బరువు పెరగటం అనేది ఇప్పుడు చాలామంది సమస్య. ఇదివరకు రోజుల్లో నడివయసుకి వచ్చాక ఆ వయసు దాటాకే ఎక్కువగా బరువు పెరిగేవారు కానీ ఇప్పటి పరిస్థితి వేరు..చిన్న పిల్లల నుండి అన్ని వయసులవారిలోనూ స్థూలకాయ సమస్యని చూస్తున్నాం. ముఖ్యంగా పెళ్లయి తల్లికావాల్సిన వయసులో ఉన్న యువతులు బరువు పెరగకుండా చూసుకోవటం అవసరం. ఎందుకంటే అధికబరువు సమస్య చాలామందిలో గర్భం దాల్చడానికి ఆటంకంగా మారుతోంది?
అధిక బరువు – గర్భంలో ఇబ్బందులు
శరీర బరువు పెరుగుతున్నకొద్దీ ఎవరిలో అయినా రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏ అనారోగ్యాలు లేనివారికి కూడా స్థూలకాయం అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. స్త్రీల విషయానికి వస్తే శరీర బరువు గర్భం దాల్చడంలో ఆటంకాలను కలిగిస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? ఒకవేళ అదే నిజమైతే అందుకు కారణాలేంటి ?
మహిళల్లో సంతానలేమికి కారణాలు
పిల్లలు కలగకపోవడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ అధిక బరువు ఉండి సంతానం కలగని సందర్భంలో ఇందుకు కారణం ఒబేసిటీయే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మన శరీరంలోని 30శాతం కణజాలం కొవ్వుతో తయారయితే దానిని ఒబేసిటీగా పరిగణిస్తారు. అధిక బరువుతో మధుమేహం, గుండెసమస్యలు, అధిక రక్తపోటుతో పాటు సంతానలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా
- మన జీవన విధానం,
- అధికబరువు
- పోషకాహారలోపం
- సంతానలేమి
ఇవన్నీ ఒకదానితో ఒక ముడిపడి ఉన్నట్టుగా తెలుస్తోంది. బరువు ఎక్కువగా ఉన్న స్త్రీలు హార్మోనల్ అసమతౌల్యానికి గురికావటం ఆ కారణంగా రుతుక్రమం, అండాల విడుదల సవ్యంగా ఉండకపోవటం ఎక్కువగా జరుగుతోంది.
బరువు తగ్గితేనే సంతాన ప్రక్రియ
అధికబరువు సమస్య వలన సాధారణ గర్భధారణే కాకుండా ఐవిఎఫ్‌లాంటి పద్ధతులకు వెళ్లినా ఫలితం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధికబరువున్న స్త్రీల శరీర వ్యవస్థ సంతానోత్పత్తికి సంబంధించిన మందులకు సక్రమంగా స్పందించకపోవడమే అందుకు కారణం. ఈ కారణంగానే కొన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ క్లినిక్‌లు బరువు తగ్గితేనే తాము సంతాన ప్రక్రియను మొదలుపెడతామని చెబుతున్నాయి.
బరువు అధికంగా ఉన్న మహిళల్లో సంతానహీనతే కాకుండా ఒకవేళ గర్భం దాల్చినా అబార్షన్ అయిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా పలు అధ్యయనాల్లో రుజువైంది. సాధారణంగా గర్భం దాల్చినా, ఇతర శాస్త్రీయ పద్ధతుల ద్వారా గర్భధారణ జరిగినా….ఈ ప్రమాదం హెచ్చుగానే ఉన్నట్టుగా వైద్యులు గమనించారు.
బరువు తగ్గడానికి ఏంచేయాలి?
అధికబరువుండి సంతానలేమి సమస్య ఉన్నవారు తప్పనిసరిగా బరువు తగ్గే ప్రయత్నాలు చేయాల్సిందే. సంతానలేమికి చికిత్స తీసుకోవాలని ఆశిస్తున్నవారు సైతం తప్పకుండా ముందు బరువుని తగ్గించుకుని ఆ తరువాతే ఆ ప్రయత్నాలు చేస్తే మంచిది. బరువు తగ్గటం అనేది చెప్పినంత సులువు కాకపోయినా అసాధ్యమైతే కాదు. ఆహారం, వ్యాయామాలు, ఆలోచనలు అన్నింటిలో మార్పులు చేసుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరిస్తూ కనీసం కొంతవరకైనా బరువుని తగ్గించుకుంటే మంచిది.
స్థూలకాయంతో ఉన్నపుడు సంతానం కలగనివారు బరువు తగ్గాక ఏ చికిత్స లేకుండానే గర్భం దాల్చటం గమనించారు. యవ్వనంలోకి అడుగుపెట్టాక బరువు పెరుగుతున్నవారిలో సంతానోత్పత్తికి సంబంధించిన అవయవాల పనితీరు ప్రభావితం అవుతున్నట్టుగా వైద్యులు గుర్తించారు. అందుకే బాల్యంలో సన్నగానే ఉండి వయసు వస్తున్నకొద్దీ బరువు పెరుగుతున్న అమ్మాయిలు తప్పకుండా బరువుని అదుపులో పెట్టుకునే ప్రయత్నాలు చేయాలి.
[wpdiscuz-feedback id=”s2njkx9eau” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]