భార్యాభర్తలు గొడవపడుతున్నపుడు మూడో మనిషి మధ్యలోకి వెళ్లకూడదని అంటుంటారు. ఆలుమగలు కొట్టుకున్నా తిట్టుకున్నా…తరువాత ఒకటైపోతారనే నమ్మకం వలన అలా అంటారు. చాలామంది విషయంలో అలాగే జరుగుతుంది కూడా. అయితే కొన్నిసార్లు వారి మధ్య రాజీ పడలేని పరిస్థితి సైతం ఏర్పడవచ్చు. అలాంటప్పుడు ఇతరుల జోక్యం అవసరం కావచ్చు. బంధం పూర్తిగా తెగేవరకు ఆగకుండా… ఆత్మీయులైన పెద్దలతోనో, లేదా మానసిక నిపుణులతోనో తమ సమస్యని చెప్పి పరిష్కారం పొందవచ్చు.
కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే గొడవలను మన సమాజంలో అంత సీరియస్ గా తీసుకోరు. సంవత్సరాల తరబడి మాట్లాడుకోని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు, తండ్రీ కొడుకులు…మన చుట్టూ కనబడుతుంటారు. అది అంత సీరియస్ విషయంగా కూడా ఎవరూ భావించరు. అయితే ఇలాంటి పరిస్థితి భార్యాభర్తల మధ్య ఉంటే మాత్రం… ఒక కుటుంబం మొత్తం సమస్యల సుడిగుండంగా మారిపోతుంది. అందుకే భార్యాభర్తలు తమ మధ్య ఉన్న విభేదాలను కాలయాపన లేకుండా త్వరగా పరిష్కరించుకోవటం మంచిది. అయితే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నపుడు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది.
భార్యాభర్తల గొడవలు పడి ఒకరికో ఒకరికి పడనప్పుడు?
పెళ్లితో నీ జీవితంలోకి వచ్చే వ్యక్తే నీకు సర్వస్వం… అంటూ అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్పే సంస్కృతి మనది. అంటే ఆ వ్యక్తి గురించి తెలియకముందు నుండే రాజీ పడటం మొదలవుతుంది. వైవాహిక జీవితంలో రాజీ పడటం అనేది మరీ శృతి మించినా..లేదా అసలు రాజీ పడకపోయినా దీర్ఘకాలంలో సమస్యలు ఒత్తిళ్లు పెరిగిపోతుంటాయి. నిజం చెప్పాలంటే భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఇదీ అని తేల్చి చెప్పలేము. ఒక్కో జంట విషయంలో ఒక్కోరకమైన కారణం ఉండవచ్చు. అయితే మనస్పర్థలు వచ్చాక ఎదురయ్యే పరిస్థితులు మాత్రం దాదాపు అన్ని జంటల విషయంలోనూ ఒకేలా ఉంటాయి. విభేధాలు వచ్చాక ఒకరంటే ఒకరికి ఉన్న ఇష్టం తగ్గుతుంది. అయితే ఇద్దరూ కలిసి పంచుకున్న అందమైన ప్రేమానుబంధాల తాలూకూ జ్ఞాపకాలు… సముద్రపు అలల్లా మనసులో లేచి పడుతుంటాయి కనుక…. తమ మధ్య ప్రేమ పూర్తిగా పోయింది…అనుకోవడానికి మనసొప్పదు.
ఇద్దరూ నేనే రైటు అనుకుంటూ…ఒకరిమాటని ఒకరు వినలేని పరిస్థితిలో ఉన్నపుడు ఏంచేయాలి?
ఒకప్పుడు ప్రేమించిన, ప్రేమని పంచిన మనసు తిరిగి పరిస్థితులు చక్కబడతాయనే ఆశతో ఎదురుచూస్తుంటుంది. అందుకు తగినట్టుగా తిరిగి ఇద్దరూ ఒకరి పట్ల ఒకరు క్షమని, అభిమానాన్ని చూపించుకోగలిగితే ఫరవాలేదు. అది సాధ్యం కాకపోతే విభేదాలను ఎక్కువకాలం పరిష్కరించుకోకపోతే తెలియకుండానే మానసిక దూరం పెరిగిపోతుంది. అప్పుడు ఇద్దరు కలిసి ఉన్నా…ఒకరి సమక్షంలో మరొకరికి ఎలాంటి ఆనందం ఉండదు. ఒకరిపై ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇద్దరూ కలిసే బతుకుతున్నా ఒంటరిగా జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. చిన్నపాటి అభిప్రాయ భేదాలే పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. ఇద్దరూ నన్ను తను అర్థం చేసుకోవటం లేదు అనే అభిప్రాయంతోనే ఉంటారు. ఇలాంటప్పుడు తప్పకుండా సహనంతో ఒకరిమాటని ఒకరు వినితీరాలి. అలా వినలేనప్పుడు ఇద్దరూ నేనే కరెక్టు అనుకున్నపుడు… ఎన్నిసార్లు కూర్చుని మాట్లాడుకుందామని అనుకున్నా.. సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కారం కాదు.
చిన్న గొడవలు, భేదాభిప్రాయాలను సవ్యంగా పరిష్కరించుకోలేకపోతే అవే పెద్దవై ఇక కలిసి ఉండటం సాధ్యం కాదనేంత కోపం ద్వేషం ఏర్పడతాయి. ఇలాంటప్పుడు ఒకరికి ఒకరు శత్రువుల్లా కనబడుతుంటారు. ఇద్దరూ ఎదుటివారి నుండి వచ్చే మాటల దాడిని విమర్శలను ఎలా తట్టుకోవాలి….అనే ఆలోచనల్లో ఉండి…అవతలినుండి మాట రాకముందే తామే అరిచేస్తుంటారు. ఇది తమని తాము రక్షించుకునే స్థితి. ఇలాంటప్పుడు ఒకరితో ఒకరు మామూలుగా మాట్లాడుకోవటం అంటూ ఉండదు. డబ్బు విషయాలు కానీ కుటుంబ వ్యవహారాలు, పిల్లల సంగతులు ఏవైనా కానీ…ఒకరితో ఒకరు చెప్పుకోవటం ఆగిపోతుంది. తనని పూర్తిగా నెగెటివ్ గా చూస్తూ చీత్కరించుకుంటున్న వ్యక్తికి ఏం చెప్పాలిలే…అనే నిర్లక్ష్యం ఏర్పడుతుంది. అసలు చెప్పడానికి మనసు కూడా సహకరించదు. ఇలాంటప్పుడే ఒకరితో ఒకరు అబద్దాలు చెప్పుకోవటం కూడా మొదలవుతుంది.
నేనంటే ప్రేమలేని వ్యక్తి గురించి ఇంత తాపత్రయ పడటం అనవసరం నాకు నచ్చినట్టుగా నేనుంటాను…అనే భావం పెరుగుతుంది. ఎవరిదారి వారిదే అన్నట్టుగా పనులు చేసుకుంటూ పోతుంటారు. ఒకరి విషయాలు మరొకరికి చెప్పాలన్న బాధ్యతని మర్చిపోతారు. సాధారణంగా ఇద్దరూ చాలా మొండివాళ్లయి, ఇద్దరికీ అవతలివారి కోణంలోంచి ఆలోచించే అలవాటు, సహానుభూతి లేకపోతే పరిస్థితి ఇలా తయారవుతుంది. తమ మధ్య ఉన్న గొడవలు ఎలా పరిష్కారమవుతాయి…అనే విషయాన్ని ఆలోచించకుండా… అలాగే కాలం గడిపేస్తే ఆ బంధం ఎవరూ బాగుచేయలేనంతగా పాడై పోయే అవకాశం ఉంది. ఒకరిమాట ఒకరు వినలేని పరిస్థితి వచ్చిందంటే ఇద్దరిలో విచక్షణ లోపించిందనే చెప్పాలి. అయినా సరే…ఇలాంటప్పుడైనా కౌన్సెలింగ్ కి వెళితే…అపోహలు తొలగి మెదడు సవ్యంగా సానుకూలంగా ఆలోచించగలుగుతుంది.
భార్యాభర్తలిద్దరూ ఒకరిమాట ఒకరు వినలేని పరిస్థితి ఉన్నపుడు కౌన్సెలర్లు ఎలా సహాయపడతారు?
ఆప్తులతో తీవ్రమైన విభేదాలు వచ్చి, మానసిక దూరం పెరిగినప్పుడు ఎవరికైనా కాస్తంత ఓదార్పు కావాలనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు…ప్రతిరోజు నిప్పులా రగులుతుంటే జీవితం చాలా చికాగ్గా మారుతుంది. ఇలాంటప్పుడు…తమ మాట విని నువ్వు కరెక్టే అని చెప్పే మనిషి స్నేహం కావాలని మనసు ఆరాటపడుతుంది. మనసుకి సంబంధించిన తోడుగా, ఎమోషనల్ సపోర్టుగా ఆ బంధాన్ని చెప్పవచ్చు. అయితే ఇలాంటి బంధాలు…భార్యాభర్తల మధ్య దూరాన్ని మరింతపెంచే ప్రమాదం ఉంది.
భర్తతో గొడవలైనప్పుడు కొంతమంది ఆడవాళ్లు తమలో తామే బాధపడితే… మరికొందరు తల్లితోనో, తోబుట్టువులతోనో, ఆఫీస్లో కొలీగ్స్ తోనో…ఇలా ఎవరో ఒకరు మనసుకి దగ్గరైన వారితో చెప్పుకుంటారు. మగవారు ఇలా షేర్ చేసుకోవటం తక్కువే అయినా…వారికి కూడా తమని అర్థం చేసుకునే మనిషి ఉంటే బాగుండుననే ఆలోచన రాకమానదు. ఇలాంటప్పుడు మానసికంగా తోడు కోసం తపించడం, తమకి నచ్చిన వ్యక్తులతో బాగా సన్నిహితంగా స్నేహం చేయటం సర్వసాధారణంగా జరుగుతుంది. వారితో ఉన్నది స్వచ్ఛమైన స్నేహమే అయినా…ఆ వ్యక్తికి తమ జీవిత భాగస్వామికంటే ఎక్కువ విలువని ఇచ్చి…తమకు సంబంధించిన అన్ని రకాల విషయాలు చెప్పుకోవటం జరుగుతుంటుంది. ఆ వ్యక్తి గురించి జీవిత భాగస్వామికి తెలియకుండా జాగ్రత్త పడటం కూడా చేస్తారు.
కౌన్సెలింగ్ తో భార్యాభర్తల బంధాన్ని తిరిగి నిలబెట్టే అవకాశం ఉందా?
ఇలాంటి సందర్భంలో జీవిత భాగస్వామితో దూరం మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇద్దరి మధ్య అపార్థాలు, అపోహలు మరింతగా పెరుగుతాయి. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం కూడా పోతుంది. ఇది వైవాహిక బంధం పూర్తిగా తెగిపోయే దశగా చెప్పవచ్చు. ఇప్పుడు జీవిత భాగస్వామిని గురించి తలచుకుంటే ఒక్క మంచి ఫీలింగ్ కూడా మనసులోకి రాకపోవచ్చు. ఇక తమ భాగస్వామి గురించి ఆలోచించడానికి ఏమీ లేదనిపించే విరక్తిలాంటి స్థితి అది. ఇలాంటప్పుడు కూడా ఫ్యామిలీ కౌన్సెలర్లు, మానసిక నిపుణులు…ఒకరిపై ఒకరు పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి నిలబెట్టగలుగుతారు. ఇక కలిసే అవకాశం లేదనుకోవడానికి లేదు. అదే సమస్య వేరే జంటకు వస్తే.. నేనేం సలహా ఇస్తాను…అనే ప్రశ్న వేసుకుంటే…ఏం చేయాలనే సమాధానం తెలుస్తుంది. వివాహ బంధంలోంచి బయటకు వచ్చేస్తే వచ్చే సమస్యలను ఒకసారి ఊహించుకుంటే…వాటిని ఎదుర్కోవటం కంటే బంధాన్ని నిలబెట్టుకోవడమే తేలిక అనిపించవచ్చు కూడా.
ఆలోచనా విధానం మార్చుకుంటే చాలు చాలా జీవితాలు చక్కబడతాయి.
భార్యాభర్తల బంధంలో ఒక విచిత్రం ఉంటుంది. చాలాజంటల్లో ఇద్దరూ తమ భాగస్వామి తమకు అనుకూలంగా లేరనే భావాన్ని పెంచుకుంటూ పోతుంటారు కానీ …తను… నాకు నచ్చినట్టుగా ఎందుకుండాలి…అనే ప్రశ్నని వేసుకోరు. అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లినట్టుగా తాము తీర్చుకోలేని స్థాయిలో గొడవలు పడుతున్నవారు నిరభ్యంతరంగా కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. ఆలోచనా విధానం మార్చుకుంటే చాలు చాలా జీవితాలు చక్కబడతాయి. సవ్యంగా సాగుతాయి.