పిల్లల్లో ఈ మొండితనం ఒక సంవత్సరం వయసు నుండి నాలుగు సంవత్సరాల వయసులో మొదలవుతుంది. వారానికి ఐదు నుంచి తొమ్మిది సార్లు పిల్లలు ఇలా మొండి చేస్తారు అంటారు నిపుణులు. అయితే పిల్లలు అసలు పలుకకపోయినా ఇబ్బందే, ఎక్కువ హుషారుగా ఉన్నా ఇబ్బందే. పిల్లలు మొండిగా ఉండడం వారి ఎదుగుదలలో భాగమే అయినా, వారిని అదుపు చేయడం మాత్రం కష్టం అవుతుంది.
పిల్లలు మొండిగా ఉన్నారంటే తల్లిదండ్రులకు అదో పెద్ద సమస్యగా మారుతుంది. వారు ఓ పట్టాన మాట వినరు. వారిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలానో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది పిల్లలకు ట్రీట్ మెంట్ కూడా అవసరం అవుతుంది. పిల్లల్లో మొండితనాన్ని గుర్తించడం, వారిని అదుపు చేయడం ఎలానో తెలుసుకుందాం.
పిల్లల్లో మొండితనం మానసిక సమస్యా?
పిల్లలు హుషారుగా ఉంటే సమస్య ఏముందని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు ఇలా హుషారుగా ఉండటంతో పాటు మొండిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తన ఉన్న పిల్లలకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలను తెచ్చిపెడతాయి. వారు ఓ పట్టాన మాట వినరు. ఇలాంటి పిల్లల్లో ఏడిహెచ్ డి సమస్య ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చాలా అల్లరి పిల్లలు లేదా మొండి పిల్లలు అనే పేరు తెచ్చుకుంటారు. ప్రతి పనినీ వారికి ఇష్టమైన రీతిలో చేస్తుంటారు.
తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా వారి మానాన వారు పని చేసుకుంటూపోతారు. ఏదైనా అంటే గట్టిగా ఏడవడం, లేదా అసలు పట్టించుకోకపోవడం లాంటివి చేస్తారు. ఇలాంటి పిల్లలతో ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరికైనా పరిచయం చేయాలన్నా, ఎవరింటికైనా పంపాలన్నా తల్లిదండ్రులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలిది ఓ సమస్య అనే విషయం కూడా చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. ఇందులో మొదటిది జన్యు సంబంధమైన కారణాలు. ఇలాంటి పిల్లల్లో మానసిక సమస్యలకు ఆస్కారం ఉంటుంది. రెండో సమస్య కుటుంబ కారణాలు. అతిగా గారాబం చేయడం లాంటివి కూడా పిల్లల్లో మొండితనాన్ని పెంచేస్తాయి.
పిల్లలు మొండిగా ఎందుకు ప్రవర్తిస్తారు?
మానసిక సమస్యల వల్ల పిల్లలు మొండిగా తయారయితే సమస్యలు ఉండవు. ఓ స్థాయి వరకూ ఈ తరహా పిల్లలు కూడా పెద్దగా ఇబ్బంది కలిగించరు. కొన్ని సమాయాల్లో మాత్రమే ఈ తరహా సమస్యలు ఉంటాయి. దానికి తోడు వైద్యుల దగ్గరకు తీసుకుపోయినా, సమస్య పూర్తిస్థాయిలో తగ్గడం ఉండదు. తల్లిదండ్రుల అజమాయిషీ ఉంటే తప్ప ఈ సమస్యను అధిగమించడం సాధ్యం కాదు. ఇందుకోసం పిల్లల ప్రవర్తన ఎక్కడ ఏ విధంగా ఉందనే విషయాన్ని పరిశీలించారు.
కొందరు పిల్లలు ఇంట్లో మొండిగా ప్రవర్తిస్తే, మరికొందరు బయట ఆ విధంగా ప్రవర్తిస్తారు. వారికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసిందంటే అది కేవలం అల్లరే తప్ప అది మొండితనం అనుకోవడానికి లేదు. ఇంట్లో విపరీతమైన గారాబం చేయడం, లేదంటే విపరీతమైన క్రమశిక్షణలో ఉంచడం లాంటివి పిల్లల్లో ఈ తరహా సమస్యలను ప్రేరేపించడం మొదలు పెడతాయి. అందుకే వారి ప్రవర్తన అన్ని చోట్ల ఒకేలా ఉంటే దాన్ని అగ్గ్రెసివ్ నెస్ లేదా మొండితనంగా భావించాలి.
ఏంటి సమస్య?
అలా గాక ఇంట్లో ఒకలా, పాఠశాలలో ఒకలా, బయటి వారి దగ్గరా మరోలా ఉందంటే అది సాధారణ సమస్యగానే భావించి, వారిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేయాలి. ముందు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో గమనించి, వారి సమస్య ఏమిటనే విషయాన్ని గుర్తించాలి.
పిల్లల సమస్య నిజంగా మొండితనమే అయితే దాని కోసం ఫార్మకో థెరఫి, ప్రవర్తనా చికిత్స, మందులతో చికిత్స, రెండింటి కలిపి అందించే చికిత్సలు ఎన్నో ఉన్నాయి. జన్యుపరమైన సమస్యలు అయితే మాత్రం, వైద్యుని సలహా మేరకు రెంటికి మించి చికిత్సలు తీసుకోవలసి ఉంటుంది. అతిగారాబం లేదా అతి క్రమశిక్షణ వల్ల ఈ సమస్య ఎదురైందంటే మాత్రం కచ్చితంగా పిల్లల్ని అదుపు చేసే బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి.
మరి ఏంచేయాలి?
వారు చేసే ప్రతి మంచి పనిని మెచ్చుకోవాలి. వారు చేసే ప్రతి చెడు పనికి శిక్ష ఉంటుందని వారికి తెలిసేలా చేయాలి. అంటే వారి మీద చేయి చేసుకోవడం లాంటివి చేయకూడదు. వారు ఏదైనా అల్లరి పని చేసినప్పుడు, ఆ పని చేయడం వల్ల ఈ రోజు నీకు టీవీ చూపించడం లేదు అని చెప్పడం, మరేదైనా ఒకదానికి అనుమతి ఇవ్వకపోవడం లాంటివి చేస్తుండాలి.
అదే విధంగా వారు చేసే మంచి పనులకు ప్రోత్సహకాలు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను సులభంగా గ్రహించగలుగుతారు. క్రమంగా అల్లరి చేయడం మానుకుంటారు. ఇలా కాకుండా మొండితనమే గనుక అయితే, వైద్యుని సంప్రదించి, వారు సూచించిన విధంగా చికిత్సను ఇప్పించడం మేలు చేస్తుంది.
తల్లిదండ్రులు ఏంచేయాలి?
పిల్లలు మొండితనంగా ఉన్నపుడు తల్లిదండ్రులు వారితో చాలా సానుకూలంగా ప్రవర్తించాలి. దానికి కారణం కొన్నిసార్లు తల్లిదండ్రుల అతిగారాబం అని కూడా గుర్తించాలి. ఎంత నచ్చచెప్పినా పిల్లలు మాట వినకపోతే సంబంధిత నిపుణులను సంప్రదిస్తే కాగ్నిటివ్ బెహేవిరల్ థెరపీ వంటి చికిత్సలను అందించి మెరుగైన పిల్లల్లో జీవనప్రమాలను పెంచుతారు.