స్త్రీ పురుషులిద్దరిలో అధిక బరువు సమస్య ఉన్నప్పటికీ, ఎక్కువగా మహిళలే ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పనుల కారణంగా ఇంట్లోనే ఉండి పోవడం, గంటల తరబడి టీవీ చూడడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన పోషకాలు శరీరానికి అందక పోవడం, ఒకే భంగిమలో ఎక్కువ సేపు పని చేయాల్సి రావడం ఇలా ఎన్నో కారణాలు స్త్రీలలో అధిక బరువుకు కారణం అవుతున్నాయి.
ఇలా బరువు పెరిగిన వారిలో అధిక బరువు సమస్యలే కాకుండా, మూత్ర పిండాల వంటి శరీర అంతర్గత అవయవాల సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారికి మూత్ర పిండాల్లో రాళ్ళ సమస్య ఎదురౌతుంది. పురుషులతో పోలిస్తే ఈ సమస్య మహిళల్లో 50 శాతం తక్కువే అయినప్పటికీ, స్థూల కాయం గల మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
కొవ్వు అధికంగా ఉండడం వల్ల ఇన్సులిన్ కు తగిన రీతిలో వీరి శరీరం స్పందిచలేదు. ఫలితంగా మూత్రంలో మార్పులు సంభవించి మూత్ర పిండాల్లో రాళ్ళు ఏర్పడ్డానికి ఆస్కారం ఉంది. అలాగే లివర్ సంబంధ సమస్యలు కూడా అధిక బరువు కారణంగా మొదలౌతాయి. శరీరంలో ఎక్కువగా కొవ్వు పేరుకు పోవడం వల్ల ఆ కణాలు క్రమంగా కాలేయంలోకి చేరడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితిని స్టీటోసిస్ అంటారు. ఇలా పేరుకు పోయి ఆల్కహాల్ ఫాటీ లివర్ డిసీజ్ కు కారణం అవుతుంది. ఆల్కహాల్ తాగే వారిలో కనిపించే ఈ సమస్య, అధికంగా బరువు ఉండే మహిళల్లో ఆల్కహాల్ తాగకపోయినా కనిపిస్తుంది.
అధిక బరువు వల్ల మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ రావడానికి ఆస్కారం ఉంది. అధికంగా బరువు పెరగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ను తీసుకున్నా ప్రయోజనం ఉండదు. డయాబెటిస్ కారణంగా శరీరంలోని మూత్ర పిండాలు, కాలేయంతో పాటు నరాలు కూడా దెబ్బ తిని నొప్పి తెలుసుకునే స్థాయి తగ్గిపోతుంది. అందుకే బరువు ఎక్కువగా ఉన్న మహిళల్లో గుండె సంబంధ సమస్యలు కూడా ఎక్కువే. వీరికి హార్ట్ ఎటాక్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. బరువు పెరగడం, గుండె సమస్యలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది.
బరువు పెరగడం వల్ల అధిక రక్త పోటు కలుగుతుంది. లిపిడ్స్ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ లిపిడ్స్ స్థాయి పెరిగి, హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల స్థాయి తగ్గుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు అధికమౌతాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు పూకుడు పోయి గుండెపోటు అవకాశాలు 50 శాతం వరకూ పెరుగుతాయి. అధిక బరువు ఉన్న స్త్రీలలో హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలే అధికంగా ఉంటాయి.
దీంతో పాటు కార్డియో మయోపతి, గుండె లయ తప్పడం లాంటి సమస్యలు ఎదురౌతాయి. గర్భవతులు అయ్యే సమయంలోనూ అధిక బరువు వల్ల అనేక ఇబ్బందులు ఎదురౌతాయి. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి మీద ప్రబావం చూపుతుంది. అధిక బరువు మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా రక్త పోటు అధికంగా ఉండడానికి ఆస్కారం ఉంది, ఈ సమస్యలన్నింటి వల్ల శస్త్ర చికిత్స ద్వారా పురుడు పోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అధిక బరువు ప్రభావం ఊపిరితిత్తుల మీద కూడా ఎక్కువనే చెప్పాలి. గుండె మీద ఎక్కువ రక్తాన్ని పంప్ చేయాల్సిన బాధ్యత పడినప్పుడు ఆ ప్రభావం ఊపిరితిత్తుల మీద కూడా పడుతుంది. ఇలా జరిగినప్పుడు గొంతులో శ్వాసనాళాలు ముడుచుపోయి స్లీప్ ఆప్నియా లాంటి సమస్యలు ఏర్పడతాయి. అధికంగా బరువు పెరగడం వల్ల క్యాన్సర్ సమస్యలు కూడా ముప్పిరి గొనడానికి ఆస్కారం ఎక్కువే.
శరీరంలో కొవ్వు పెరగడం వల్ల సాధారణ కణాలు వాటితో కలిసి, అదుపు తప్పుతాయి. అది శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. దీని వల్ల రొమ్ము క్యాన్సర్, ఎండో మెట్రియం క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ. అందుకే అధిక బరువు ఉన్న స్త్రీలు ఎవరైనా, ముందు బరువు తగ్గించుకోవడం మీద దృష్టి నిలపాలి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ ఇంట్లో పనులు ఉన్నప్పటికీ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. ఆరు నెలలకు ఓ సారి చెకప్ చేయించుకుంటూ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలన్నింటి నుంచి బయట పడవచ్చు.