షుగర్ వ్యాధికి చికిత్స అనగానే డాక్టర్లు ముందుగా సూచించేది మంచి పోషకాహారం, వ్యాయామం, మెట్ ఫార్మిన్ అనే మందు బిళ్ళ. ఇవి వాడినా కూడా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకపోతే మరో డోసును జోడిస్తారు. అయితే రెండోసారి జోడించే మందుల్లో ఏది మంచిది ? ఏది బాగా పనిచేస్తుంది అనే విషయాలపై శాస్త్రవేత్తలు ఇటీవల ఒక పరిశోధన నిర్వహించారు. మెట్ ఫార్మిన్ తో పాటు సిటాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, గ్లిమిపిరైడ్, ఇన్సులిన్ గ్లార్గైన్ యూ-100 మందులో ఏదో ఒకదాన్ని ఇచ్చి పదేళ్లపాటు పరిశీలించారు. ఈ మందులన్నీ రక్తంలో గ్లూకోజు శాతాన్ని తగ్గిస్తున్నట్టుగా తేల్చారు. మిగతావాటితో పోలిస్తే లిరాగ్లూటైడ్, ఇన్సులిన్ గ్లార్గైన్ యూ-100 ఒకింత ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టుగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పరిశోధన పూర్తయ్యేసరికి నాలుగింట మూడొంతుల మందిలో ఇంకా గ్లూకోజు నిర్ణీత మోతాదుల స్థాయికి చేరకపోవటం గమనార్హం. రక్తంలో గ్లూకోజు, గుండెజబ్బులు, ఇతర అనారోగ్య సమస్యల్లో కూడా మందుల ప్రభావాల్లో చాలా తేడాలు కనిపించాయి. లిరాగ్లూటైడ్, ఇన్సులిన్ గ్లార్గైన్ వాడిన వారిలో గ్లూకోజు మోతాదులో ఎక్కువకాలం నిర్ణీత లక్ష్యాలను చేరుకున్నాయి. కానీ లిరాగ్లూటైడ్ వాడిన వారికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం పెరిగింది. మధుమేహ నియంత్రణలో ఆయా వ్యక్తులకు అనుగుణంగా మందుల వాడకంపై నిర్ణయం తీసుకోవడానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు.