పొగాకు.. ఇది ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి అనర్ధమే. సిగరెట్, బీడీ, గుట్కా, తంబాకు, నశ్యం. ఇలా చాలా రకాలుగా లభించే పొగాకు ఉత్పత్తులు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. పొగాకు క్యాన్సర్ కారకం అని రాసి ఉన్నా పట్టించుకోకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారు.
పొగాకు తింటే మంచిదనేది అపోహా
పొగాకు సిగరెట్ రూపంలో తీసుకునే కంటే తినడం వల్ల కొంత వరకు మంచిదనే అపోహా చాలా మందిలో ఉంది. కానీ పొగ తాగినా, పొగాకు తిన్నా వచ్చే అనారోగ్య సమస్యల్లో ఏ మార్పు లేదు. పొగ తాగిన వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఐతే తినే వారికి మాత్రం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఇది తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఏ మార్పు లేదు. కాబట్టి పొగాకు ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదం పొంచి ఉన్నట్లే లెక్క. అంటే పొగాకు. పొగ రాకుండా మనిషి జీవితానికి పొగ పెట్టే పొగాకు ఉత్పత్తులు చాలా రకాలే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని నోట్లో పెదవి అంచున ఉంచుకుని ఆస్వాదిస్తారు చాలా మంది.
పొగాకుతో వచ్చే దీర్ఘకాలిక సమస్యలు
పొగాకు నుంచి కొద్ది కొద్దిగా విడుదలైన నికోటిన్ శరీరంలోకి మత్తు ఎక్కిస్తుంది. దీంతో నరాలు జివ్వుమంటాయి. ఏదో కొత్త ఉత్సాహం వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నరాలు ఉత్తేజితమవడంతో ఏపనైనా సులువుగా చేసేస్తామనే భావన కలుగుతుంది. కానీ ఒకసారి మత్తు దిగిపోయిన తర్వాత మళ్లీ అవే నరాలు నికోటిన్ కోసం తహతహలాడుతాయి. దీంతో పొగాకు ఉత్పత్తుల కోసం చాలా మంది వ్యసనపరులుగా మారిపోతారు. క్రమంగా వ్యసనంగా మారడంతో అవి లేనిదే నిద్ర కూడా పట్టని పరిస్థితి నెలకొంటుంది.
ఇలా బయటపడొచ్చు
పొగాకు సేవించడం, తినడం అనేది ఓ వ్యసనం. దీని బారిన పడ్డ వారు అందులో నుంచి బయటపడేందుకు సమయం పడుతుంది. పొగాకు ఉత్పత్తులకు పూర్తిగా బానిసైన వారిని మామూలు మనుషులుగా తీర్చిదిద్దాలంటే కుటుంబ సభ్యుల సహకారం, తోడ్పాటు కూడా చాలా అవసరం. కాబట్టి అలాంటి వారికి కుటుంబ సభ్యులు కూడా తమ వంతు బాధ్యతను నెరవేర్చి వారి ఆరోగ్యానికి తగిన సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.