కడుపు ఉబ్బరం, వికారం, అజీర్తి, పుల్లని తేపులు ఇలాంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి కొంతమందికి. ఈ సమస్యలు ఉన్నపుడు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. ఏ పనిమీదా ఏకాగ్రత ఉండదు. ఏం తినాలన్నా భయమనిపిస్తుంది. ముఖ్యంగా మనకు సరిపడని ఆహారం, ఆరోగ్యకరం కాని ఆహారం తీసుకోవటం వలన ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఇవి ఎందుకు వస్తాయి. వీటిని ఎలా వదిలించుకోవాలి అనే అంశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కడుపుబ్బరానికి రకరకాల కారణాలు ఉంటాయి. చాలా సమయం వరకు పొట్ట ఖాళీగా ఉన్నపుడు ఇలా జరిగే అవకాశం ఉంది. భోజనం చేసిన తరువాత ఎక్కువ గంటలు ఏమీ తినకుండా ఉండటం వలన పొట్టలో ఆమ్లాలు స్రవిస్తాయి. దీనివలన వికారం కలగవచ్చు. ఆమ్లాలు పైకి గొంతులోకి ఎగదన్నుకొచ్చి గొంతు మంటపుడుతుంది. ఆల్కహాల్ తాగేవారిలో సైతం ఈ సమస్య ఏర్పడుతుంది. ఎక్కువగా ఆల్కహాల్ తాగినా, లేదా ఎక్కువ సమయం తాగుతూనే ఉన్నా ఆహారనాళం తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంది. తరువాత రోజు బాధ మరింత ఎక్కువై పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు. అవసరమైన దానికన్నా ఎక్కువగా తిన్నపుడు క్రింది సమస్యలు వస్తాయి.
- పొట్ట ఉబ్బరం
- గ్యాస్
- గొంతులోకి ఆమ్లాలు చేరటం
- ఛాతీలో మంట
వీటిని పరిగణనలోకి తీసుకోవాలి
ఆహారం అధికంగా తీసుకోవటం వలన ఆహారనాళానికి, జీర్ణాశయానికి మధ్యలో ఉండే కవాటం వంటి భాగం… ఎక్కువగా రిలాక్స్ అయిపోయి తెరచుకుంటుంది. దాంతో దాంట్లోంచి యాసిడ్లు పైకి ఎగదన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. టమోటాలు, వెల్లుల్లి, ఉల్లి, పుదీనా, అధిక కొవ్వున్న ఆహారాల వలన ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. అందరికీ ఈ ఆహారాలు పనిచేయవని చెప్పలేము… కానీ కడుపు ఉబ్బరం విషయంలో వీటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు అల్లం చాలా చక్కని వంటింటి ఔషధంగా పనిచేస్తుంది. ఎన్నో వందల ఏళ్లుగా అల్లాన్ని కడుపు ఉబ్బరం తగ్గించేందుకు వాడుతున్నారు. పచ్చి అల్లం ముక్కని నమలటం, అల్లం టీ తాగటం వంటివి ఉపశమనం ఇస్తాయి. అలాగే పిప్పరమెంటు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది పుదీనా జాతికి చెందిన మూలిక.
అన్నం తిన్న తరువాత కానీ, ఇతర సమయాల్లో కానీ కడుపు ఉబ్బరం ఉన్నవారు పిప్పరమెంట్ వేసిన టీని తాగటం వలన ప్రయోజనం ఉంటుంది. అయితే పొట్టలోని ఆమ్లాలు గొంతులోకి వస్తున్న వారు పిప్పరమెంట్ కి దూరంగా ఉండటం మంచిది.
అతి మధురం
అలాగే అతి మధురం… వేరుకి కూడా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే గుణం ఉంది. దీనిని నేరుగా నమలవచ్చు లేదా టీ చేసుకుని తాగవచ్చు. అయితే ఇది నిజమైన అతిమధురం అయి ఉండాలి. గర్భిణులు, అధిక రక్తపోటు ఉన్నవారు అతిమధురాన్ని వాడకూడదు. పాలకు సైతం కడుపు ఉబ్బరాన్ని తగ్గించే శక్తి ఉంది. ఇందులో ఉన్న క్యాల్షియం వలన కూడా ఎసిడిటీ తగ్గుతుంది. చల్లని పాలను తాగటం వలన పొట్టలో యాసిడ్ పెరగకుండా ఉంటుంది. అలాగే పెరిగిన యాసిడ్ ని క్యాల్షియం తగ్గించి వేస్తుంది.
కడుపు ఉబ్బరానికి బేకింగ్ సోడాసైతం చాలా చక్కని ఉపశమనం ఇస్తుంది. పావు టీ స్పూను బేకింగ్ సోడాని తీసుకుని కప్పునీళ్లలో వేసుకుని తాగితే ఫలితం ఉంటుంది.
నీరు ఎక్కువగా త్రాగాలి
కడుపు ఉబ్బరం ఉన్నవారు తాము తీసుకుంటున్న ఆహారాల పట్ల అప్రమత్తతతో ఉండాల్సి ఉంటుంది. తమకు పడని వాటికి దూరంగా ఉండాలి. పాలు కడుపు ఉబ్బరాన్ని తగ్గించినా… వాటిలోని లాక్టోజ్ పడనివారికి అవి అజీర్తిని కలిగించే అవకాశం ఉంది. పాలకు సంబంధించిన ఉత్పత్తులను తీసుకున్నపుడు పొట్టలో ఏదైనా తేడా ఉంటే కొంతకాలం పాటు వాటికి దూరంగా ఉండటం మంచిది. కొంతమందికి పొట్టనిండుగా తిన్నపుడు అజీర్తి చేసే అవకాశం ఉంటుంది. అలాంటివారు తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తినటం మంచిది.
జంక్ ఫుడ్ లు, ప్రాసెస్డ్ ఫుడ్ లను తినటం మంచిది కాదు. ఉప్పు చక్కెరలను తగ్గించుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, నీటిని ఎక్కువగా తాగటం వంటివి కూడా పొట్ట ఉబ్బరం తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
వైద్యులను సంప్రదించడం మంచిది
కడుపు ఉబ్బరం, అసౌకర్యం, గ్యాస్ వంటి సమస్యలకు తాత్కాలిక ఉపశమనాలుగా ఇంటి వైద్యం చిట్కాలు వాడటం మంచిదే కానీ… ఎక్కువకాలం వాటిపై ఆధారపడకూడదు. ఈ సమస్యలతో పాటు వాంతులు అవుతున్నా, హఠాత్తుగా బరువు తగ్గుతున్నా, పొట్టలోని అసౌకర్యాన్ని తగ్గించుకునేందుకు యాంటాసిడ్ మందులను ప్రతిరోజు వాడాల్సి వస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.