మామూలు కాన్పు కుదరదనుకున్నప్పుడు సి-సెక్షన్ లేదా సిజేరియన్ ఆపరేషన్ద్వారా డెలివరీ చేస్తారు. అయితే, ఒక సారి సిజేరియన్ జరిగితే, ఆ తరువాత మామూలు కాన్పు అయ్యే అవకాశం ఉందా, తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సిందేనా అనేది చాలా మందిలో కలిగే అనుమానం. ఎలాంటి పరిస్థితిల్లో మళ్ళీ సిజేరియన్ అవసరమవుతుంది, సాధారణ కాన్పులో ఉండే రిస్క్ ఎంత?
సుఖ ప్రసవం జరిగే అవకాశం లేదనుకున్నప్పుడు తల్లీ బిడ్డను ప్రమాదంలోకి నెట్టకుండా ఉండేందుకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించవచ్చు. నిజంగా అవసరమైనప్పుడు మాత్రం సిజేరియన్ తప్పనిసరి. సిజేరియన్ వలన తాత్కాలికంగా ఊరట పొందినా, దీర్ఘకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలాంటి సందర్భాలలో నిజంగా సిజేరియన్ అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.
సిజేరియన్ ఎప్పుడు తప్పనిసరి అవుతుంది?
గర్భధారణ జరిగినప్పటినుంచీ పుట్టబోయే బిడ్డ గురించి కలలుగంటూ అందరూ సహజ ప్రసవం జరగాలనే కోరుకుంటారు. అయితే, కొన్ని సమయాల్లో మాత్రం తల్లీబిడ్డల క్షేమం దృష్ట్యా సిజేరియన్ తప్పనిసరి అవుతుంది. గర్భస్థ శిశువు గుండె కొట్టుకోవటంలో అసాధారణమైన తేడా కనబడినప్పుడు కూడా డాక్టర్లు సిజేరియన్ వైపు మొగ్గు చూపుతారు. ప్రసవం జరగాల్సిన దిశకు శిశువు అడ్డం తిరిగినప్పుడు కాన్పు సక్రమంగా జరిగే అవకాశం తక్కువ. అలాంటప్పుడు సిజేరియన్ చేసి బిడ్డను తీస్తారు. ఒకరికంటే ఎక్కువమంది శిశువులు ఉండి, కదలిక సానుకూలంగా లేనప్పుడు, శిశువు కంటే ముందే బొడ్డుతాడు కిందికి జారుతున్నప్పుడు సిజేరియన్ అవసరమవుతుంది.
గర్భిణికి గుండె సంబంధమైన, లేదా మెదడు సంబంధమైన సమస్యలున్నప్పుడు శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేయక తప్పదు. శిశువుకు హైడ్రోసెఫలస్ లాంటి జబ్బువలన తల పెద్దదిగా ఉన్నప్పుడు కూడా సిజేరియన్ ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది సహజ ప్రసవానికి భయపడి కనీసం తొలి కాన్పు అయినా సిజేరియన్ కావాలని కోరుకోవటం కూడా చూస్తున్నాం. సాధారణంగా తొలి కాన్పు సిజేరియన్ అయితే తరువాత కాన్పు కూడా సిజేరియన్ అవుతుంది. అయితే, డాక్టర్లు వీలైనంత వరకూ సహజ ప్రసవం జరగాలనే కోరుకుంటారు. తప్పనిసరి అయితే తప్ప సిజేరియన్ జోలికి వెళ్ళరు.
సిజేరియన్ ఆపరేషన్ లో గర్భిణీకి, శిశువుకు వచ్చే సమస్యలేంటి?
మామూలు కాన్పు అనుకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా సిజేరియన్ కు సైతం సిద్ధంగా ఉండాలి. తల్లీ బిడ్డలకు ఇది సురక్షితమే అయినా పెద్ద సర్జరీ కాబట్టి తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు. మత్తు ఇవ్వటం వలన నొప్పి తెలిసే అవకాశం లేదు. శిశువును బైటికి తీసిన తరువాత ఆరోగ్య పరిస్థితిని బట్టి తల్లికి వెంటనే చూపటమా, లేదా అనేది నిర్ణయిస్తారు. సిజేరియన్ పూర్తి కావటానికి సగటున ముప్పావు గంట నుంచి గంట వరకు పట్టవచ్చు. ఒకవేళ సిజేరియన్ చేయాలన్నది అత్యవసర నిర్ణయమైతే ఈ సమయం కొంత తగ్గుతుంది. శిశువు ఊపిరి పీల్చటం ఇబ్బందిగా మారినా, గుండె కొట్టుకోవటం స్థిరంగా లేకపోయినా ఈ వేగం తప్పనిసరి అవుతుంది. అప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించవలసి వస్తుంది. నొప్పి తెలియకుండా మందులివ్వటమా, పూర్తి స్థాయిలో మత్తు ఇచ్చి నిద్రలోకి జారుకునేట్టు చేయటమా అనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకుంటారు.
అన్ని రకాల పెద్ద ఆపరేషన్ల తరహాలోనే సిజేరియన్ లోనూ కొన్ని రిస్క్ లుంటాయి. శిశువుకు కొద్దిరోజుల పాటు వేగంగా ఊపిరిపీల్చే అవసరం రావచ్చు. తల్లికి గర్భ సంచి అంచులకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. కాన్పు సమయంలోనూ, ఆ తరువాత కూడా ఎక్కువగా రక్తస్రావం జరగవచ్చు. చాలా అరుదుగానే అయినా, ఒక్కోసారి అనెస్థీషియా ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఒకసారి సిజేరియన్ చేసుకుంటే ఆ తరువాత కాన్పులో దాని ప్రభావం ప్రతికూలంగా కనిపించవచ్చు.
సిజేరియన్ తరువాత నార్మల్ డెలివరీకి ఎంతవరకు అవకాశం ఉంటుంది?
ఇంతకు ముందు సిజేరియన్ జరిగితే ఈ సారి మామూలు ప్రసవానికి అవకాశం ఉంటుంది. అయితే, అది మీకు సరిపోతుందా లేదా అనది మాత్రం మీరూ, మీ డాక్టర్ కలసి తీసుకోవల్సిన నిర్ణయం. తల్లీ బిడ్డా క్షేమంగా ఉండటమన్నది ఇందులో ప్రధానంగా లెక్కలోకి తీసుకోవాల్సిన విషయం. అందుకే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తారు. రక్తపోటు… అంటే బీపీ ఎక్కువగా ఉన్నా, వయసు 35 దాటినా, శిశువు పరిమాణం పెద్దదిగా ఉన్నప్పుడు కూడా రిస్క్ తీసుకోవద్దనే సలహా ఇస్తారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇంతకుముందు సిజేరియన్ జరిగి 19 నెలలు దాటకపోయినా సాధారణ కాన్పు కోసం ప్రయత్నించటం మంచిది కాదు. అంతకు ముందు సిజేరియన్ లో పొత్తికడుపు మీద, గర్భాశయానికి కోత ఏ వైపు పడిందో అంటే అడ్డంగానా, నిలువుగానా అనేది చూసి ఈ సారి ఎలా సిజేరియన్ చేయాలో కూడా నిర్ణయం తీసుకుంటారు. నిలువుకోత పడి ఉంటే మాత్రం సాధారణ ప్రసవానికి మొగ్గు చూపటం మంచిది కాదు. అది తల్లీబిడ్డలకిద్దరికీ ప్రమాదకరం. కోత పొత్తికడుపుకు కాస్త దిగువ భాగంలో అడ్డంగా ఉంటే మిగిలిన రిస్క్ గురించి ఆలోచించి డాక్టర్ కూడా సహజ ప్రసవాన్ని సమర్థించే వీలుంది. అలా సాధారణ ప్రసవానికి సిద్ధమైనప్పుడు ఇంతకుముందు కుట్లు పడిన చోట విచ్చుకునే ప్రమాదం తక్కువే అయినా, ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా ఆస్పత్రిలో తగిన ఏర్పాట్లు ఉన్నాయని నిర్థారించుకోవాలి. అలాగే భవిష్యత్తులో పిల్లల్ని కనటంలో ఇబ్బందులు తక్కువగా ఉంతాయని నిర్ధారణకు వస్తేనేసహజ ప్రసవం వైపు మొగ్గుచూపాలి. ఏదేమైనా డాక్టర్ సలహా ప్రకారమే నడుచుకోవటం చాలా అవసరం.
డాక్టర్లు ఏంచెబుతున్నారు?
ఇప్పటికీ ప్రసవం అంటే పునర్జన్మే. కాకపోతే, సిజేరియన్ అందుబాటులోకి వచ్చిన తరువాత రిస్క్ బాగా తగ్గింది. కానీ, సిజేరియన్ అవసరాన్ని కచ్చితంగా అంచనా వేయగలిగితే, సహజ ప్రసవానికే ప్రాధాన్యం ఇవ్వటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఒక సారి సిజేరియన్ జరిగిన తరువాత కాన్పు సహజ ప్రసవం జరుగుతుందా అనేది చాలామందిలో కలిగే అనుమానం. అయితే అందులో కొంత రిస్క్ ఉండటం వలన అన్ని అంశాలనూ బేరీజు వేసుకొని డాక్టర్ల సలహామేరకు నడుచుకుంటే రెండోవిడత సహజ ప్రసవం సాధ్యమే.