డబ్బు ఎవరికి చేదు, అది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా డబ్బుని వద్దు అనుకునేవాళ్లూ ఉండరు. కానీ పరిస్థితులని బట్టి వస్తువుల అవసరాలు మారిపోతుంటాయి. డబ్బు కూడా అంతే కదా. శ్వాస విడిచిన శరీరం ఊరేగింపుగా శ్మశానానికి వెళుతున్నపుడు తనకు ఇంతకాలం ఎంతో ముఖ్యం అనుకున్న డబ్బు గురించి ఆలోచిస్తుందా???
అయితే కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో దేశాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటలీలో ఎన్నో మరణాలు సంభవించాయి. అక్కడ ప్రజల దగ్గర ఉన్న డబ్బు, వారు దాచుకున్న డబ్బు వారిని కాపాడలేకపోయింది అనే కోపంతో ఇటలీ ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బులను రోడ్ల మీద విసిరేస్తున్నారని కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇందులో నిజమెంత? డబ్బు మన ప్రాణాలను కాపాడలేకవచ్చు కానీ మన తరువాత తరం వారు బ్రతకడానికి మన దగ్గర ఉన్న డబ్బు అవసరమే కదా. ప్రభుత్వం తన ఖర్చులతో రోగులకు చికిత్స అందించినప్పటికీ మిగతా ఖర్చులకి డబ్బు కావాలి. అయితే ఇటలీలో ప్రజలు వైరాగ్యంతో డబ్బుని పారేస్తున్నారని, వారి మానసిక స్థితి పాడై నోట్ల కట్టాలను ఇలా విసిరేస్తున్నారని కొన్ని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజం కాదని కొన్ని మీడియా సంస్థలు తేల్చేసాయి. ద్రవ్యోల్బణంతో చితికిపోతున్న వెనుజువెలాలో రద్దు చేసిన పాత నోట్లను రోడ్లపై పారేయగా తీసిని ఫొటోలను ఇటలీలో తాజా ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారు అని ఆ సంస్థ తెలియజేసింది.