ఇన్సులిన్ లా పనిచేసే ఎఫ్ జిఎఫ్ 1 (FGF1)

ఇన్సులిన్ ఒక్కటే రక్తంలో చెక్కరని నియంత్రిస్తుందని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చాం. అయితే ఇన్సులిన్ లాగే రక్తంలో చెక్కరని నియంత్రించే హార్మోను మరొకటి మన శరీరంలో ఉందని, ఇది కాస్త భిన్నంగా పనిచేస్తుందని ఇప్పుడు కనుగొన్నారు. భవిష్యత్తులో మధుమేహ చికిత్సని ఈ అంశం ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలుభావిస్తున్నారు.

రక్తంలో చెక్కర స్థాయి తగ్గటం శాస్త్రవేత్తలు గమనించారు

ఎఫ్ జిఎఫ్ 1 హార్మోను మన శరీరంలోని కొవ్వు కణజాలంలో ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో చెక్కర స్థాయిని ఇన్సులిన్ లాగానే చాలా వేగంగా తగ్గిస్తుంది. ఇన్సులిన్ తో సంబంధం లేకుండా మరొక విధానంలో ఇది పనిచేస్తుందని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నా, ఒక వేళ ఉత్పత్తి ఉన్నా అది సక్రమంగా పనిచేయకపోవటం వలన మన శరీరంలోని కణజాలం గ్లూకోజ్ ని గ్రహించలేదు. అప్పుడు రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగుతుంది. అలా జరిగినప్పుడు శరీరంలోని రక్తనాళాలు, నరాలపై ప్రభావంపడి గుండె, మూత్రపిండాల వ్యాధులు, స్ట్రోక్, కంటిచూపు సమస్యలు, నరాలకు శాశ్వత హాని వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే ఎఫ్ జి ఎఫ్ 1 అనే హార్మోను కొవ్వుకణాలు విచ్ఛిన్నం కాకుండా అణచివేస్తుంది. దాంతో వాటినుండి గ్లూకోజుని తయారుచేసే లివర్ సామర్ధ్యం తగ్గుతుంది. ఇన్సులిన్ కూడా ఇదే పని చేస్తుంది కానీ.. ఎఫ్ జి ఎఫ్ 1 పనిచేసే విధానం వేరుగా ఉంది. ఇన్సులిన్ పనిచేయని ఎలుకలకు ఎఫ్ జి ఎఫ్ 1 ని ఇంజక్షన్ ద్వారా ఇచ్చినప్పుడు వాటి రక్తంలో చెక్కర స్థాయి తగ్గటం శాస్త్రవేత్తలు గమనించారు.

ఎఫ్ జి ఎఫ్ 1 కొంతమంది విషయంలోనే ప్రభావ వంతంగా పనిచేస్తుంది

ఇంతకుముందు నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు ఎఫ్ జి ఎఫ్ 1 పనితీరుని కొంతవరకు తెలుసుకున్నారు. ఎలుకలపై దీనిని ప్రయోగించినప్పుడు రక్తంలో చెక్కర శాతం తగ్గటం గుర్తించారు. దీనిని క్రమబద్ధంగా దీర్ఘకాలం ఇవ్వటం వలన ఇన్సులిన్ సవ్యంగా పనిచేయకపోవటం అనే సమస్య తగ్గటం కనిపించింది. ఇన్సులిన్ పనిచేయకపోవటం అనే సమస్య ఉన్నపుడు… ఇన్సులిన్ కి బదులుగా మరొక మార్గం ద్వారా రక్తంలో చెక్కరని తగ్గించే అవకాశం ఉంటుందని…ఎఫ్ జి ఎఫ్ 1 ద్వారా రక్తంలో చెక్కరని అదుపులో ఉంచవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొవ్వు విచ్ఛిన్నం వలన పెరిగే చెక్కర స్థాయిని తగ్గించడం వలన ఈ ఫలితం పొందవచ్చు.

అయితే ఇన్సులిన్ పనిచేయని సమస్య ఉన్నవారిలో ఎఫ్ జి ఎఫ్ 1 పనిచేయని సమస్య కూడా ఉంటుందా అనే సందేహం కొంతమంది శాస్త్రవేత్తలకు ఉంది. ఎఫ్ జి ఎఫ్ 1 కొంతమంది విషయంలోనే ప్రభావ వంతంగా పనిచేస్తుందని, మధుమేహం ఉన్నవారిలో జీవ క్రియలు భిన్నంగా ఉండటమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇన్సులిన్ లాగే ఎఫ్ జి ఎఫ్ 1 కూడా మనం తిన్న ఆహారంలోని కొవ్వు విచ్ఛిన్నం కాకుండా ఆపుతుంది. తద్వారా రక్తంలోని చెక్కర శాతాన్ని నియంత్రణలో ఉంచేందుకు దోహదం చేస్తుంది. అయితే ఇందుకోసం ఇన్సులిన్ ఒకరకమైన ఎంజైముని వినియోగించుకుంటే ఎఫ్ జి ఎఫ్ 1 మరొక రకమైన ఎంజైముని వినియోగించుకుంటుంది.

ఇన్సులిన్ లా పనిచేయటం ఆసక్తికరంగా ఉంది

మన శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అయినా, అది సవ్యంగా పనిచేయకపోయినా దాని తాలూకూ ప్రభావం మధుమేహంగా బయటపడుతుంది. అయితే ఎఫ్ జి ఎఫ్ 1 అనే … కొవ్వు కణాల్లో ఉద్భవించే హార్మోను సైతం కొవ్వు కణజాలం పైన ఇన్సులిన్ లా పనిచేయటం ఆసక్తికరంగా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాల్సి ఉందని వారు చెబుతున్నారు. ఇన్సులిన్ పనితీరుపైన ఎఫ్ జి ఎఫ్ 1 దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఎఫ్ జి ఎఫ్ 1 అనేది వాపు మంటలకు కారణమయ్యే ఇన్ ఫ్లమేటరీ వ్యవస్థపైన, ట్యూమర్ పెరుగుదలపైన, ఇంకా అనేక అవయవ వ్యవస్థలపైన ప్రభావం చూపుతుంది కనుక దీని వినియోగం వలన ఏ అవయవాలు ఎలా ప్రభావితం అవుతాయో తెలుసుకోవాల్సి ఉంది.

ఎఫ్ జి ఎఫ్ 1 హార్మోను

ఒక్కసారి మధుమేహానికి గురయితే ఇక జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలని… దానివలన శరీరంలోని అవయవాలకు హాని కలగకుండా రక్షించుకుంటూనే ఉండాలని వైద్యులు పదేపదే హెచ్చరిస్తుంటారు. ఈ నేపథ్యంలో మధుమేహ నియంత్రణకు ఉపయోగపడే పద్ధతులను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు.ఈ విషయంలో ఉపయోగపడే ఏ పరిశోధన అయినా ఆశాభావాన్ని పెంచుతుంది. ప్రస్తుతం గుర్తించిన ఎఫ్ జి ఎఫ్ 1 హార్మోను సైతం అలాంటి ఆశాభావాన్నే కలిగిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top