మూత్ర పిండాలు.. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే రక్తాన్ని శుద్ధి చేసే కిడ్నీల ఆరోగ్యాన్ని కూడా మనం సంరక్షించుకోవాలి. ఐతే కిడ్నీలను రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది.
World Kidney Day
సమతుల పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే కిడ్నీలపై ఎక్కువగా భారం పడదు. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ లు, అధికంగా చక్కెర కలిగిన పదార్థాల జోలికి వెళ్లవద్దు. ఉప్పు అధికంగా తీసుకుంటే మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉప్పు చాలా రకాలుగా శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మూత్రంలో ప్రొటీన్ శాతాన్ని పెంచుతుంది. దీని వల్ల మూత్ర పిండాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడి.. విపరీతమైన నొప్పి పుడుతుంది. అశ్రద్ధ చేస్తే మూత్ర పిండాలు పూర్తిగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంది.
కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీరైనా తీసుకోవాలి. వేడి వాతావరణం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా నీరు తాగాలి. అనారోగ్యానికి వాడే కొన్ని మందులు కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ డ్రగ్స్ ను నొప్పులు తగ్గాలని నిత్యం తీసుకునే వారిలో కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి. అలాగే అల్సర్లకు తీసుకునే మందులు కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తాయి. వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. అలాగే యాంటీ బయాటిక్ మందుల అధిక వాడకం కూడా కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పెన్సిలిన్, సల్ఫోనమైడ్స్ లాంటి యాంటీ బయాటిక్ లు కిడ్నీ సమస్యలకు కారణమవుతాయి.
మూత్ర పిండాల ఆరోగ్యం బాగుండాలంటే మద్యం, పొగ తాగడం మానేయాలి. మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇది కిడ్నీల పని తీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీలు సరిగ్గా పని చేయని పక్షంలో క్రమంగా స్థూలకాయం, కాలేయ సమస్యలు, అధిక రక్తపోటు లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అలాగే పొగ తాగడం వల్ల రక్త నాళాలు నాశనమవుతాయి. దీని వల్ల శరీరానికి మంచి రక్తాన్ని అందించే రక్త నాళాలు లేక కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగి క్రమంగా అవి కూడా చెడిపోయే ప్రమాదం ఉంది.