సాధారణంగా గర్భిణులు తమ రోజువారీ పనులను చేసుకుంటుంటారు. ఏవైనా ప్రత్యేకమైన సమస్యలు ఉంటే తప్ప వారికి అసలు కదలకుండా ఉండాల్సిన పరిస్థితి అనేది ఉండదు. అయితే అలాగని వారు మామూలు స్త్రీలలా శరీరాన్ని మరీ విపరీతమైన శ్రమకు గురి చేయటం మంచిదికాదు.
Pregnant woman do’s and don’ts
గర్భవతులు తాము చేస్తున్న పనులు, ఉద్యోగాల వలన తమ పొట్టలోని శిశువుకి ఎలాంటి అసౌకర్యం, హానీ కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనులను చేస్తున్నపుడు తగినంత అప్రమత్తతతో, తమ ఆరోగ్యం విషయంలో పూర్తి అవగాహనలో ఉండాలి. పోషకాహారం తినటం, శరీరానికి తగిన వ్యాయామం చేయటంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవటం కూడా చాలా అవసరం. ఎక్కువగా పనిచేసే గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం.
గర్భం ధరించినప్పటినుండి గడుస్తున్న నెలలను బట్టి గర్భవతులు పలురకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరు ఎక్కువ గంటలపాటు నిలబడి ఉండాల్సిన పనులు చేయటం మంచిది కాదని, అలా చేయటం వలన శిశువు చిన్నపరిమాణంలో పుట్టే అవకాశం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది. వారానికి 40 గంటలకు పైగా నిలబడి ఉండాల్సిన పనులు చేస్తే పుట్టబోయే శిశువుపై అలాంటి ప్రభావం పడుతుందని…ఆ అధ్యయనంలో తేలింది. టీచింగ్, సేల్స్, చైల్డ్ కేర్ వంటి పనుల్లో ఉన్న మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
వారానికి 40 గంటలకంటే ఎక్కువకాలం నిలబడి పనిచేసే గర్భవతులకు, వారానికి 25 గంటలకంటే తక్కువ కాలం నిలబడి పనిచేసేవారికంటే… చిన్న పరిమాణంలో ఉన్న శిశువులు జన్మించినట్టుగా అధ్యయనంలో తేలింది. అయితే నెలలు నిండకుండా పుట్టటం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం లాంటి అంశాలపై ఈ అంశం ప్రభావం చూపలేదు.
వారానికి రెండు కంటే ఎక్కువ రోజులు రాత్రులు పనిచేసే గర్భవతులకు గర్భస్రావం ప్రమాదం పగలు పనిచేసేవారికంటే 32శాతం ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. గర్భవతులు పనులు చేస్తున్నా శరీరాన్ని మరీ ఎక్కువ అసౌకర్యానికి, శ్రమకు గురిచేయకూడదు. ఏ మాత్రం అసౌకర్యం ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
సాధారణంగా ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు గర్భం దాల్చిన తరువాత కూడా తమ పనులను కొనసాగిస్తుంటారు. అయితే వారు తమ పనుల వలన గర్భధారణ పరంగా ఎదురయ్యే అసౌకర్యాల నుండి ఎలా బయటపడాలో తెలుసుకుని ఉండాలి. అలాగే తాము చేస్తున్న పని వలన… తమ పొట్టలోని శిశువుకి ఏదైనా హాని ఉంటుందా.. అనే విషయంలో అవగాహనని కలిగి ఉండాలి.
- రాత్రులు పనిచేయటం
- ఎక్కువ గంటలు పనిచేయటం
- ఎక్కువ సమయం నిలబడటం
- లేదా నడవాల్సి రావటం
ఇలాంటి పనులను చేసే గర్భవతులు తమ పనుల వలన పొట్టలోని శిశువుకి హాని, అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి.
తాము చేస్తున్న పనిలో భాగంగా రసాయనాలు, రేడియేషన్, లేదా ఇతర ప్రమాదకరమైన లోహాలకు దగ్గరగా పనిచేయాల్సి ఉన్నా, ఎక్కువ గంటలు నిలబడాల్సి వస్తున్నా, మెట్లు ఎక్కడం, బరువు మోయటం లాంటి పరిస్థితులు ఉన్నా, అధిక శబ్దాలు, బాగా వేడి లేదా చల్లగా ఉన్న వాతావరణం ఉన్న ప్రదేశాల్లో పనిచేస్తున్నా వైద్యుల సలహా తీసుకోవాలి. వారానికి నలభై కంటే ఎక్కువ గంటలు పనిచేసే గర్భవతులు గర్భస్రావం, ముందస్తు ప్రసవం లాంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని మరొక అధ్యయనం చెబుతోంది.
కనుక తమకు శక్తి ఉంది కదా అని పనులను చేసుకునే గర్భవతులు తప్పకుండా తాము చేస్తున్న పనుల్లో తమకు అసౌకర్యం కలిగించేవి ఉన్నాయా అనే తెలుసుకోవాలి. తమ పరిస్థితిని పనిచేస్తున్న సంస్థలో యాజమాన్యానికి తెలిపి తగిన సహకారం పొందాలి.
గర్భం దాల్చిన సమయంలో కూడా ఎక్కువ పనులు చేసేవారు వాంతులు, వికారం వంటి బాధలు లేకుండా చూసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు భోజనం చేయటం మంచిది. గర్భం దాల్చిన తొలి మూడు నెలల్లోనూ చివరి మూడు నెలల్లోనూ అలసట ఎక్కువగా ఉంటుంది. పనిని ఆపకుండా చేస్తున్నా రోజుకి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. పనిలో ఉన్నపుడు కూడా తప్పకుండా నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. గర్భవతులకు ఎక్కువసార్లు వాష్ రూంకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
తరచుగా ఇందుకోసం పనినుండి విరామం తీసుకునే అవకాశం ఉండాలి. ఎక్కువ సమయం యూరిన్ కి వెళ్లకుండా ఉండకూడదు. వెన్ను, పొత్తికడుపు నొప్పులున్నవారు పని చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సమయం నిలబడాల్సి వచ్చినప్పుడు ఒక పాదాన్ని ఏదైనా బాక్స్ పైన లేదా చిన్నపాటి స్టూలుపైన ఉంచితే వీపుభాగం ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది.
గర్భధారణ సమయంలో పనులు చేసే మహిళలు తమ శారీరక ఫిట్ నెస్ విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ శ్రమతో కూడుకున్న పనులు చేసేవారు, రోజంతా కూర్చుని పనిచేసేవారు కూడా వైద్యుల సలహా మేరకు తగిన వ్యాయామం చేయటం మంచిది. అలాగే సరిపడా విశ్రాంతి తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. గర్భవతులుగా ఉండి ఎక్కువ పనులు చేసేవారు అవి తమకు హాని చేయటం లేదని నిర్దారించుకోవటం అవసరం.