సమస్య:
నా భార్యపేరు శారద. మా పెళ్లయి పదేళ్లవుతోంది. తను పిజి వరకు చదువుకుంది. నాతో పాటు తను కూడా జాబ్ చేస్తుందని, కుటుంబానికి అండగా ఉంటుందనే ఆశతోనే నేను ఎలాంటి కట్న కానుకలు ఆశించకుండా ఆమెని పెళ్లి చేసుకున్నాను. కానీ తనకు ఎందుకో జాబ్ చేయటం ఇష్టం లేదు. ఇంటి పని, పిల్లల చదువుతోనే తనకు సరిపోతుందని అంటుంది. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యారు కనీసం ఏదన్నా స్కూల్లో టీచరుగా చేరమని చెబుతున్నా వినటం లేదు. ఆమె జాబ్ విషయంలో ఎందుకంత మొండిగా ఉంటుందో అర్థం కావటం లేదు. గట్టిగా చెబితే గొడవలవుతున్నాయి తప్ప, తనలో మార్పు మాత్రం రావటం లేదు. తన మనసు మార్చే మార్గం చెప్పండి. – మురళి, హైదరాబాదు
సలహా:
ఈ సమయంలో ఆవిడ మనసు మార్చడం గురించి కాదు మీరు ఆలోచించవలసింది. ‘కనీసం టీచర్ ఉద్యోగం అయినా చేయొచ్చు కదా’ అని మీరు అంటున్నారు. ఇక్కడ ఆమె ఇష్టా ఇష్టాలు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది.
ఆవిడ ఎందులో రాణించగలదో, ఆమెకు ఏది ఇష్టమైన పనో, ఆవిడ చదువుకున్న చదువుని బట్టి, తన వ్యక్తిత్వాన్ని బట్టి ఆమెకు ఏది సూటవుతుందో ఒక కెరియర్ కౌన్సిలర్ ద్వారా తెలుసుకుని ఆ పనిలో ఆవిడకు కావాల్సిన సహకారాన్ని అందించడం మీ బాధ్యత.
ఏ కారణంగానైనా ఆవిడ చదువుకున్న చదువులో ఆవిడకు ఇంట్రెస్ట్ లేకపోతేనే ఆవిడ ఉద్యోగ చేయడానికి ఇష్టపడదు. ఆవిడ కమ్యూనికేషన్ లో కానీ, ఆవిడ బాడీ లాంగ్వేజ్ లో కానీ ఆవిడకు నమ్మకం లేకపోవడం వల్లనే ఆవిడ ఏదైనా చేయడానికి వెనకడుగు వేయవచ్చు.
కాబట్టి ఆవిడలో ఉన్న లోపాలను కనిపెట్టి ఆవిడ పర్సనాలిటీని బట్టి ఆమెకు ఏది చేయడం ఇష్టమో ఆ వృత్తిలో ఆవిడను ప్రోత్సహిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఒకరు వంటలు బాగా చేయగలుగుతారు, ఒకరికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం ఉంటుంది ఇంకొకరు బాగా మాట్లాడగలుగుతారు.
ఇలా వారి వారి అభిరుచులను బట్టి వారిని ప్రోత్సహిస్తే వారు ఆ వృత్తిలో రాణించగలుగుతారు. ఈ రోజుల్లో ఏ రంగంలోనైనా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏ వృత్తిలో నైనా ఉన్నత స్థానాలను చేరుకోవచ్చు. ‘నువ్వు బాగా చదువుకున్నావు కానీ ఏమి చేయలేకపోతున్నావు’ అంటూ ఆమెని ఊరికే మాటలు అనటం ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు.
ఈ విషయంలో మీరు కెరీర్ కౌన్సెలర్ ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.