కొవ్వులో, రక్తంలో కన్పించే మైనంలాంటి పదార్థమే కొలెస్ట్రాల్. దేహానికి ఇది కొంతమేర అవసరమే అయినా, మితిమీరి ఉంటే ఊబకాయం వస్తుంది. దీంతోబాటే గుండెజబ్బులు కూడా వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్య పెద్దవాళ్ళలోనే కాదు, కొంతమందిలో చిన్నవయసులోనే కనబడుతుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్య కావడంతోబాటు జీవనశైలి కారణంగా కొత్తవాళ్లలోనూ పెరిగిపోతోంది. జంక్ ఫుడ్ తింటూ వ్యాయామం జోలికి వెళ్ళని చిన్నపిల్లల్లో కొలెస్ట్రాల్ పెరగటం ఆందోళన కలిగిస్తున్న విషయం.
ఏ కొలెస్ట్రాల్ మంచిది
కొలెస్ట్రాల్ లోనూ మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ అని రెండు రకాలున్నాయి. తక్కువ సాంద్రత ఉండే లైపోప్ర్రొటీన్ ను చెడ్డ కొలెస్ట్రాల్ అంటారు. ఇది ధమనుల గోడలమీద పేరుకుపోయి అవి గట్టిపడేలా చేసి గుండె జబ్బులకు దారితీస్తుంది. రెండోది అధిక సాంద్రత గల లైపోప్రొటీన్. దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఇది అధిక కొలెస్ట్రాల్ ను సేకరించి తిరిగి లివర్ కి అందిస్తుంది. దేహానికి అవసరమైనంత కొలెస్ట్రాల్ మించి ఉంటే సమస్యలు వస్తాయి.
కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది?
పిల్లల్లో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉండటమన్నది ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తుంది. అందువల్ల తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి అధిక కొలెస్ట్రాల్ ఉన్నా పిల్లలకు కూడా ఆ సమస్య ఉండవచ్చు. అదే విధంగా పిల్లలు తీసుకునే ఆహారం కూడా కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం కావచ్చు. అంటే, తల్లిదండ్రులకు అధిక కొలెస్ట్రాల్ లేకపోయినా, పిల్లల ఆహారం వలన కూడా ఈ సమస్య రావచ్చు. నిజానికి ఈ మధ్య కాలంలో ఇలాంటి పిల్లలు పెరిగిపోతున్నారు. జంక్ ఫుడ్ తినటం అందులో ఒక ముఖ్య కారణం. అలాగే ఎలాంటి వ్యాయామమూ చెయ్యకపోవటం వలన చెడు కొలెస్ట్రాల్ నిల్వలు పేరుకుపోతున్నాయి. ఊబకాయం ఉన్న తల్లిదండ్రుల వలన పిల్లల్లోనూ అదే ఊబకాయం రావటం, కొలెస్ట్రాల్ పెరిగిపోతుండటం గమనించవచ్చు.