ఆల్కహాల్, సిగరెట్లు, మాదకద్రవ్యాలు ఇవి వదిలించుకోలేని వ్యసనాలుగా మారితే అడిక్షన్ అంటాం. అయితే ఇలాంటి చెడు అలవాట్ల విషయంలోనే కాదు, కొన్ని మంచి విషయాలకు కూడా అడిక్షన్ అనే మాటను వాడతాం. వాటిలో ఒకటి పని.
ఎప్పుడూ పని చేస్తూ ఉండటమూ సమస్యే!
అవును కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అలాంటివారికి వర్కు అడిక్షన్ ఉందని అంటారు. అలాగే వారిని వర్కు హాలికులు అని కూడా అంటారు. అంటే ఆల్కహాలికులు లాగా అన్నమాట. అయితే ఎప్పుడూ పని చేస్తూ ఉండటం మంచిదే కదా, దీని గురించి బాధేముంది అంటారా. ఉంది, వర్కు అడిక్షన్ వలన కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.
ఆనందం సంతృప్తి అంతగా లేకపోయినా
ఎక్కువగా పనిచేయటాన్నిలోకం పాజిటివ్ గానే చూస్తుంది కనుక దీనిని మానసిక సమస్యగానూ పరిగణించడం లేదు. అయినా సరే, వర్కు అడిక్షన్ వలన సమస్యలున్నాయంటున్నారు మానసిక నిపుణులు.
ఇతర వ్యసనాలు ఉన్నవారికి కుటుంబంతో సన్నిహితులతో ఉన్న అనుబంధాలు ఎలాగై తే దెబ్బతింటాయో వర్కు హాలికులకు కూడా కుటుంబ మానవ సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు ఏర్పడవచ్చు.
పనిపట్ల ఇష్టంతో, సంతృప్తితో ఆగకుండా పనిచేయాలనిస్తే అది కొంతవరకు నయమే కానీ వర్కు అడిక్షన్ ఉన్నవారు మాత్రం పనిలో ఆనందం సంతృప్తి అంతగా లేకపోయినా, పనిచేయకుండా ఉండలేని స్థితిలో ఉంటారని నిపుణులు అంటున్నారు.
ఆందోళన, నిస్సహాయతలను తగ్గించుకోవడానికి
అడిక్షన్‌తో పనిచేసేవారు ఎక్కువగా పనిచేస్తున్నట్టే ఉన్నా వారిలోని ఉత్పాదక స్థాయి అంటే ప్రొడక్టివిటీ పెరగదని నిపుణులు అంటున్నారు. వర్కు హాలికులు ఎంత సేపు పనికోసం సమయం ఎలా మిగుల్చుకుందామా అనే ఆలోచిస్తుంటారు. పని చేయడమే తమ విలువగా భావిస్తుంటారు. అంటే పని ఆపేస్తే తాము ఎందుకూ పనికిరానివాళ్లమనే భావనతో ఉంటారు.
చిన్నతనం నుండి తాము విలువైన వ్యక్తులం అనే భావన లేకుండా పెరగటం వలన ఇలాంటి పరిస్థితి కలుగుతుంది. పని చేయకపోతే తమకు విలువే లేదని భావించడం వలన తమలోని అపరాధ భావనని, డిప్రెషన్ ని, ఆందోళన నిస్సహాయతలను తగ్గించుకోవడానికి కూడా చాలామంది వర్క్ హాలికులుగా మారుతుంటారు.
విత్ డ్రాయల్ లక్షణాలు వేధించవచ్చు
కొంతమంది ఇతరులు చెప్పే పనులు చేయకుండా సలహాలు పాటించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎప్పుడూ ఏదో ఒకపనిలో నిమగ్నమై ఉంటారు. వర్కు ఆడిక్షన్ వలన పని ఒత్తిడి పెరిగిపోతున్నా పట్టించుకోరు.
మరికొందరు జీవితంలో నచ్చని విషయాలనుండి తప్పించుకోవడానికి, నచ్చని భావాల నుండి బయటపడటానికి నిరంతరం పనిచేస్తుంటారు. ఒకవేళ పనిని ఆపాల్సివస్తే ఆల్కహాల్ సిగరెట్ లాంటివి మానేస్తే వచ్చే విత్ డ్రాయల్ లక్షణాలు వీరిని వేధించే అవకాశం ఉంది.
చివరిగా
పనిని ఆపి విశ్రాంతి తీసుకోవటం సాధ్యం కాకపోయినా, అలా చేస్తే మనసులో చాలా అసౌకర్యంగా, అశాంతిగా అనిపిస్తున్నా అది వర్కు అడిక్షన్ కావచ్చు. దీని నుండి తమకు తాముగా బయటపడలేకపోతే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.