ఇదివరకటి రోజుల్లో పిల్లలనగానే మనకు గుర్తొచ్చేది అల్లరి, చదువు, ఆటలు వగైరాలు. కొన్నాళ్ల క్రితం వరకు టివి కూడా వారిని బాగా ఆకర్షించింది. ఇప్పుడు మాత్రం పిల్లలను విపరీతంగా ఆకట్టుకుంటున్నది సెల్‌ఫోన్. రెండుమూడేళ్ల పిల్లలు సైతం ఫోన్‌తో ఆడుతున్నారు. దాన్ని వాడేస్తున్నారు కూడా. ఇక టీనేజి పిల్లల గురించయితే చెప్పనక్కర్లేదు. వారికి క్లోజ్ ఫ్రెండ్సు ఎంతమంది ఉన్నా అందరికంటే క్లోజ్ ఫ్రెండ్ ఫోనే. దాంతో గంటలకొద్దీ వాళ్లు పోన్‌లో ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో తెలియని అయోమయంలో ఆందోళనలో తల్లిదండ్రులు ఉంటున్నారు.
పిల్లల ప్రపంచం ‘స్మార్ట్ ఫోన్’
పిల్లలు ఫోన్ వాడుతున్నా సురక్షితంగా ఉన్నారన్న భరోసా కోసం తల్లిదండ్రులు తపిస్తుంటారు. అలాంటి భరోసా కావాలంటే పిల్లల ఫోన్ల వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ ఉండాలి. కానీ అది సాధ్యమేనా? పిల్లలకు బాధ కలిగించకుండా వారు ఫోన్‌లో ఏం చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉందా?
సెల్ ఫోన్ చేతుల్లో ఉంటే చాలు… పిల్లలు ప్రపంచాన్ని మర్చిపోతున్నారనేది నేటి తల్లిదండ్రులందరి కంప్లయింటు. కానీ ఎన్ని అనుకున్నా…ఫోన్ అనేది ఇప్పుడు మన జీవితాల్లో తప్పనిసరి. అది ఒక అత్యవసరంగా మారిపోయింది. ముఖ్యంగా టీనేజిలోకి అడుగు పెట్టిన పిల్లలకు తమ స్మార్ట్ ఫోన్‌తో ఉన్న అనుబంధం ఇంతాఅంతా కాదు. అది వారి మానసిక ప్రపంచంలో భాగమై పోయింది.
స్మార్ట్ ఫోన్లో ప్రపంచమంతా ఇమిడి ఉంటున్న కాలమిది..అందుకే ఫోన్ వలన పిల్లలకు ఎలాంటి హాని కలుగుతుందోననే భయం తల్లిదండ్రుల్లో నిరంతరం ఉంటోంది…. ఇలాంటప్పుడు తమ భయాన్ని పిల్లలకు ఎలా చెప్పాలి…ఎలా వారి ఫోన్ వ్యవహారాలను తెలుసుకోవాలి ?
అంత సమయం పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తున్నారు?
ఇప్పుడు చాలామంది పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఒక అత్యంత ఆత్మీయమైనమైన వస్తువు. అది వారికి వ్యసనంగా మారిపోయిందనవచ్చు. గంటల కొద్దీ విసుగు లేకుండా ఫోన్‌తో ఉండగలుగుతున్నారు. ఇలాంటప్పుడే తల్లిదండ్రులకు అనుమానం కలుగుతోంది..అసలు అంత సమయం పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారు అనే ఆందోళన వారిని వెంటాడుతోంది.
పిల్లలు తమ ముందే… నిరంతరం ఫోన్‌లో ఏదో చెక్ చేస్తుంటారు. వారికి మెసేజ్‌లు వస్తుంటాయి …తిరిగి వాళ్లు మెసేజ్‌లు పంపుతుంటారు… ఒకవేళ… ఎవరితో చాట్ చేస్తున్నావ్…అని తల్లిదండ్రులు అడిగినా ఫ్రెండ్‌లే…అనే సమాధానం మాత్రమే వస్తుంది. ఎవరా ఫ్రెండ్…అన్ని మాటలు ఏముంటాయి…అని ఏ టీనేజి అబ్బాయిని లేదా అమ్మాయిని అడిగినా విసుక్కోవడమే…వారి నుండి సమాధానంగా వస్తుంది.
తల్లిదండ్రుల అనుమానం నిజమవుతుందా?
ఇంకాస్త లోతుగా అడిగితే…నా మీద నమ్మకం లేదా…లాంటి పెద్దమాటలు కూడా వినబడతాయి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ఆందోళన మరింతగా పెరుగుతుంది. పిల్లలు తమ ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నా….వారి ఫోన్‌ని ఇతరులు ముట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నా తల్లిదండ్రులకు ఇంకా కంగారుగా ఉంటుంది.
- తమ పిల్లలు తమ నుండి ఏదో దాస్తున్నారనే అనుమానం కలుగుతుంది. వారేదైనా చిక్కుల్లో పడతారేమో అనే భయం వెంటాడుతుంది. కానీ ….ఈ భయాలను చెప్పి పిల్లలనుండి నిజాన్ని రాబట్టటం మాత్రం కష్టమే.
- కాకపోతే…ఒక్కోసారి ఏమీ లేకపోయినా తల్లిదండ్రులు అనవసరంగా గాభరా పడవచ్చు కూడా. ఏదిఏమైనా…పిల్లల ఫోన్ వాడకంపై తల్లిదండ్రులకు ఎంతో కొంత అవగాహన ఉంటే ఇలాంటి సమస్యలు రావు.
పిల్లల్లో మొబైల్ అడిక్షన్ పెరుగుతోందా?
ఇప్పుడు సెల్‌ఫోన్ చేతిలో ఉన్నదంటే అర్థం, ప్రపంచమే మన గుప్పిట్లో ఉందని. అందులో పిల్లలు ఏదైనా చూడవచ్చు. ఎంత దూరంగా ఉన్న మనుషులకయినా దగ్గర కావచ్చు. ఇంట్లోనే ఉంటున్నా…తల్లిదండ్రులకు కూడా తెలియని కొత్త స్నేహాలు పెంచుకోవచ్చు.
ఆ మధ్య పిల్లలను ఆత్మహత్యకు పురికొల్పే ఆటలు ఫోన్లలో వచ్చినప్పుడు అందరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఆ ఆటల్లాంటి ప్రమాదకరమైన మనుషులు సైతం పిల్లలకు దగ్గరయ్యే ప్రమాదం ఫోన్ల ద్వారా ఉంది. ఇలాంటి భయాలు సందేహాలు తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియదు. తమ పిల్లలకు ఎంతవరకు మెచ్యూరిటీ ఉంది.
- ప్రమాదకరమైన స్నేహాలు చేయటం
- అసభ్యకరమైన చిత్రాలు చూడటం లాంటి వాటికి దూరంగా ఉండగలుగుతారా అనవసరంగా ఫొటోలను షేర్ చేసి చిక్కుల్లో పడకుండా ఉంటారా…లాంటి ప్రశ్నలకు…సమాదానం తల్లిదండ్రుల వద్ద ఉండదు.
- టీనేజిలోకి వచ్చేసరికి పిల్లలు తల్లిదండ్రులతో కంటే స్నేహితులతోనే ఎక్కువగా ఉంటుంటారు. పిల్లల పట్ల ఇలాంటి భయాలు చాలామందికి ఉంటాయి.
ఫోన్ విషయం పిల్లల దగ్గర ఎలా ప్రస్తావించాలి?
కొంతమంది బయటపడతారు. కొందరు బయటకు చెప్పుకోరు. అడిగినా పిల్లలు చెప్పరనే ఉద్ధేశ్యంతో చాలామంది ఆ విషయాలు మాట్లాడరు. కొందరు విపరీతమైన అనుమానాన్ని వ్యక్తం చేసి పిల్లలను గట్టిగా నిలదీస్తుంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు.
ఇలాంటపుడు అసలు పిల్లల వద్ద ఈ విషయాలను ఎలా ప్రస్తావించాలి…అనేది పెద్ద ప్రశ్న మార్కుగా మిగిలిపోతుంది. నీ ఫోన్‌ని ఒకసారి ఇవ్వు…అని తీసుకుని చెక్ చేయడం అంతకంటే కష్టం. ఒకవేళ ఒకసారి చేయగలిగినా పిల్లలు రెండవసారి తల్లిదండ్రులకు దొరకకుండా జాగ్రత్త పడతారు. లేదా…నా మీద నమ్మకం లేదా అని నానా గొడవ చేస్తారు.
ఫోన్ వాడకం గురించి పిల్లలను ప్రశ్నించే ముందు…అలా ప్రశ్నించడానికి కారణం అనుమానం కాదని…వారి రక్షణ గురించిన తాపత్రయమేనని పిల్లలకు అర్థమయ్యేలా మరీమరీ చెప్పాలి. అందుకే వారిని అడిగే ప్రశ్నలు కూడా ఆరోపణల్లా కాకుండా…జాగ్రత్తలు చెబుతున్నట్టుగా ఉండాలి.
పిల్లలతో స్నేహంగా మెలగడమే దీనికి పరిష్కారం
అసలు మొదటినుండీ పిల్లలకు తమ భావాలను చెప్పుకునే స్వేచ్ఛని…అన్ని విషయాలు షేర్ చేసుకునేంత సమయాన్ని తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు వారు తల్లిదండ్రులకు తెలియకుండా ఏ పనీ చేయాలని అనుకోరు. విమర్శించడం, తిట్టటం, అనుమానం వ్యక్తం చేయటం ద్వారా పిల్లల మనసులను తల్లిదండ్రులు గెలుచుకోలేరు…వారికి దగ్గర కాలేరు.
పిల్లలు అర్థం చేసుకోగలరు అనుకుంటే తల్లిదండ్రులు తమ భయాలను నేరుగా వారికి చెప్పవచ్చు. ఆ విషయాలపై పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. దీనివలన వారి మనసు తెలియడమే కాకుండా వారిలో ఎంతవరకు ఆయా విషయాలపట్ల అవగాహన పరిణితి ఉన్నాయో తెలుస్తుంది. అప్పుడు ధైర్యంగా ఉండవచ్చు. అంతేకాదు…తల్లిదండ్రుల భయం, తమ పట్ల వారికి ఉన్న ప్రేమ…. పిల్లలకు అర్థమైతే…ఫోన్ వాడకంలో ఎలాంటి చెడు ప్రభావాలకు లోను కాకుండా ఉంటారు.
చివరిగా
ఎన్నిసార్లు చెప్పుకున్నా పాతబడని మాట ఒకటుంది…అది… తల్లిదండ్రులు పిల్లలను స్నేహితుల్లా చూడాలని. తమని అర్థం చేసుకుంటారు..అనే నమ్మకం ఉంటే..పిల్లలు తమ మనసులో మాటని తల్లిదండ్రులకు చెప్పడానికి సంకోచించరు. వారు తల్లిదండ్రులతో ఎంత ఓపెన్‌గా ఉండగలిగితే…అంతగా ఎలాంటి చిక్కుల్లోనూ పడకుండా ఉంటారు.