గర్భంలోని శిశువుకు తల్లి ద్వారా కరోనా సోకవచ్చునని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా వైరస్ తన ఉనికిని నిలబెట్టుకోడానికి కొత్త రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ అధ్యయనాన్ని తెరపైకి తీసుకువస్తున్న సందర్భంలో గర్భిణీలు మరియు వారి గర్భంలో ఉన్న శిశువు Covid-19 వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని, గర్భంతో ఉన్న స్త్రీలు తమను తాము రక్షించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గర్భిణీలు తమని తాము రక్షించుకోవాలి
గర్భస్థ శిశువుకు కోవిడ్ వ్యాధి సోకితే దాని ప్రభావం బిడ్డ జన్మించిన తరువాత దీర్ఘ కాలంలో ఎలా ఉంటుందో ఇంకా తెలియరాలేదని డల్లాస్ లోని సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్, పిడియాట్రిక్ డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ డా. అమంద ఇవాస్ అభిప్రాయపడుతున్నారు.
34 వారాల గర్భిణీ విషయంలో ఈ కేసు బయటపడింది. ప్రసవ నొప్పులు వస్తున్న సందర్భంలో ఒక గర్భిణీ స్త్రీ డల్లాస్ లోని పార్క్ లాండ్ మెమోరియల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో చేరింది. ఆవిడకు కరోనా వ్యాధికి కారణమయ్యే SARS-CoV-2 వైరస్ పాజిటివ్ వచ్చింది.
అయితే కోవిడ్ వ్యాధిలో కనిపించే శ్వాస సంబంధ ఇబ్బందులేవీ ఆవిడలో కనిపించలేదు. జ్వరం, విరేచనాలు వంటి మామూలు వైరల్ ఇన్ఫెక్షన్లతో మాత్రమే ఆవిడ బాధపడ్డారు. హాస్పిటల్ లో పరీక్షలు చేసి నిర్ధారించే వరకు ఆవిడకు కోవిడ్ వ్యాధి సోకిందన్న సంగతి తెలియదు.
పుట్టిన శిశువుకు కరోనా
కొద్ది రోజులు హాస్పిటల్ లో ఉన్న తరువాత మే నెల మొదట్లో ఆవిడ ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప పుట్టిన కొద్ది గంటల వరకు ఆరోగ్యంగానే ఉంది. 24 గంటలు గడిచిన తరువాత పాపకు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకునే సమయంలో ఎద భాగాన్ని ఎగేయడం, రక్తంలో ఆక్సీజన్ లెవెల్స్ పడిపోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి.
లక్షణాల ఆధారంగా పాపకు పరీక్షలు చేస్తే కోవిడ్ వ్యాధి సోకినట్టుగా తేలింది. గర్భాశయానికి కోవిడ్ సోకే అవకాశం లేదు అనుకున్న డాక్టర్ లను ఈ విషయం కాస్త షాక్ కి గురిచేసింది.
తల్లీ బిడ్డ క్షేమం
తరువాత చేసిన మెడికల్ పరీక్షల్లో పాపకు తల్లి గర్భంలో ఉన్నపుడే కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిందన్న విషయం తేలింది. చికిత్స తరువాత తల్లి బిడ్డ ఇద్దరు కోవిడ్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడి ఇప్పుడు క్షేమంగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్ల కంటే ఎక్కువ మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. అయితే ఈ వ్యాధి గర్భిణీలకు సోకిన ఆధారాలు పెద్దగా లేవు. ఇప్పుడు కొత్తగా బయటపడిన ఈ కేసు ఆధారంగా దీనిపై పరిశోధన చేస్తామంటున్నారు నిపుణులు.
గర్భిణీలకు కరోనా సోకిన కేసులు చాలా తక్కువగానే ఉన్నా కొత్తగా బయటపడిన ఈ కేసు ఆధారంగా గర్భిణీలు అలాగే ఈ మధ్య కాలంలో పిల్లలని కన్న తల్లులు, వారి శిశువులు కరోనా వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
టెలి మెడిసిన్ మేలు
ఈ కరోనా కాలంలో గర్భిణీలు డాక్టర్ చెకప్ ల కోసం హోస్పిటల్ కి వెళ్లాల్సి వస్తే ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన టెలి మెడిసిన్ పద్ధతిని పాటించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. దీని ద్వారా గర్భిణీలు కరోనా వ్యాధి బారిన పడకుండా తమని తాము రక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెబుతున్నారు.