ఏదైనా ఒక సంఘటనను గుర్తుంచుకోగల జ్ఞాపకశక్త్తి సన్నగిల్లితే దాన్ని మతిమరుపు అంటాం. అదే కొంతకాలానికి అల్జీమర్స్ లాంటి పెద్ద సమస్యకు దారితీస్తుంది. మనిషి మెదడే ఎన్నో జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. ఆ మెదడులో ఏర్పడే సమస్యల వల్లే మతిమరుపు తలెత్తుతుంది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోయినా రానురాను తీవ్రమైపోతుంది. అప్పుడు జీవితానికే అర్థం లేదనిపించవచ్చు. దీన్ని కేవలం ఒక మతిమరుపు సమస్యగా మాత్రమే చూడకూడదు. మన భావప్రకటనను, భాషను, ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుంది. అందుకే చిన్న పిల్లల్లో వచ్చే అల్జీమర్స్ వ్యాధికి కారణాలు, దాన్ని గుర్తించటం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆ ఛాయలు
సాధారణ పరిభాషలో మనం వాడే మతిమరుపునే డిమెన్షియా అంటారు. సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి. డిమెన్షియా రూపాల్లో అందరికీ బాగా తెలిసిన రూపమే అల్జీమర్స్. చిన్నపిల్లల్లో మానసిక సామర్థ్యం తక్కువగా ఉంటే పెద్దయ్యాక డిమెన్షియా రావటం ఖాయమని తాజా పరిశోధనలు తేల్చాయి. మామూలుగా 64 ఏళ్ళు పైబడిన తరువాతనే ఈ లక్షణాలు కనబడటం సహజమే అయినా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆ ఛాయలు గుర్తించవచ్చునన్నది ఆ పరిశోధనల సారాంశం.
మతిమరుపు అనేది నాడీ సంబంధిత వ్యాధి. 60 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్య రెండు శాతం ఉంటే, 80 ఏళ్లు దాటేనాటికి 50 శాతానికి చేరుకుంటుంది. అయితే, చాలా అరుదుగానే అయినప్పటికీ చిన్నపిల్లల్లోనూ ఈ లక్షణాలు కనబడుతున్నాయని ఈ మధ్య కాలంలో తేలింది. ఇది మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. దీనివలన వాళ్ళ ప్రవర్తనలోనూ బాగా మార్పు కనబడుతుంది. మతిమరుపు రావడానికి శారీరక, మానసిక కారణాలతోబాటు సాంస్కృతిక, సామాజికపరమైన కారణాలూ ఉంటాయి. దీనికి దారితీసే వ్యాధుల్లో వాస్కులర్ వ్యాధులు, ఆల్జీమర్ ప్రధానమైనవి. అల్జీమర్ వ్యాధి పురుషుల్లో ఎక్కువైతే, వాస్కులర్ డిమెన్షియాకు గురయ్యేవారు మహిళల్లో ఎక్కువ మంది ఉంటున్నారు.
మతిమరుపు రావడానికి కారణాలు ఇవే!
మెదడు కణాలమీద ఒక అసహజమైన ప్రొటీన్ కమ్మేయడం, కాలక్రమంలో మెదడు కణాల మధ్య ఉండే రసాయన బంధం తెగిపోవడం, కొన్ని మెదడు కణాలు చనిపోవడం వల్ల ఈ మతిమరుపు తలెత్తుతుంది.
- కొన్ని జన్యుపరమైన జబ్బులు
- డౌన్ సిండ్రోమ్
- మెదడు సంబంధిత రుగ్మతలు
- హృద్రోగాలు
- మూర్ఛ వ్యాధి
- విపరీతమైన మానసిక ఒత్తిళ్లు
- పదేపదే పక్షవాతం రావడం
వంటివి సైతం డిమెన్షియాకి కారణమవుతాయి. వాస్తవానికి అందరిలోనూ పుట్టినప్పటినుంచీ మెదడు కణాలు క్షీణిస్తుంటాయి. కాకపోతే మధ్య వయసు వచ్చేసరికి కణాలు క్షీణించే వేగం పెరుతుంది. 80 ఏళ్లు వచ్చేసరికి ఆ వేగం మరింత ఎక్కువవుతుంది. అరుదుగానే అయినా కొంతమంది చిన్నపిల్లల్లో కూడా డిమెన్షియా వ్యాధి కనిపించవచ్చు. దానికి కొంతమందిలో వారసత్వ కారణాలు ఉంటే మరికొందరి శరీరంలో కాలుష్యాలు, ఇన్‌ఫెక్షన్లు పెరగటం వల్ల, పోషకాహార లోపం వల్ల జరగవచ్చు.
అల్జీమర్స్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు
మెదడును ఎంత బాగా వాడితే మతిమరుపు అంతగా తగ్గుతుందని డాక్టర్లు చెబుతారు. అంటే, మానసిక సామర్థ్యాన్ని వాడుకోకపోతే అది పనికిరాకుండాపోయే ప్రమాదముందని అర్థం. మెదడుకు తగినంత వ్యాయామం కల్పిస్తే అదే అల్జీమర్స్ కు రక్షణ కవచమవుతుందంటున్నారు. అయితే పిల్లలు సరిగా చదవటం లేదనో, తక్కువ మార్కులు వస్తున్నాయనో తల్లిదండ్రులు కంగారు పడవద్దని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అల్జీమర్స్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదని, క్రమంగా పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు. అతి కొద్దిమంది పిల్లల్లో మాత్రమే శాన్ ఫిలిప్పో సిండ్రోమ్ అనే చిన్నపిల్లల అల్జీమర్స్ సమస్య వస్తుందని దీనికి ఎంజైమ్ లోపం, జన్యుపరమైన లోపాలు కారణాలని కూడా తేల్చారు. ఇది కూడా పెద్దవాళ్లలో కనబడే లక్షణాలనే చూపుతుంది.
సాధారణ పరీక్షల సాయంతో నిర్ధారించటం కుదరదు
కొంతమంది పిల్లలు 4 నుంచి 7 ఏళ్ళు వచ్చేసరికి బట్టలు వేసుకోవటమెలాగో కూడా మరిచిపోతారు. రెండు మూడు అక్షరాల పదాలు మించి పలకలేకపోతారు. మతిమరుపు వ్యాధిని సాధారణ పరీక్షల సాయంతో నిర్ధారించటం కుదరదు.
- పూర్తిస్థాయి రక్తపరీక్షలు
- పోషకాహార లోపాలు తెలుసుకునే పరీక్షలు
- హార్మోన్ల పరిస్థితిని తెలుసుకునే పరీక్షలు
- ఇతర జబ్బులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునే పరీక్షలు అవసరమవుతాయి.
వీటితో పాటు ఎలక్ట్రో- ఎన్సెఫలాగ్రఫీ, గుండె పరీక్షలు, తలలో కణుతులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి సీటీ, ఎం.ఆర్.ఐ., పెట్‌స్కాన్ లాంటివి చేసి, మెదడు పనితీరులో ఏర్పడిన సమస్యలను గుర్తిస్తారు.
మతిమరుపు వ్యాధి ఏ దశలో ఉంది, దీనికి అసలు కారణమేమిటో తెలుసుకుని వైద్య చికిత్సలు చేస్తారు. ఒకవేళ అల్జీమర్ వ్యాధే అందుకు కారణమైతే అది రోజురోజుకూ పెరుగుతూ పోయే వ్యాధి కాబట్టి ఆ దశలో చికిత్సకు అవకాశం తక్కువే. పిల్లల్లో ఎండోక్రైన్ వ్యాధులు, హైపోథైరాయిడిజం వంటివి కారణమైతే ఈ వ్యాధిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ చికిత్సల్లో కూడా డ్రగ్ థెరపీ, నాన్-డ్రగ్ థెరపీ అంటూ రెండు విధానాలు ఉన్నాయి. డ్రగ్ థెరపీలో మందులు ఇస్తే, నాన్‌డ్రగ్ థెరపీలో సైకాలజిస్టులు ఇచ్చే బిహేవియర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, టచ్ థెరపీ, ఆర్ట్ థెరపీ వంటి వాటి ద్వారా చికిత్స చేయాలి.
మతిమరుపుని ఎలా చక్కదిద్దుకోవాలి
మతిమరుపు ఆరంభదశలో ఉన్నప్పుడే న్యూరాలజిస్టును సంప్రదిస్తే, కొద్దిపాటి మందులు, కొన్నిరకాల వ్యాయామాల ద్వారా మరుపు నుంచి బయటపడొచ్చు. చిన్నపిల్లల్లో చాలా వరకు ఈ వ్యాధిని చికిత్స ద్వారా తగ్గించవచ్చు. వారసత్వ కారణాలతో జబ్బు వచ్చి ఉన్నా నియంత్రించవచ్చు. జీవక్రియల సమస్య అయితే శరీరంలో ఉన్న వ్యర్థపదార్థాలను తొలగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. మతిమరుపు తొలి దశలో ఉన్నప్పుడు మెదడుకు బాగా పనిపెట్టే పజిల్స్ లాంటివి మేలు చేస్తాయి. అదే సమస్య తీవ్రమైనప్పుడైతే, అలాంటి వాటివల్ల నష్టమే జరుగుతుంది. అందుకే ఆ ప్రయత్నాలేమీ చేయకూడదు. వైద్యులు సూచించిన విధంగా మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో మార్పులు తప్పనిసరి
ఆటపాటలతో మెదడును ఉత్తేజితం చేసే విధానాల వల్ల దెబ్బతిన్న కణజాలంలో పునరుత్పత్తి జరిగి కొత్త జీవం, కొత్త జీవితం మొదలవుతాయి. కొంతమందిలో విటమిన్ బి-12, ఫోలిక్ యాసిడ్, నియాసిన్ లోపాలు పెల్లాగ్రా అనే అనారోగ్యానికి దారితీస్తాయి. ఇది డిమెన్షియాకు కారణమవుతుంది. అందుకే ఇతర వ్యాధిగ్రస్తులకు మల్లే డిమెన్షియా బాధితులు కూడా సమతులాహారం గురించి వైద్యులు ప్రత్యేకంగా చెబుతారు.
- కార్బోహైడ్రేట్లు
- ఫ్యాట్స్, ప్రొటీన్లు, లవణాలు, విటమిన్లు డైట్‌లో సరిపడా ఉండేలా చూసుకోవాలి.
- అదే క్రమంలో మెదడును బలిష్టం చేసే బ్రెయిన్‌ఫుడ్స్ పైనా దృష్టి సారించాలి.
చివరిగా
చిన్నపిల్లలు ప్రతిరోజూ కొత్తగా ఆలోచించేట్టు చూస్తే మెదడుకు మేత వేసినట్టవుతుంది. చిన్న చిన్న పజిల్స్ లాంటివి ఇవ్వటం ద్వారా అలోచనలకు పదునుపెట్టాలి. అయితే, మరింత భారం మోపినట్టుగా ఆలోచింపజేస్తే మతిమరుపు మరింత పెరగవచ్చు. అందుకే డాక్టర్ల సలహా తీసుకుంటే జీవనశైలిలో ఎలాంటి మార్పుల ద్వారా పిల్లల్లో ఈ అల్జీమర్స్ లక్షణాలను పోగొట్టవచ్చునో తగిన సలహా ఇస్తారు. వ్యాయామం ద్వారా రక్తప్రసరణ పెంచి శరీరంలోని సమస్త కణజాలానికీ అవసరమైన ఆక్సిజన్ అందించటం, వ్యర్థాలన్నీ బయటకు పంపటం అవసరం. పరిశుద్ధమైన గాలి, రక్తంతో మెదడు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.