ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చిన వారు, మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన వారి నుంచి కరోనా పాజిటివ్ కేసులు దేశంలో అందరిని కలవరానికి గురి చేశాయి. తాజాగా నిర్మల్ జిల్లాలో వెలుగు చూసిన కొత్త కరోనా కేసులతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి మాత్రమే కాదు యూపీలోని ‘దారుల్ ఉలూమ్ డియోబంద్’ దర్గాకు వెళ్లి వచ్చిన వారికి కూడా కరోనా సోకినట్టు వెల్లడైంది.
జిల్లాలో నమోదైన ఒకరికి పాజిటివ్ రావడంతో దీనిపై ఆరా తీయగా ఇది వెలుగు చూసింది. దీంతో అక్కడికి ఎవరెవరూ వెళ్లారు. ఎవరిని కలిశారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మరో కొత్త ప్రాంతం నుంచి కూడా వైరస్ వ్యాపించిందని తెలిసి జనం వణికిపోతున్నారు.
జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల మర్కజ్‌తో పాటు డియోబంద్ దర్గాకు కూడా వెళ్లి వచ్చారు. కానీ ఈ విషయాన్ని వారు గోప్యంగా ఉంచారు. దర్గాకు వెళ్లి వచ్చిన విషయం బయటకు పొక్కడంతో అధికారులు పరీక్షించగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో డియో బంద్ నుంచి కూడా ఈ వైరస్ వ్యాపించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంలో కీలక అధికారిగా తెలుస్తోంది. ఆయన ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశాలు, పలువురితో భేటీ నిర్వహించినట్టుగా సమాచారం. వెంటనే అతన్ని ఐసోలేషన్‌కు తరలించి మిగిలిని వారిని క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. మర్కజ్, డియోబంద్‌కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచినందుకు వీరిపై ఐపీసీ సెక్షన్ 269,270,271, సెక్షన్-3 ఎపిడమిక్ యాక్ట్ 1897తో పాటు.. 54 of నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2005 కింద కేసులు నమోదు చేశారు.
Source: outlookindia.com