నేను ఇప్పుడు 8వ నెల గర్భంతో ఉన్నాను. అయితే నా కడుపులో ఉన్న బేబి బ్రీచ్ పొజిషన్ లో ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. నాకు సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఇద్దరు పిల్లలు నార్మల్ గానే పుట్టారు. మరి ఈ బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందా? అసలేందుకిలా అయింది ? ఇప్పుడు నేనేం చేయాలి?
జవాబు:
సాధారణంగా రెండు సార్లు డెలివరీ అయిన తరువాత వచ్చే గర్భంలో బేబీ బ్రీచ్ పొజిషన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎనిమిదవనెలలో బేబీ బ్రీచ్ పొజిషన్ లో కానీ ఇంకా వేరే వేరే పొజిషన్లలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. తొమ్మిది నెలలు నిండిన తరువాతనే బేబీ పొజిషన్ ఎలా ఉందో చూసుకోవడం ముఖ్యం. తొమ్మిదవ నెలలో కూడా బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉంటే బేబీ బరువుని బట్టి బేబీ పొజిషన్ ని బట్టి నార్మల్ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. డెలివరీ సమయంలో బేబీ బరువు నాలుగు కిలోల కంటే ఎక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. మీ విషయంలో ఇంకా బేబీ సరియైన పొజిషన్ కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తొమ్మిదవనెలలో డాక్టర్ ని కలిసినపుడు వారు ఈ విషయం గురించి ఆలోచించి సరైన నిర్ణయానికి వస్తారు.