సమస్య:
మాకు నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. బాబు పుట్టినపుడు వాడికి జాండిస్ వచ్చింది. ఫోటోథెరపీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ బాబు కళ్ళు పచ్చగానే ఉన్నాయి. బాబుని ఎండకి ఉంచమని అంటున్నారు కానీ ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. సాధారణంగా జాండిస్ ఇన్ని రోజుల వరకు ఉండదు కదా. మరి మా బాబు పుట్టి నెలరోజులవుతున్నా వాడికి జాండిస్ ఎందుకు తగ్గలేదు. ఇది ఏమైనా ప్రమాదానికి దారితీస్తుందా?
సలహా:
అప్పుడే పుట్టిన పిల్లల్లో జాండిస్ వచ్చినపుడు కళ్ళు, శరీరం అంతా పసుపు రంగులోకి మారుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో జాండిస్ రావడం చాలా సాధారణం. శరీరంలో బిల్ రూబిన్ ఎక్కువగా ఉన్నపుడు ఇలా జాండిస్ వస్తుంది. శరీరంలో ఎర్ర రక్తకణాలు తగ్గినపుడు ఇలా పసుపు వర్ణద్రవ్యం పెరుగుతుంది. రోజుల పిల్లల్లో లివర్ పూర్తిగా ఎదిగి ఉండదు కాబట్టి అది బిల్ రూబిన్ ని నియంత్రించలేదు.
సాధారణంగా పిల్లలు పుట్టిన రెండవ లేదా మూడవ రోజున వారిలో జాండిస్ కనిపిస్తుంది. అది ఐదు లేదా ఏడవ రోజుకి కొంచెం ఎక్కువ అవడం అనేది అందరి పిల్లల్లో జరిగేదే. ఆ తరువాత ఒక వారం పది రోజుల్లో పిల్లల్లో జాండిస్ తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గడానికి నాలుగు వారాల వరకు పట్టవచ్చు. సాధారణంగా పిల్లల్లో లివర్ ఎదుగుతున్న కొద్దీ బిల్ రుబిన్ శరీరంలోంచి దానంతట అదే వెళ్లిపోతుంది.
శరీరం అంతా జాండిస్ రావచ్చు. చివరి దశలో అది కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. మీ బాబు విషయంలో కూడా అది చివరి దశలో ఉంది అనుకోవచ్చు. అయినప్పటికీ శరీరంలో జాండిస్ ఎక్కువగా ఉంది అనుకున్నపుడు, సాధారణం కంటే ఎక్కువగా కనిపిస్తున్నపుడు మాత్రం దాన్ని పెతలాజికల్ జాండిస్ గా పరిగణించి చికిత్స చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తల్లికి గర్భిణీ సమయంలో షుగర్ వ్యాధి ఉన్నపుడు, థైరాయిడ్ సమస్య ఉన్నపుడు, తల్లీ బిడ్డలది బ్లడ్ గ్రూప్ వేరేగా ఉన్నపుడు, రొమ్ము పాల కామెర్లు, లివర్ డిసార్డర్ కండిషన్ ఉన్నా కూడా ఇలా జాండిస్ పెరుగుతూ ఉండవచ్చు. అందుకని ఈ లక్షణాలను గుర్తించడానికి కొద్దిపాటి పరీక్షలు చేయడం మంచిది.
మైల్డ్ జాండిస్ అంటే 4 పాయింట్లు, 5 పాయింట్లు, 6 పాయింట్లు ఉన్న పిల్లల గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. జాండిస్ వచ్చిన పిల్లలని కొద్దిపాటి ఎండకి ఉంచటం ద్వారా వారిలో ఈ జాండిస్ తగ్గే అవకాశం ఉంటుంది.
ఒకవేళ రెండు మూడు నెలల వరకు పిల్లల్లో జాండిస్ తగ్గకపోతే అప్పుడు ఆ పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. సాధారణంగా చాలా మంది పిల్లల్లో ఈ పరిస్థితి రాదు. అందుకే ఇతర సీరియస్ జబ్బుల గురించి ఆలోచించకుండా తల్లిపాలు పట్టిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో జాండిస్ తొందరగానే తగ్గుతుంది.
[wpdiscuz-feedback id=”00tvlkhzvr” question=”Please leave a feedback on this” opened=”0″][/wpdiscuz-feedback]