గర్భం ధరించి ప్రసవానికి దగ్గరయ్యేకొద్దీ రక్తపోటు పెరగటం కొంత వరకు సహజమే. కానీ అది మితిమీరినప్పుడే అనేక ఇతర సమస్యలకూ దారితీసే ప్రమాదముంది. పెరుగుతున్న బిడ్డకు రక్తం, పోషకాలు సరిగ్గా అందకపోవటం వలన ఎదుగుదల సక్రమంగా లేకపోవటం లాంటి సమస్యలు తలెత్తవచ్చు. తక్కువ బరువుతో పుట్టటం, నెలలు నిండకముందే పుట్టటం లాంటివీ జరగవచ్చు. అందుకే, గర్భందాల్చినప్పటి నుంచి రక్తపోటును చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
గర్భిణీలలో అధిక రక్తపోటు
గర్భిణీలలో రక్తపోటు చాలా సమస్యలకు దారితీస్తుంది. అది రకరకాలుగా ఉండవచ్చు. అందువలన గర్భిణీలకు రక్తపోటు సమస్య ఎందుకు వస్తుందో, ఏ రకమైన రక్తపోటుకు ఎలాంటి చికిత్స అవసరమో తెలుసుకోవటం చాలా ముఖ్యం. మరి గర్భిణి తనకు ఈ సమస్య ఉన్నట్టు తనకుతానుగా గుర్తుపట్టటం ఎలా?
గర్భిణీల రక్తపోటు విషయంలో అప్రమత్తత అవసరం
గర్భిణీలలో రక్తపోటు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అంతమాత్రాన నిర్లక్ష్యం చేయటం కూడా మంచిది కాదు. గర్భిణి తన గురించి, తన బిడ్డ గురించి జాగ్రత్తపడే క్రమంలో రక్తపోటు స్థాయిని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. ఒక్కోసారి గర్భం ధరించటానికి ముందే అధిక రక్తపోటు ఉండవచ్చు. కొన్నిసార్లు గర్భం ధరించిన తరువాత రావచ్చు.
సాధారణంగా ఇలాంటి రక్తపోటు గర్భందాల్చిన 20 వారాలకు వస్తుంది. అయితే ఆరంభంలో లక్షణాలేవీ కనపడకపోవచ్చు కాని సకాలంలో గుర్తించటమన్నది చాలా ముఖ్యం. గర్భిణిలో రక్తపోటు వలన శిశువుకు ఆక్సిజన్, పోషకాలు సరిగా అందవు.
ఫలితంగా…
- ఎదుగదల నిలిచిపోవటం
- తక్కువ బరువుతో పుట్టటం
- నెలలు నిండకుండానే పుట్టటం
లాంటివి జరిగే అవకాశం ఉంది. అలా ముందే పుట్టటం శ్వాస సమస్యలకు, ఇన్ఫెక్షన్లకూ దారితీయవచ్చు.
తీవ్రమైన రక్తస్రావంతో రెండు ప్రాణాలకూ ముప్పు వాటిల్లవచ్చు. సకాలంలో చికిత్స చేయకపోతే మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం లాంటి దేహభాగాలకు సమస్యలు తలెత్తవచ్చు. రక్తపోటు 120 – 129 దాటకుండా ఉండాలి. కనిష్టం 80 ఉండవచ్చు. అదే 130 -139 మధ్య ఉంటే పెరుగుదల మొదటి దశలో ఉన్నట్టు లెక్క. అప్పుడు కనిష్టం 80-89 మధ్య ఉంటుంది. 140 దాటితే అది రెండో దశలోకి వెళ్ళినట్టు లెక్క.
గర్భం దాల్చిన 20 వారాల తరువాత ప్రతి నాలుగు గంటల వ్యవధిలో రెండు మూడు సార్లు 140 దాటి నమోదైతే ఖచ్చితంగా దాన్ని తీవ్రంగానే లెక్కిస్తారు.
గర్భిణీలలో రక్తపోటు ఎలా లెక్కిస్తారు? ఏది ప్రమాదకరం?
అయితే గర్భం ధరించిన తరువాత వచ్చే అధిక రక్తపోటును అడ్డుకోవటం సాధ్యమా అన్నది ముందుగా అందరికీ వచ్చే అనుమానం. ఒక నిర్దిష్టమైన విధానమంటూ లేకపోయినా గర్భిణి తననూ, తన బిడ్డనూ ఆరోగ్యంగా ఉంచుకోవటానికి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోదగిన చర్యలు లేకపోలేదు. మొదటి నుంచీ రక్తపోటును గమనిస్తూ, దేహంలో మార్పులు గమనిస్తూ డాక్టర్ తగిన సలహాలు ఇవ్వవచ్చు.
రక్తంలో ప్రొటీన్ ను బట్టి రక్తపోటు స్థాయి ఎలా పెరుగుతున్నదీ గుర్తించవచ్చు. తగిన విటమిన్లు తీసుకోవటం ద్వారా తల్లీబిడ్డా పోషకాలు అందుకుంటారు. అధ్యయనాలను బట్టి తెలుస్తున్నదేంటంటే
ఎలాగూ వీటి వలన జన్మతః వచ్చే లోపాలు కూడా తగ్గుతాయి. ఉప్పు వాడకం తగ్గించాల్సిన అవసరం ఉన్నా, వ్యాయామం అవసరం ఉన్నా అది ఏ మేరకు అన్నది డాక్టర్ చెబుతారు.
మద్యం, ధూమపానం మానేయటం మంచిది. సాధారణంగా వచ్చే ఇంకో అనుమానం ఏంటంటే గర్భిణీలు ఈ రక్తపోటుకు మందులు వాడవచ్చునా అని. అయితే గర్భవతులు కూడా వాడదగిన కొన్ని సురక్షితమైన మందులు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణీలలో వచ్చే రక్తపోటుకు సరైన సమయంలో చికిత్స చేయకపోతే గుండెపోటు లాంటి సమస్యలకూ అది దారితీయవచ్చు. ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు గర్భ ధారణకు ముందే బరువు తగ్గాలని డాక్టర్లు సూచించవచ్చు.
గర్భిణీల రక్తపోటుకు ఎలాంటి చికిత్స సూచిస్తారు?
గర్భందాల్చినప్పటి నుంచి డాక్టర్ ను కలవటం వలన బరువును, రక్తపోటును క్రమం తప్పకుండా లెక్కిస్తారు. అదే విధంగా తరచూ రక్తపరీక్షలు, మూత్రపరీక్షలూ చేస్తారు. వీటి ద్వారా శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా తెలుస్తుంది. అలాగే తరచూ అల్ట్రా సౌండ్ పరీక్షలు చేయటం ద్వారా శిశువు ఎదుగుదల గురించి సమాచారం అందుతుంది. శిశువు గుండె కొట్టుకునే వేగాన్ని, శిశువు కదలికలనూ పరిశీలిస్తారు. అందువలన గర్భధారణ మొదలుకొని ప్రసవం వరకు డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం, చెప్పిన మందులు తగిన మోతాదులో వాడటం వలన మెరుగైన ఫలితాలనిస్తింది.
- చురుగ్గా ఉండటం
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం
అవసరమైతే న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవటం చాలా సమస్యలకు పరిష్కారం. పొగతాగకపోవటం, మద్యం సేవించకపోవటం, మాదకద్రవ్యాలు వాడకపోవటం చాలా ముఖ్యం. ఏవైనా మందులు నేరుగా కౌంటర్ లో కొని వాడటానికి ముందే డాక్టర్ ను సంప్రదించటం మంచిది. ఈ రక్తపోటు మరీ ముదరకుండా ఎలా జాగ్రత్తపడాలి అనే విషయంలో పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రసవ సమయంలో కూడా డాక్టర్లు ఈ రక్తపోటును బట్టే తగిన నిర్ణయం తీసుకుంటారు. రక్తపోటు కారణంగా శరీర అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు, శిశువుకు ఏవైనా సమస్యలు తలెత్తితే తగినవిధంగా మందులు ఇచ్చి ప్రసవం పూర్తయ్యేట్టు చేస్తారు.
గర్భిణీలు రక్తపోటు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మామూలు రక్తపోటు కంటే గర్భిణీల రక్తపోటు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. మరీ ముఖ్యంగా 20 వారాలు దాటిన తరువాత రక్తపోటులో మార్పు మితిమీరి ఉంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరుపాటుగా ఉంటే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారవచ్చు.
చివరిగా
క్రమం తప్పకుండా డాక్టర్ ను సంప్రదించటం, అవసరమైన పరీక్షలు చేయించుకోవటం ద్వారా మాత్రమే పరిస్థితిని చేజారకుండా చూసుకోవచ్చు.