గర్భం దాల్చినప్పటినుండీ ప్రసవం అయ్యే వరకు గర్భిణులు అనేక విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా ఏ మందులూ వాడకూడదు. సాధారణ సమయాలలో ఏవైనా చిన్నపాటి అనారోగ్యాలు ఉంటే మెడికల్ షాపుల్లో లభించే మందులను వాడటం అందరికీ అలవాటే. కానీ గర్భిణులు మాత్రం అలా చేయకూడదు. తమకు ఏ మందులు సురక్షితం అనే అవగాహన లేనప్పుడు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో కొన్ని మందులను అసలు వేసుకోరాదని వైద్యులు చెబుతుంటారు. గర్భిణులకు ఎలాంటి హాని చేయని మందులు కొన్ని ఉన్నాయి. అయితే వాటి గురించిన అవగాహన అవసరం. గర్భందాల్చినట్టుగా నిర్దారణ అయిన తరువాత ఏ మందులు వాడవచ్చు… ఏవి వాడకూడదు… అనే విషయంలో వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తాము తరచుగా చిన్నపాటి అనారోగ్యాలకు వాడే మందులను అవే తీసుకోవచ్చా… లేదా వాటికేమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాలి.
గర్భం దాల్చినట్టు తెలిశాక మహిళలు ఏ మందునీ వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. అంతకుముందు తాము ఏవైనా అనారోగ్యాలకు మందులను వాడుతున్నట్లయితే ఆ విషయం కూడా డాక్టరుకి చెప్పాలి. ఏవైనా సప్లిమెంట్లు వాడుతున్నా కూడా వైద్యులకు ఆ విషయం తెలియజేయాలి. ఇతర అనారోగ్యాలకు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వస్తే తాను గర్భవతినన్న సంగతి వైద్యులకు తెలపాలి.
గర్భధారణకు ముందు, ఆ తరువాత కూడా వాడాల్సిన ప్రీనేటల్ విటమిన్లను గర్భిణులు నిస్సందేహంగా వాడవచ్చు. అయితే ఇతర విటమిన్లు, హెర్బల్ మందులు, సప్లిమెంట్లు వాడాలనుకుంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందే. ప్రకృతి సహజమైనవిగా భావించే హెర్బల్ మందులను, సప్లిమెంట్లను సైతం తమకు తాముగా వాడకూడదు. చాలారకాల హెర్బల్ మందులు, సప్లిమెంట్లు గర్భిణులకు సురక్షితమని తేలలేదని గుర్తుంచుకోవాలి. అలాగే బాగా అత్యవసరం అయితే తప్ప మెడికల్ షాపుల్లో తెచ్చుకున్న మందులను వాడటం మంచిది కాదు. అప్పుడు కూడా అవి సురక్షితమా కాదా అనేది తెలుసుకున్నాకే వాడాలి.
కొన్నిరకాల మందులు గర్భిణులకు సురక్షితమని వాటి పైన ముద్రించి ఉన్న మార్గదర్శకాల్లో ఉంటుంది. గర్భిణులకు సురక్షితమైనవాటిలో అలర్జీ, జలుబు, ఫ్లూ, మలబద్ధకం, చర్మం పైన దద్దర్లు తదితర అనారోగ్యాలకు వాడే మందులున్నాయి. అవి గర్భవతులకు సైతం సురక్షితమేనని వాటిపైన ప్రకటితమై ఉంటుంది. అయినా సరే వైద్యుల సలహా తీసుకోవటం మంచిది. మరీ ముఖ్యంగా గర్భిణులు మొదటి మూడునెలల్లో ఏ మందులనూ డాక్టరు సలహా తీసుకోకుండా వేసుకోరాదు.
గర్భవతులు మందుల షాపుల్లో లభించే మందులను తమకు ఇష్టం వచ్చినట్టుగా వాడరాదనే అవగాహన చాలా అవసరం. అయితే ఇలాంటి సందర్భాల్లో కొంతమంది… ప్రకృతి సహజమైన మందులు, పద్ధతుల ద్వారా గర్భధారణ వలన వచ్చిన సమస్యలను పరిష్కరించుకోచ్చని భావిస్తుంటారు. అయితే ప్రకృతి సహజమైనవి అన్నీ సురక్షితం కాదని కూడా గుర్తుంచుకోవాలి.
గర్భం దాల్చిన వెంటనే చాలామందికి వికారం, వాంతులు వంటివి విపరీతంగా ఉంటాయి. ఇలాంటప్పుడు
- ఆక్యుపంక్చర్
- ఆక్యుప్రెషర్
- అల్లంతో కూడిన క్యాప్సుల్స్
- బి6 విటమిన్ టాబ్లెట్లు
- డబ్బాలలో లభించే పీచ్
- పియర్స్
- పైనాపిల్
వంటి కొన్నిరకాల పళ్ల జ్యూసులు వంటివి వాంతులకు బాగా పనిచేస్తాయనే పేరుంది. అయితే వీటిలో ఏవి వాడాలన్నా కూడా డాక్టరు సలహా తీసుకోవటం మంచిది.
మొక్కల నుండి తయారుచేసిన కొన్నిరకాల ఓరల్ సప్లిమెంట్లు, అరోమాపతి ఎసెన్షియల్ ఆయిల్స్ ని గర్భిణులు వాడకూడదు. అవి పొట్టలోని శిశువుకి హాని చేసే ప్రమాదం ఉంది. వాటిని వాడటం వలన పొట్టలోని శిశువులో లోపాలు ఏర్పడటం, త్వరగా నొప్పులు రావటం వంటి సమస్యలు ఉండవచ్చు.
గర్భిణుల్లో కనిపించే నడుము వెన్ను నొప్పులకు కొన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. అవి సురక్షితంగా గర్భిణుల నొప్పులను తగ్గిస్తాయనే పేరుంది. అయితే మసాజ్ తో కూడా ఈ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. శిక్షణపొందిన థెరపిస్టు ద్వారానే ఈ ఉపశమనం పొందాల్సి ఉంటుంది. తల్లిపొట్టలో ఉన్న శిశువు ప్రసవ సమయానికి తలకిందకు శరీర భాగం పైకి ఉండేలా తిరుగుతుంది.
అలాకాకుండా శిశువు తలపైకి ఇతర శరీర భాగం కిందకు వస్తే అలా ఉన్న స్థితిని బ్రీచ్ పొజిషన్ అంటారు. బేబీ అలా ఉన్నపుడు ఈసీవి అనే పద్ధతి ద్వారా శిశువుని తిరిగి తలకు కిందకు ఉండే పొజిషన్ లోకి వైద్యులు తీసుకువస్తుంటారు. అయితే అలాంటి సమయంలో వైద్యపరమైన పద్ధతులను కాకుండా వ్యాయామం, హిప్నోసిస్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను సైతం అనుసరించవచ్చు.
అలాగే ప్రసవనొప్పుల నుండి ఉపశమనం కలిగించే ఇంజక్షన్లు ఉన్నాయి కానీ… వేడినీళ్ల ద్వారా కూడా నొప్పుల బాధను తగ్గించుకునే అవకాశం ఉంది. రిలాక్సేషన్, శ్వాస వ్యాయామాలు, ఆప్తులు ధైర్యం చెప్పటం, సెల్ఫ్ హిప్నోసిస్ ల ద్వారా కూడా ఈ నొప్పులను భరించే శక్తిని తెచ్చుకోవచ్చు. కొంతమందికి ఆక్యుపంక్చర్ సైతం బాగా పనిచేస్తుంది.
గర్భిణులకు వందశాతం సురక్షితం అనదగ్గ మందులు ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. వారు ఎలాంటి మందులను, సప్లిమెంట్లను, థెరపీలను వాడాలన్నా వైద్యుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గర్భిణికి ఉపయోగపడ్డాయి కదా అని మరొకరు అవే మందులను, పద్ధతులను వాడటం కూడా మంచిది కాదు. ఎవరి శరీర తీరు, ఆరోగ్య స్థితిని బట్టి వారికి ప్రత్యేకంగా వైద్య సలహాలు అవసరం అవుతాయి.
(ఇక్కడ ప్రచురించబడిన సమాచారం డాక్టర్లు సూచించే చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. కేవలం ప్రేక్షకుల అవగాహన కొరకు మాత్రమే పొందుపరచబడింది. రచయిత మెడికల్ జర్నలిస్ట్)