దీర్ఘకాలిక శ్వాస సంబంధ రుగ్మతల్లో ఆస్తమాలేదా ఉబ్బసం ఒకటి.ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంది. అయితే, చిన్నపిల్లలు, యుక్త వయసు వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. భారత్లో 5 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లల్లో 5 శాతం నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మరి ప్రపంచాన్ని ఇంతగా కలవరపెడుతున్న ఆస్తమా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? మనమేం చేయాలి?
మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు ఉబ్బస వ్యాధిని సూచిస్తాయి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో ఈ సమస్య బాగా పెరుగుతోంది.
పిల్లల్లో ఉబ్బసం ఎందుకొస్తుంది? ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటాయా?
ఉబ్బసానికి ముఖ్యకారణం ఎలర్జీ. ఈ ఎలర్జీ ఉన్న పిల్లలకు, చెమ్మగా ఉన్న వాతావరణం లోను, గాలిలో దుమ్ము, ధూళి, పుప్పొడి, పీల్చడం వలన,పురుగులు, పక్షుల రెట్టలు వాసన పీల్చినపుడు, పెయింట్స్, సెంట్స్ మొదలగు వాసనలు పీల్చడం వల్లను ఆయాసం వస్తుంది. మరికొంత మందికి పొగ పడదు. కొంతమందికి ఆహారంలో పడని వస్తువులు తిన్నప్పుడు కూడా ఉబ్బసం వస్తుంది. కొంతమంది పిల్లలకు జలుబుచేసినపుడు, వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినపుడు ఉబ్బసం వస్తుంది. ఎలర్జీవలన, గాలిగొట్టాలు కుంచించుకుపోతాయి. ఊపిరితిత్తుల లోనికి గాలి వెళ్ళడం, బయటకు రావడం కష్టం అవుతుంది. అందువలన ఉబ్బసంవస్తుంది.
ఉబ్బసం వచ్చినపుడు లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి?
అమ్మాయిలకు బహిస్టులకు ముందు ఉబ్బస లక్షణాలు ఎక్కువ అవుతాయి. కొంతమంది పిల్లలు, వ్యాయామం ఎక్కువగా చేయడం వలన ఉబ్బసం వస్తుంది. చాలామందికి ఇతర ఎలర్జీ లక్షణాలు ఉంటాయి. తరచు జలుబు చేయడం, తుమ్ములు విపరీతంగా రావడం, ఎలర్జీ లక్షణాలు ఉంటాయి. ఈ జబ్బు వంశ పారంపర్యంగా వస్తుంది. తాతకు, మేనత్తకు ఉబ్బసం ఉన్నా పిల్లలకు రావచ్చును. ఈ మధ్య కాలంలో పిల్లలకు చాలా ఎక్కువగా ఉబ్బసం వస్తున్నట్టు డాక్టర్లు గుర్తించారు. పిల్లలు ఎక్కువ సేపు ఇళ్ళలో నాలుగ్గోడలకే పరిమితం కావటం వలన ధూళిపీల్చటం, వాయు కాలుష్యానికి లోనుకావటం కారణం కావచ్చునంటున్నారు. అదే విధంగా, ఇంట్లో పొగ తాగేవాళ్ళుంటే పరోక్షంగా ఆ పొగ పీల్చటం. వంశపారంపర్యంగా వచ్చే అలెర్జీ కూడా ఉబ్బసం రావటానికి దారితీయవచ్చు. సాధారణంగా ఏడేళ్ళు దాటిన పిల్లల్లో ఉబ్బసం లక్షణాలు కనబడతాయి. అయితే, వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య తగ్గిపోవటం కూడా చాలామందిలో కనబడుతుంది.
తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పిల్లల్లో ఉబ్బసం వ్యాధిని గుర్తించటానికి ప్రధానంగా వైద్యచరిత్ర, లక్షణాలు, భౌతికంగా పరీక్షించటం లాంటివి డాక్టర్లు ఎంచుకునే మార్గాలు. చాలా సందర్భాలలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఉబ్బసం లక్షణాలు కనబడకపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులే లక్షణాలను డాక్టర్ కి వివరించి, పరిస్థితి అర్థమయ్యేట్టు చూడాలి. శ్వాసించటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకోవాలని డాక్టర్ అనుకుంటాడు. కుటుంబంలో ఎవరికైనా ఉబ్బసం, అలెర్జీ, గజ్జి, లేదా ఊపిరితిత్తుల వ్యాధులేమైనా ఉన్నాయేమో డాక్టర్ కి చెప్పాలి. దగ్గు, ఊపిరిపీల్చటంలో ఇబ్బంది, ఛాతీనొప్పి లాంటి లక్షణాలు ఎంత తరచుగా కనబడుతున్నాయో డాక్టర్ కి వివరించాలి.
డాక్టర్లు ఎలా గుర్తిస్తారు?
భౌతికంగా పరీక్షించటం రెండో దశ. పిల్లల గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరితిత్తుల కదలికను, కళ్ళకూ, ముక్కులకూ సోకిన అలెర్జీ లక్షణాలను గమనిస్తారు. ఉబ్బసం లక్షణాలున్నాయేమో అంచనా వేస్తారు. ఆ తరువాత ఛాతీ ఎక్స్ రే తీయించటం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మదింపు చేస్తారు. ఆరేళ్ళు దాటిన పిల్లలైతే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయిస్తారు. దాన్నే స్పైరోమెట్రీ అంటారు. ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న గాలి పరిమాణాన్ని, దాన్ని ఎంతత్వరగా బైటికి వదలగలడన్న దాన్ని లెక్కించటానికి ఈ స్పైరోమెట్రీ పనికొస్తుంది. దీన్ని బట్టి ఉబ్బసం తీవ్రతను తెలుసుకోవటం సాధ్యమవుతుంది. ఉబ్బసం రావటానికి ముఖ్య కారణాన్ని నిర్థారించటానికి మరికొన్ని పరీక్షలు కూడా అవసరం కావచ్చు. అందులో ముఖ్యంగా స్కిన్ అలెర్జీ పరీక్షలు, రక్త పరీక్షలు చేయటంతోబాటు సైనస్ ఇన్ఫెక్షన్, గాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లక్స్ లాంటి వ్యాధులు ఉబ్బసానికి కారణమేమో తేల్చుకోవటానికి పరీక్షలు అవసరమవుతాయి. శ్వాసలో నైట్రిక్ ఆక్సైడ్ పరిమాణాన్ని కొలిచే పరీక్షలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
ఉబ్బసం ఉన్నపుడు పిల్లల్లో ఎలాంటి ఇబ్బందులు కనిపిస్తాయి?
ఉబ్బసం వ్యాధి తరచు జలుబుతో ప్రారంభమవుతుంది. క్రమేపీ ఆయాసం విపరీతంగా వస్తుంది. పిల్లవాడు ఊపిరి తీసుకోవడానికి విపరీతంగా బాధపడుతుంటాడు. ఆయాసంతో రొప్పడం, పక్కలు ఎగరవేయడం జరుగుతుంది. గాలికోసం విపరీతంగా తాపత్రయ పడతారు. ఊపిరి పీలుస్తున్నపుడుగరగర శబ్దాలు వినిపిస్తాయి. కొంతమందికి పెదవులు నీలంగా మారుతాయి. ఛాతిలోగాలి ఎక్కువగా చేరి ఉబ్బుతుంది.గుండె బలహీనంగా కొట్టుకొంటుంది. ఈ ఉబ్బసం వ్యాధి ఉన్న చాలామంది పిల్లలు ప్రతిసారీ మూడు, నాలుగు రోజులపాటు బాధపడతారు. అయితే దాదాపు 20 శాతం కేసులలో ఉబ్బసం వ్యాధి తీవ్రంగా వస్తుంది. పిల్లవాడు చాలా బాధపడుతాడు. తరచు వ్యాధి వస్తుంది. పెద్దవారయ్యాక కూడా ఎటువంటి ఉపశమనమూ ఉండదు.
వైద్యపరమైన చికిత్స ఎలా ఉంటుంది?
అయితే, విటమిన్ డి ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చు.ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు మందులు వాడాలి. ఇవి వాయునాళం కండరాలను వదులు అయ్యేలా చేస్తాయి. ఈ మందులు వేసుకునేందుకు ఇన్హేలర్ పరికరాన్ని వెంటే ఉంచుకోవాలి. ఆస్తమా లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టెరాయిడ్లు వాడాల్సి రావచ్చు. అయితే వాటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే వేసుకోవాలి. ఆస్తమా బాధితులు శారీరక వ్యాయామం చేయొద్దని కొందరు చెబుతుంటారు. కానీ, వైద్యుల సలహాతో వ్యాయామం చేయొచ్చు. మొత్తంగా చూసినప్పుడు ఉబ్బసాన్ని తగ్గించలేకపోయినా, నియంత్రించటానికి అవకాశముంది. వీలైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నించాలి. రోజూ స్కూలుకెళుతూనేఉండాలి. ఆటల లాంటివి కూడా మానకూడదు.
పూర్తిగా నయం అవుతుందా?
చిన్న పిల్లలమీద ఎక్కువగా ప్రభావం చూపుతున్న ఉబ్బసం వ్యాధి విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వయసు పెరిగే కొద్దీ చాలామందిలో వ్యాధి లక్షణాలు మాయమయ్యేఅవకాశాలుఉన్నప్పటికీ దాదాపు 20 శాతం మందికి మాత్రం ఈ సమస్య కొనసాగే ప్రమాదముంది. దీన్ని పూర్తిగా నయం చేయటం సాధ్యంకాకపోయినా ఉపశమనం కలిగేలా చేయటానికి చాలా మార్గాలున్నాయి.