మీ పిల్లలు దద్దుర్లు, దురదలతో ఇబ్బంది పడుతున్నారా?

Rashes in Children

జ్ఞానేంద్రియాలలో చర్మం కూడా ఒకటి. పిల్లల్లో అత్యంత  సున్నితంగా ఉండే చర్మం మీద కొన్ని సార్లు దద్దుర్లు రావచ్చు, దురద పుట్టవచ్చు. శరీరానికి రక్షణ కవచమైన చర్మానికి అలెర్జీ సోకినట్టు అనిపించినా  కొన్ని సార్లు ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు. శరీరానికి ఎటువంటి అస్వస్థత ఉన్నా చర్మంపై అది ఏదో రకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల వైరస్‌లు, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఉన్నప్పుడు చర్మంపైనే మొదటి లక్షణాలు కనపడొచ్చు. వీటిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి?

పిల్లల చర్మంపై దద్దుర్లకు ముఖ్య కారణాలు

చర్మం శరీరానికి రక్షణ కవచం చర్మం. శరీరం లోపల ఏం జరిగినా కనిపించేలా చేసేది కూడా చర్మమే.  శరీరానికి ఎటువంటి అస్వస్థత ఉన్నా చర్మం మీదా అది ఏదో రకంగా కనిపిస్తుంది. సాధారణంగా ఏ పురుగో, చీమో కుట్టినప్పుడు ఏర్పడిన దద్దుర్లయితే వెంటనే పోతాయి. కాని రోజుల తరబడి పెద్ద పెద్ద దద్దుర్లు బాధపెడుతున్నాయంటే లోపలేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఇన్‌ఫెక్షన్లున్నా, అలర్జీలున్నా కొన్ని రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులున్నప్పుడు కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడొచ్చు.

పిల్లలకు రకరకాల కారణాల వలన అలర్జీ రావచ్చు

ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా అలర్జీకి కారణం కావొచ్చు. ఇలాంటప్పుడు ఏ పదార్థాల వల్ల అలర్జీ వచ్చి, చర్మంపై దద్దుర్లు ఏర్పడుతున్నాయో గమనించి, వాటిని తీసుకోకుండా ఉంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. కొన్నిసార్లు దోమకాటు, చీమకాటే పెద్ద అలర్జీ సమస్యగా మారవచ్చు. ఇలాంటప్పుడు ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం ఉండదు. దోమలు కుట్టకుండా చూసుకోవడమే సరైన మార్గం.

కాని వైరల్, బాక్టీరియల్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు కూడా చర్మంపై దద్దుర్లు ఏర్పడడానికి దారితీసినప్పుడు వాటిని కనుక్కోవడం కొంచెం కష్టమే అవుతుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడితే చాలావరకు అది చర్మానికి మాత్రమే వచ్చిన సమస్య అనుకుంటాం. చర్మం పైన అలర్జీ లేదా ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు దద్దుర్లు సహజమే. కాని చర్మంపైన వచ్చేవే కాకుండా శరీరంలో ఎక్కడ ఇన్‌ఫెక్షన్ ఉన్నా అది దద్దుర్ల రూపంలో కూడా కనిపించవచ్చు.

  • సాధారణంగా రక్తంలో ఇన్‌ఫెక్షన్ ఉంటే దద్దుర్లు ఏర్పడతాయి.
  • ఇన్‌ఫెక్షన్ వల్ల రక్తంలో మార్పులు వచ్చి దద్దుర్లు వస్తాయి.
  • బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ ఉంటే చర్మం మీద  చీము పొక్కుల్లా వస్తాయి.
  • చర్మం మీద దద్దుర్లకు కారణమయ్యే సాధారణ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తామర
  • వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల దద్దుర్లు వచ్చినట్టయితే జ్వరం ఉంటుంది.

బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వల్ల దద్దుర్లు వస్తే  జ్వరం రాకపోవచ్చు కూడా. వైరల్ ఇన్‌ఫెక్షన్ వేరేచోట ఉన్నా చర్మం మీద దద్దుర్లు ఏర్పడవచ్చు. హెర్పిస్ వైరల్ ఇన్‌ఫెక్షన్ లాంటివి చర్మం మీద దద్దుర్ల రూపంలోనే కనిపిస్తాయి

childhood skin problems: rashes and blisters
Causes of the rashes in children

పిల్లల్లో దద్దుర్లను నిర్ధారించే లక్షణాలు – పరీక్షలు

చర్మం మీద ఏర్పడిన దద్దుర్లను బట్టి అది ఏ ఇన్‌ఫెక్షనో ఒక అవగాహనకు రావొచ్చు. దద్దుర్లతో పాటుగా జ్వరం ఉంటే ఇన్‌ఫెక్షన్ ఉందని అనుకోవచ్చు. జ్వరం లేకుంటే సాధారణంగా అలర్జీ కారణమై ఉంటుంది.

కొన్నిసార్లు దద్దుర్లకు

  • ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా కారణం కావొచ్చు
  • కొన్ని రకాల మందులు కూడా దద్దుర్లు, అలర్జీకి కారణం అవుతాయి
  • మందుల వల్లనే అలర్జీ ఉన్నట్టయితే వాటిని మారుస్తారు

ప్యాచ్ టెస్ట్

ఇవన్నీ నెగటివ్ ఉంటే ఇన్‌ఫెక్షన్ల కోసం పరీక్షలు చేస్తారు. సాధారణంగా రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్‌రే అవసరం అవుతాయి. ఆహారానికి సంబంధించిన అలర్జీ పరీక్షలు కూడా ఉన్నాయి. ఆహారం నుంచి చిన్న భాగాన్ని తీసి వీపుపై ఇంజెక్ట్ చేస్తారు. ఆ భాగంలో ఎర్రగా మారితే దాంతో అలర్జీ ఉందని అనుకోవాలి. దీన్ని ప్యాచ్ టెస్ట్ అంటారు.

ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు బయటపడితే అందుకు అనుగుణమైన చికిత్స చేస్తే దద్దుర్లు  తగ్గిపోతాయి. అలర్జీ అయితే  వేటి వల్ల అలర్జీ వస్తున్నదో కనుక్కుని వాటికి దూరంగా ఉండాలి.

  • సముద్రపు ఆహారం
  • కోడిగుడ్డు
  • గోంగూర
  • వంకాయ

వంటివి కూడా అలర్జీకి కారణం కావొచ్చు. పిల్లల్లో ఆహారం, పరాన్నజీవులు దద్దుర్లకు కారణం కావొచ్చు. కొంతమందికి వేరుశెనగ కూడా అలర్జీకి దారితీయవచ్చు.  అలాంటప్పుడు ఆహారంలో వేరుశెనగ నూనె వాడినా సమస్యే అవుతుంది. దద్దుర్ల కారణంగా అసౌకర్యంగా ఉండి నిద్రలేకపోవటం లాంటి లక్షణం ఉన్నా, చర్మం నొప్పిగా అనిపించినా ఇన్ఫెక్షన్ సోకిందని అనిపించినా తల్లిదండ్రులు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

చికిత్స ఎలా ఉంటుంది?

అటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా అనేది దురదపెట్టే వ్యాధి. దీని ప్రధాన లక్షణాలు దురద, దద్దు. రెండు నెలలకు పైగా దురద విడవకుండా వేధిస్తుంటే చర్మ అలర్జీగా నిర్థారించవచ్చు. ఇది చర్మం పొడిబారటంతో మొదలై తీవ్రమైన దురద, దద్దుతో తెగ వేధిస్తుంది. చర్మం ఎర్రబడి దురద మొదలవుతుంది. కొందరు ఎప్పుడూ గోకుతూనే ఉంటారు. తరచుగా దద్దు రావటం వల్ల చర్మం మందంగానూ తయారవుతుంది. రసిక కూడా కారవచ్చు. దీనితోబాటే ఆస్త్మా, జ్వరం కూడా రావచ్చు. దీనికి ఎలాంటి చికిత్సా ఇప్పటివరకూ కనుక్కొలేదు.

చాలావరకు ఇది వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గిపోతుంది. అయితే కొంతమందిలో మోచేతులు, మోకాళ్ల ముడతల్లో స్వల్పంగా ఉండిపోవచ్చు.

చర్మ అలర్జీలతో బాధపడే పిల్లలకు

పోతపాలు, తెల్ల గుడ్డు, చేపలు ఇవ్వకపోవటం మంచిది

సబ్బులు కూడా ఎక్కువగా వాడకూడదు, వీటితో చర్మం మరింత పొడిబారుతుంది

సబ్బులు అవసరమైతే గ్లిజరిన్‌ సబ్బులే వాడాలి

ఉన్ని దుస్తుల వంటివి వేయకూడదు

కాటన్‌ దుస్తులు, అదీ వదులుగా, మెత్తగా ఉన్నవే వేయాలి

చర్మానికి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు తలెత్తినా వెంటనే చికిత్స చేయించాలి. అటోపిక్‌ డెర్మటైటిస్‌ తీవ్రంగా ఉన్నప్పుడు స్టిరాయిడ్‌ పూతలతో తక్షణం ఉపశమనం కలుగుతుంది. అనంతరం మాయిశ్చరైజర్‌ క్రీములు వాడుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దురద తగ్గుముఖం పడుతుంది.

చివరిగా

మెత్తటి, చల్లటి తడిబట్టతో తుడవటం కూడా ఉపశమనం కలిగిస్తుంది. సెలీనియం సల్ఫైడ్ లాంటి మెడికల్ షాంపూలు కూడా వాడవచ్చు. మెత్తటి కాటన్ బట్టలు ధరించటం, చర్మాన్ని తాకే నైలాన్ దుస్తులు నివారించటం కూడా చాలా అవసరం. పిల్లల చర్మ ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యను అంత సులభం గా నివారించవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top