ది రోజుల క్రితమే (ఏప్రిల్ 25న) తల్లి సైదా బేగంని పోగొట్టుకున్న ఇర్ఫాన్ ఖాన్ లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలను మొబైల్ ద్వారా వీక్షించి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన తల్లి కన్ను మూసి ఐదు రోజులు కూడా కాకముందే తీవ్ర అనారోగ్యానికి గురయిన ఇర్ఫాన్ ఖాన్ మంబై లోని కోకిలాబెన్ ధీరుబాయి అంబానీ హాస్పిటల్ లో చేరారు.
డాక్టర్ లు అతనిని ఐసియూ లో ఉంచి చికిత్స చేసినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. ఆయన గత కొన్ని రోజులుగా న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ లండన్ లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని ఇంగ్లిష్ మీడియం అనే హింది సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇందులో కూతురికి లండన్ కాలేజీలో సీటు కోసం పాటుపడే ఒక సగటు భారతీయ తండ్రిగా ఆయన అధ్భతంగా నటించారు.
బాలీవుడ్ లో ఇర్ఫాన్ ఖాన్ మొదటి సినిమా సలాం బాంబే. ఈయన నటించిన పాన్ సింగ్ తోమర్ కు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వచ్చింది. అంతేకాదు తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ మన మధ్య లేకపోవడం భారతీయ చిత్ర సీమకు తీరని లోటు. భారతీయ చిత్ర సీమకు ఇర్ఫాన్ ఖాన్ చేసిన సేవలకు సలాం ఇర్ఫాన్.