ప్రతిరోజు సూర్యుడు మనకు ఒక కొత్త ఉదయాన్ని బహుమతిగా ఇస్తుంటాడు. జీవితంలో ఇక నాకు ఏమీ మిగలలేదు..అనుకుని నిరాశపడేవారికి కూడా ఒక విలువైన ఆహ్లాదభరితమైన ఆశావహమైన ఉదయం కానుకగా అందుతుంది. రోజు మొత్తంలో ఉదయానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఉదయం వచ్చే కాంతిలాగే మనలోకి శక్తి, ఉత్సాహం కూడా వచ్చి చేరతాయి. రాత్రంతా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతే…ఉదయం అనేది ఒక తెల్లకాగితంలా కనబడుతుంది. మరి అలాంటి ఉదయానికి…. ఎలాంటి పనులతో… అలవాట్లతో స్వాగతం పలికితే మన రోజు బాగుంటుంది.
మనల్ని మనం సిద్ధం చేసుకునే ఆ సమయం
ఉదయం పూట బయట ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మన మనసుకూడా అలాగే ఉంటుంది. ఒక కొత్త రోజుకి మనల్ని మనం సిద్ధం చేసుకునే ఆ సమయం ఎంతో ముఖ్యమైనదిగా భావించాలి. ఆ సమయాన్ని మనకు అనుకూలంగా వినియోగించుకుంటే…జీవితంలో మంచి మార్పులను తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏ పనికైనా ఒక మంచి ప్రారంభం చాలా అవసరం కదా. రోజుకయినా అంతే. అందుకే ఉదయాన్ని మరింత శక్తిమంతంగా మార్చుకుంటే ఆ ప్రభావం రోజంతా మనమీద ఉంటుంది.
తెల్లవారిందంటే చాలు చాలామందికి ఇక పరుగులు మొదలయినట్టే ఉంటుంది. ఆడవాళ్లయితే మంచం నుండి కాలుకిందపెట్టగానే పనులు మొదలుపెట్టేస్తుంటారు. నిన్న ఏం చేశాము…ఈ రోజు ఏంచేయాలి…లాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. పని పని పని…ఇదే ధ్యాసలో ఉంటారు. ఇక కొంతమందయితే లేవగానే ఫోన్ తీసుకుని మెయిల్స్ ఇన్స్టాగ్రామ్ లు చెక్ చేస్తుంటారు. నిద్రలేవగానే మెదడుని కాసేపయినా ప్రశాంతంగా ఉండనీయకుండా ఆలోచనల్లోకి దింపడమే అది. మరికొందరు అలారం పెట్టుకున్నా అది మోగి మోగి విసుగువచ్చేదాకా లేవరు. అలా చేయటం వలన లోపల ఆందోళన పెరిగిపోతుంది. మంచం పైన నిద్రపోతున్నట్టే ఉన్నా ప్రశాంతంగా ఉండదు.
పొద్దున్నే నిద్రలేవాలంటే బద్దకించేవారికి ఉదయాలు ఉండవు
వారు తప్పనిసరిగా హడావుడిగా పనుల్లోకి దిగిపోవాల్సిందే. వీరికి సూర్యుడు ఆకాశం కనిపించే అవకాశమే లేదు. నోట్లో బ్రష్, వాష్ బేసినే కొత్త రోజుకి ఆహ్వానం పలుకుతుంటాయి. ఉదయాన్నే కాసేపయినా ఈ రోజు ఏం చేయాలి అని ఆలోచించుకోకపోతే ఆఫీస్ కి వెళ్లినా హడావుడిగానే అనిపిస్తుంది. మనసుకి కాస్తయినా స్థిమితంగా ఉండే అవకాశం లేకపోవటం వలన చికాగ్గా ఉంటుంది. నిన్న పనులు ముగించినప్పటి మానసిక స్థితి …తెల్లవారి కూడా కొనసాగటం వలన వలన రిలాక్స్ అయిన భావనే ఉండదు. శరీరానికి ఎలాంటి వ్యాయామం లేకుండా మళ్లీ మరో రోజులోకి వెళ్లిపోవటం వలన…ఉత్సాహం ఉత్తేజం ఏమీ ఉండవు. ఉదయం ఉన్నంత అందంగా మన ఉదయపు రొటీన్ లేకపోతే…ఆ ప్రభావం రోజంతా ఉంటుంది.
నిద్రలేచాక మనసుని శరీరాన్ని పనికి సిద్దం చేయడానికి కొంత సమయం అవసరం. నిన్న ఏం చేశామో అలాగే చేయటం వలన ఈ రోజు కూడా నిన్నలాగే ఉంటుంది. అలా కాకుండా ఈ రోజు ఏం చేయాలి…అనే విషయం మీద దృష్టిపెట్టాలి. అంతకంటే ముందు శరీరంలోని బద్దకాన్ని వదిలించి… శక్తిని ఇచ్చే యోగా వాకింగ్ లాంటివి తప్పకుండా చేయాలి. మంచంమీద పడుకుని టైం అయ్యే వరకు ఫోన్‌తో ఉండటం కంటే వ్యాయామం చేయటం వలన శరీరమే కాదు…మెదడు కూడా చురుగ్గా మారుతుంది. శరీరాన్ని చురుగ్గా ఉంచే వ్యాయామాలే కాదు…కాసేపు స్థిరంగా కూర్చునే వీలున్న ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ప్రార్థన లాంటివి కూడా అవసరమే. ఆ కాసేపు స్థిరత్వంతో మనసు స్థిమితంగా మరో రోజుకి సిద్ధమవుతుంది.
మన గురించి మనం పాజిటివ్ గా ఆలోచించడానికి
వ్యాయామంతో శరీరానికి చురుకుదనం పెరిగితే స్థిరంగా కూర్చోవటం వలన మనసుకి ఏకాగ్రత వస్తుంది. ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను గురించి సావధానంగా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. రోజంతా చేయాల్సిన పనులకు, ఆ రోజంతా ఎలా గడవాలనే ఆలోచనలకు ఒక రూట్ మ్యాప్ ని మనసులోనే తయారు చేసుకోవచ్చు. అంతేకాదు…మన గురించి మనం పాజిటివ్ గా ఆలోచించడానికి, లోపాలుంటే విశ్లేషించుకుని సరిచేసుకోవడానికి కూడా ఇదే మంచి సమయం. అంతేకాదు ఉరుకులు పరుగులతో ఇంట్లోంచి బయటపడకుండా స్థిమితంగా సావధానంగా మరింత ఉత్సాహంతో ఉత్పాదక సామర్ధ్యంతో ముందుకు వెళ్లడానికి అవకాశం కూడా ఉంటుంది.
ఒక కొత్త రోజు మొదలు కాబోతోంది…అంటే ఒక పాత రోజు వీడ్కోలు పలికిందనే కదా. అయితే తెల్లవారి మనం ప్రశాంతంగా నిద్రలేవాలంటే అంతకుముందురోజుని చక్కగా ఆనందంగా ముగించి ఉండాలి. ప్రతిఉదయం కొత్తగా ప్రశాంతంగా మొదలుకావాలంటే….అందుకు తగిన ఏర్పాట్లు, పనులు రాత్రులే ముగించాల్సి ఉంటుంది.
ఒకరోజు ముగిసిందంటే మనం జీవితంలో ఒక పరీక్షని రాసినట్టు …అందులో మనం పాసయ్యామా లేదా అనేది మనకు మనమే తెలుసుకోవాలి. అంటే రోజు ముగిశాక ప్రతిరోజు రాత్రి కాసేపు ఆ రోజు చేసిన పనులపై ఒక సమీక్షని నిర్వహించుకోవటం మంచిది. ఏం చేశాం…. చేయాలనుకున్నవి ఏం చేయలేకపోయాము…అనవసరమైన విషయాలపై సమయాన్ని వృథా చేశామా…ఈ రోజుని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నామా లేదా…లాంటి ప్రశ్నలకు మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. ఆ రోజు మనస్ఫూర్తిగా అనుకున్నది చేయిగలిగామనుకుంటేనే తెల్లవారి మరో రోజుని ఉత్సాహంగా ప్రారంభించగలం.
అసంతృప్తితో అపరాధ భావంతో నిద్రపోతే
అలాకాకుండా పగలంతా పని చేసినా అసంతృప్తితో అపరాధ భావంతో నిద్రపోతే తరువాత రోజు ఉదయం కూడా అది కొనసాగుతుంది. రాత్రులు మనల్ని మనం సమీక్షించుకునేటప్పుడు మన పట్ల మనం నిజాయితీగా ఉండాలి. జీవితంలో మనకు ఏది ముఖ్యమని అనుకుంటున్నామో దానివైపు మన ప్రయాణం సాగుతుందో లేదో సరిచూసుకోవాలి. ఇక ఉదయాన్నే నిద్రలేచి పనులు చేయాల్సి ఉన్న మహిళలయితే…రాత్రే కొంతపని ముగించుకుని నిద్రపోతే…తరువాత ఉదయం తమకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకోవచ్చు. ఒక రోజుని మనస్ఫూర్తిగా ముగించినప్పుడే మరో రోజుకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలకగలమని గుర్తుంచుకోవాలి.
ఒక్కరోజు ఒక్క గంట ఒక్క నిముషం ఒక్క క్షణం…ఒక్కటే కదా…అని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆ ఒక్క అనే పదంలోనే మన జీవితం ఉంది. అందుకే ప్రతిరోజుని పదిలంగా జీవితంలోకి కలుపుకోవాల్సిందే. ప్రతిరోజు మరింత శక్తిమంతంగా ఇంకాస్త ఎక్కువ పనిచేసేలా మనల్ని మనం సిద్దం చేసుకోవాల్సిందే. ప్రతి ఉదయాన్ని నింపాదిగా ఉత్సాహంగా మొదలుపెడితే…ఆ రోజంతా మనచేతిలోనే ఉంటుంది…రోజు మన చేతుల్లో ఉంటేనే జీవితమూ మన చేతుల్లో ఉంటుంది మరి. అంతరంగంలో ఇప్పుడో చిన్న విరామం తీసుకుందాం.