కాన్సర్ తో చనిపోయే ఆడవాళ్లలో సగం మంది రొమ్ము కాన్సర్ తోనే చనిపోతున్నారు. రొమ్ముల్లో గడ్డలు వచ్చి అవి కణితిగా మారటం ఈ కాన్సర్ లో కీలకమైన విషయం. 10 శాతం మహిళలు రొమ్ము కాన్సర్ బారినపడే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే, తగినంత డి విటమిన్ తీసుకునే వారిలో రొమ్ముకాన్సర్ తో చనిపోయేవారు తక్కువగా ఉన్నట్టు ఇటీవలి పరిశీధనలు తేల్చాయి.
క్యాన్సర్ ట్యూమర్లు ఇలా ఏర్పడతాయి
జీవకణాలు అసాధారణంగా పెరిగిపోయి దేహంలోని ఆరోగ్యకరమైన కణాలమీద జరిపే దాడినే స్థూలంగా కాన్సర్ వ్యాధి అంటాం. రొమ్ములోని కణాల్లో మొదలయ్యేది రొమ్ము కాన్సర్. రొమ్ములోని ప్రాథమిక కణజాలంలో కాన్సర్ మొదలై వ్యాపిస్తుంది. ఒక్కోసారి దెబ్బతిన్న పాత కణాలు చనిపోకపోతే అవన్నీ ఒక చోట చేరి ట్యూమర్ గా మారవచ్చు. అలాంటి ట్యూమర్లు రొమ్ములో ఏర్పడవచ్చు.
ఎప్పుడు అనుమానించాలి?
రొమ్ము క్యాన్సర్ రావటానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాలు తెలుసుకుంటే మరింత అప్రమత్తంగా ఉండే అవకాశముంది. సాధారణంగా ఒక కుటుంబంలో .. అంటే, రక్తసంబంధీకులలో అంతకుముందు ఎవరికైనా రొమ్ము కాన్సర్ ఉంటే, ఆ కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. అంతకుముందు గర్భాశయ కాన్సర్ వచ్చి ఉన్నా, రొమ్ము కాన్సర్ రావటానికి అవకాశముంది. వయసు పెరిగే కొద్దీ రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతూ వస్తాయి. రొమ్ముకు సంబంధించిన వ్యాధులేవైనా ఉన్నప్పుడు వాటికి తగిన చికిత్స చేయించకపోయినా క్రమంగా వాళ్ళలో కాన్సర్ కణుతులు ఏర్పడవచ్చు.
జన్యుపరమైన లోపాల కారణంగా రొమ్ములలో అనూహ్యమైన మార్పులు కనబడుతుంటే అది రొమ్ము కాన్సర్ అని అనుమానించాలి. మెనోపాజ్ సమయాన్ని బట్టి కూడా రొమ్ము కాన్సర్ రావచ్చు. ఎక్కువకాలం బహిష్టు అవుతూ, చాలా ఆలస్యంగా మెనోపాజ్ కు చేరుకున్నవాళ్ళలో రొమ్ము కాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది. ఇంతకు ముందు ఒకసారి అండాశయ కాన్సర్ లేదా పెద్ద పేగు కాన్సర్ వచ్చి ఉన్నా, వాళ్లలో రొమ్ము కాన్సర్ రావచ్చు.
రొమ్ము క్యాన్సర్ చికిత్సా పద్దతి
రొమ్ము కాన్సర్ అని నిర్థారణ అయితే చికిత్స మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యాధికి గురైన మహిళ మెనోపాజ్ దశలో ఉన్నారా, రొమ్ము కాన్సర్ ఎంత దూరం వ్యాపించింది, కాన్సర్ కణాల నమూనా ఎలా ఉంది అనే ఈ అంశాలను బట్టి చికిత్సావిధానం నిర్ణయిస్తారు. రొమ్ములో ట్యూమర్ ఎక్కడ ఏర్పడింది, ఎంత మేరకు లింఫ్ నాళాల్లోకి ప్రవేశించింది అని చూస్తే వ్యాప్తి మీద ఒక అవగాహన వస్తుంది.
చికిత్సలో భాగంగా రొమ్ములోని గడ్డను, దాని చుట్టూ ఉన్న కణజాలాన్ని తొలగిస్తారు. రక్త ప్రసరణ ద్వారా రొమ్ము నుంచి క్యాన్సర్కణాలు ఇతర శరీర భాగాలకు చేరే అవకాశం ఉంది కాబట్టి శస్త్రచికిత్స, కీమో, రేడియో, హార్మోన్ వంటి థెరపీలు తప్పకపోవచ్చు. అయితే అందరికీ ఇవి అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా కొన్ని సార్లు పూర్తిగా రొమ్మును తొలగిస్తారు. మరి కొన్నిసార్లు రొమ్ముతో పాటు లింఫ్ గ్రంధులను కూడా తొలగిస్తుంటారు. క్యాన్సర్ ట్యూమర్ ఒకటిన్నర అంగుళాల కంటే తక్కువగా ఉంటే రొమ్ము పూర్తిగా తీసెయ్యకుండా కోత పెట్టి ఆ ట్యూమర్ ను తొలగిస్తారు. అంతకు మించితే రొమ్మును పూర్తిగా తొలగిస్తారు.
పరిశోధనలు ఏంచెబుతున్నాయి?
కాన్సర్ మహమ్మారి మీద అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులోనూ అన్నిటికంటే ముఖ్యమైనది రొమ్ము కాన్సర్. అందులో భాగంగా 4,000 మంది రొమ్ము కాన్సర్ బాధితులను పదేళ్ళపాటు గమనిస్తూ అధ్యయనాలు సాగించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుంచి లభించే డి విటమిన్ కూ, రొమ్ము కాన్సర్ ను తట్టుకొని బ్రతకటానికీ మధ్య సంబంధం ఉన్నట్టు ఆ అధ్యయనంలో తేలింది. రొమ్ము కాన్సర్ కు చికిత్స తీసుకుంటూనే తగినంత విటమిన్ డి స్థాయి దేహంలో కొనసాగేటట్టు చూసుకుంటున్న బాధితులు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు గుర్తించారు.
రొమ్ము క్యాన్సర్ బాధితులకు విటమిన్ డి ఎలా ఉపయోగపడుతుంది?
రొమ్ము కాన్సర్ బాధితులలో మిల్లీలీటర్ కు 20 నానోగ్రామ్స్ కంటే తక్కువ డి విటమిన్ ఉంటే లోటుగా లెక్కించారు. తగినంత డి విటమిన్ ఉంటే రొమ్ము కాన్సర్ వల్ల పదేళ్ళలోపు చనిపోయే అవకాశం 27% తగ్గుతుంది. అందువలన రొమ్ముకాన్సర్ తో పోరాడుతున్న మహిళలు సూర్యకాంతి ద్వారా ఊరట పొంది జీవితకాలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఈ సమస్య ఎక్కువగా వచ్చే నల్లజాతివారికి కచ్చితంగా ఇది ఆశాకిరణమే.
ఈ మధ్య కాలంలో రొమ్ము కాన్సర్ చాలా సహజంగా మారిపోయింది. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్సతో సులువుగా నయమవుతుంది కాబట్టే దీనిమీద అవగాహన పెంచటం కోసం పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కాన్సర్ మీద పరిశోధనలు జరుగుతుండగా విటమిన్ డి వలన రొమ్ము కాన్సర్ మరణాలు తగ్గే అవకాశముందని తేల్చిన అధ్యయనం కొంత ఆశాజనకంగా తయారైంది.