పెళ్ళయిన జంటలు సంతానం కోసం ఆరాటపడుతుంటారు. అయితే ఆధునిక కాలంలో రకరకాల కారణాలతో సంతానలేమి అన్నది ఒక సమస్యగా మారింది. పెళ్లి అయ్యాక రెండు ఏళ్ల పాటు కలిసి కట్టుగా కాపురం చేసినా గర్భం దాల్చక పోవటాన్ని సంతాన లేమిగా భావించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనికి కారణాలు రకరకాలుగా ఉండవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు కొన్ని అయితే, మహిళల స్థూల కాయం కారణంగా సంతానం కలగకపోవటం మరో సమస్య. అయితే ఈ కారణం వల్ల వాళ్ళు ఎప్పటికీ నిస్సంతులుగా మిగిలిపోవాలా, ఏవైనా ప్రత్యామ్నాయాలున్నాయా?
స్థూలకాయానికి, గర్భధారణకూ సంబంధం ఉందా?
గర్భం దాల్చటం మీద జీవనశైలి ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు ఇటీవలి వైద్య శాస్త్ర అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలస్యంగా వివాహం చేసుకోవటం లాంటి కారణాలు అందులో ప్రధానమైనవి.
ఆడవాళ్ళ వలన సంతాన లేమి, మగవాళ్ళ వలన సంతానలేమి, ఇద్దరిలోపం వలన సంతానలేమి అనేవి దాదాపుగా సమాన స్థాయిలో ఉన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. అయితే, ఆడవాళ్ళలో ఆరోగ్య సంబంధమైన సమస్యలతోబాటు స్థూలకాయం కూడా సంతానలేమికి కారణం.
గర్భధారణకు, జీవనశైలికి సంబంధముందా?
సాధారణంగా 20 సంవత్సరాల నాటికి అమ్మాయిలలో అన్ని అవయవాలు పూర్తిగా ఎదగటం వలన సంతానోత్పత్తికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. అప్పటి నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు గర్భధారణకు బాగా అనుకూలమైన వయసు అనుకోవచ్చు. మహిళల్లో 35 సంవత్సరాలు దాటినప్పటినుంచీ పునరుత్పత్తి రేటు తగ్గుతూ వస్తుంది.
పురుషుల్లో మాత్రం ఇందుకు తగిన వయస్సు 40 ఏళ్ల దాకా చెబుతారు. 40 దాటాక ఈ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా వివాహం చేసుకొనే వారిలో ఈ సమస్య ఏర్పడటానికి ఇదే కారణం. మద్యం తాగటం వంటి దురలవాట్లు కూడా సంతానలేమిని ప్రభావితం చేస్తాయి.
గర్భధారణకు స్థూలకాయం సమస్య అవుతుందా ?
అయితే, జీవనశైలికి సంబంధించిన ప్రధాన అంశాల్లో స్థూలకాయం కూడా ఒకటి. ఆధునిక కాలంలో యువతులు కూడా ఉద్యోగాలు చేయటం, అందులోనూ సీటుకు అతుక్కొని పనిచేయాల్సిన ఉద్యోగాలు ఎక్కువగా ఉండటంతో వాళ్ళలో స్థూల కాయం ఒక సమస్యగా మారి సంతానలేమికి దారితీస్తోంది.
శారీరక వ్యాయామం బాగా తగ్గిపోవటం, శరీర భాగాలకు ఏ మాత్రం అలసట లేని పరిస్థితి రావటం కారణంగా శరీరంలో కొవ్వులు పేరుకొని పోయి అధిక బరువుకి లేదా స్థూలకాయానికి దారితీస్తోంది.
అండాలు విడుదలైనా స్థూలకాయుల్లో సంతాన సమస్య తప్పదా?
అండాల విడుదలకు సంబంధించిన సమస్యలేవీ లేకపోయినా, స్థూలకాయమున్న ఆడవాళ్ళలో పిల్లలు పుట్టటం బాగా తగ్గిపోతోంది. మామూలుగా ఉన్నవారి కంటే స్థూలకాయం ఉన్న ఆడవాళ్లు 43% మంది సంతానలేమితో బాధపడుతున్నారని, ఋతుచక్రం సజావుగానే ఉన్నా, స్థూలకాయుల్లో పునరుత్పత్తి తక్కువగా ఉన్నట్టు నిర్థారించారు.
ఎత్తు, బరువుల మధ్య సంబంధాన్ని బట్టి గర్భధారణ నిర్ణయించగలరా?
స్థూలకాయానికీ గర్భధారణకూ మధ్య సంబంధాన్ని నిర్థారించటానికి దాదాపు మూడు వేల జంటల మీద పరీక్షలు జరిపారు. ఆ జంటలన్నీ ఏడాదికి పైగా గర్భధారణకోసం ప్రయత్నించాయి.
భార్యలలో అండాల విడుదల, భర్తలలో నాణ్యమైన వీర్యం ఉన్నట్టు నిర్థారించిన మీదటనే వాళ్ళను ఈ పరీక్షలకి సిద్ధం చేశారు. మిగిలిన లోపాలేవీ లేవు గనుక ఈ పరీక్షకు తగినట్టుగా నిర్ణయించారు. వాళ్ళ బరువు, ఎత్తు, పొగతాగే అలవాటు లాంటివి అధ్యయనం ప్రారంభంలోనే నమోదు చేశారు.
ఆడవాళ్లను బరువు తక్కువ ఉన్నవారు, మామూలు బరువు ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు, స్థూలకాయం ఉన్నవారు అనే నాలుగు వర్గాలుగా విభజించారు. వాళ్ళ ఎత్తు, బరువు నిష్పత్తిని ఆధారంగా ఈ విభజన జరిగింది.
స్థూలకాయం వల్ల గర్భధారణ అవకాశాలు తక్కువేనా?
ఏడాదికి పైగా ప్రయత్నించినా గర్భధారణ జరగని వాళ్ళు అత్యధికంగా 86% మంది స్థూలకాయం ఉన్నవాళ్ళేనని ఇందులో తేలింది. స్థూలకాయం వల్ల గర్భధారణ జరగకపోవటానికి నిర్దిష్టమైన కారణమంటూ తెలియలేదు.
ఆకలిని నియంత్రించే లెప్టిన్ అనే హార్మోన్ ఉత్పత్తిలో ఒడిదుడుకుల వలన ఫలదీకరణ విజయవంతం కావటం లేదన్నది ఒక వాదన. గతంలో అనుకున్నదానికంటే ఈ అంశం చాలా క్లిష్టంగా తయారైందని కూడా డాక్టర్లు విశ్లేషిస్తున్నారు.
ఒకపుడు కేవలం నమ్మకమే అనుకున్నా, ఇప్పుడది నిజమని తేలిందంటున్నారు. పైగా, సంతాన సాఫల్య చికిత్స పొందుతున్న వారిలో స్థూలకాయం ఉన్న మహిళలకు ఎక్కువ మోతాదులో మందులు వాడాల్సి వస్తున్నట్టు కూడా నిర్థారించారు. ముందు ముందు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉండగా ప్రస్తుతానికి అది వాస్తవమని మాత్రం తేలిపోయింది.
స్థూలకాయం కూడా ఇతర దీర్ఘకాలిక సమస్యలలాంటిదేనా?
గర్భం ధరించాలంటే ఆరోగ్యవంతమైన బరువు ఉండటం చాలా అవసరం. స్థూలకాయం ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో కూడా డాక్టర్లు నిర్థారించారు.
ముఖ్యంగా
- గుండె జబ్బులు
- మధుమేహం
- వెన్నునొప్పి
- కీళ్లనొప్పులు
లాంటి అనేక సమస్యలకు అది కారణమని తెలుసు.
కానీ ఇది పిల్లలని కనటానికి కూడా అవరోధంగా తయారైంది. ఎత్తుకు, బరువుకు మధ్య ఉండాల్సిన నిష్పత్తి మితిమీరినప్పుడు దేహంలో హార్మోన్లపరంగా మార్పులు వస్తాయి. అప్పుడు సహజ హార్మోన్ల స్థాయిలో మార్పులు కనబడతాయి. ఫలితంగా గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతాయి.
స్థూలకాయం ఉన్న మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందా?
స్థూలకాయం వలన ఇన్సులిన్ ను తట్టుకునే శక్తి తగ్గుతుంది. దీనివల్లనే మధుమేహం వస్తుంది. అదే సమయంలో ఇది గర్భధారణకూ అవరోధంగా మారుతుంది. ఋతుచక్రం అసాధారణంగా మారిపోతుంది. అండాల విడుదలను కూడా ప్రభావితం చేస్తుంది.
ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే సహజ గర్భ ధారణ మాత్రమే కాదు, కత్రిమ గర్భధారణ విధానాలకు సైతం సహకరించని పరిస్థితి వస్తుంది. ఐ వి ఎఫ్ లాంటి పద్ధతులకూ ఇదొక సవాలుగా తయారవుతుంది. హార్మోన్లు లేదా నాసిరకం అండాలు అందుకు కారణమవుతాయి.
ఇది మగవాళ్లలోనూ ప్రమాదమేనా?
ఆడవాళ్లు స్థూలకాయులైతే మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ తగ్గిపోయి నిస్సంతులుగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. అందుకే బరువు తగ్గటం వలన ఆడవాళ్ళలో గర్భధారణకు సంబంధించిన అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని చెబుతున్నారు.
బరువు తగ్గే కొద్దీ హార్మోన్ల అసమతుల్యత తగ్గటం అందుకు కారణం. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం లాంటి పనుల ద్వారా అది సాధించాలి.
స్థూలకాయ సమస్య నుంచి బయటపడి గర్భం ధరించటం ఎలా?
ఇప్పటివరకూ మనం స్థూలకాయం వలన
- గుండె సంబంధమైన వ్యాధులు
- మధుమేహం
- కీళ్ళనొప్పులు
వంటి సమస్యలే ఎక్కువగా వస్తాయనుకున్నాం. కానీ మితిమీరిన బరువు ఉంటే గర్భధారణ సైతం అసాధ్యమని తేలటంతో దీన్ని చాలా కీలకమైన సమస్యగా గుర్తించాల్సిన అవసరమొచ్చింది. బరువు తగ్గటం ద్వారా మాత్రమే దీన్ని పరిష్కరించుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.
బరువు తగ్గటం ముఖ్యమే కానీ…!
ఈ తగ్గటమన్నది ఒక క్రమ పద్ధతిలో వ్యాయామం ద్వారా జరగాలి తప్ప అసాధారణ చికిత్సావిధానాల జోలికి వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నారు. డైటింగ్ కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ఒక క్రమపద్ధతిలో తీసుకోవటం ద్వారా జరగాలే తప్ప ఒక్కసారిగా ఆహారపు అలవాట్లు మార్చుకోవద్దని, డాక్య్టర్ల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.