బ్రెస్ట్ (రొమ్ము) ఆరోగ్యం కోసం మంచి ఆహారం

Breast Food

ఆరోగ్యానికి, ఆహారానికి చాలా దగ్గర సంబంధం ఉందన్న విషయం మనకు తెలుసు. చాలా రకాల అనారోగ్యాలకు మనం తినే ఆహారాలే కారణం అవుతుంటాయి. అందుకే జబ్బు చేసినప్పుడు మందులు వేసుకోవటంతో పాటు మంచి ఆహారం తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఈ రోజు మహిళలు బ్రెస్ట్ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలికలు యవ్వన దశలోకి అడుగుపెట్టిన తరువాత  పరిపూర్ణమైన స్త్రీలుగా మారే క్రమంలో వారి రొమ్ముభాగం పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ భూమ్మీదకు వచ్చిన ప్రతి శిశువుకి అమృతం లాంటి తల్లిపాలను అందించే శక్తి ఉన్న అవయవాలు అవి. అయితే మనిషి శరీరంలోని అన్ని అవయవాల్లాగే బ్రెస్ట్ సైతం అనారోగ్యాలకు గురవుతుంటాయి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి స్త్రీపైన ఉంది. మరి, బ్రెస్ట్ ఆరోగ్యంగా ఉండాలన్నా, రొమ్ము క్యాన్సర్ ని నివారించాలన్నా ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

స్త్రీల ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నపుడు తప్పకుండా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మొదట చెప్పుకోవాలి. మనదేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు తమజీవితకాలంలో ఏదో ఒక సమయంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. తొలిదశలో గుర్తిస్తే దీనికి మంచి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే   దీనిని నివారించాలంటే… తగిన పోషకాహారం తీసుకోవాలి. క్యాబేజి, క్యాలిఫ్లవర్ వంటి కూరగాయల్లో ఎ సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రొమ్ముక్యాన్సర్ కి కారణమైన విషాలు, హానికరమైన అంశాలను నివారించే యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

ఈ ఆహారాలనుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే వాటిని  సప్లిమెంట్లుగా కాకుండా ఆహారంగానే తీసుకోవటం మంచిది. అలాగే అవిసె గింజలు సైతం బ్రెస్ట్ కి ఆరోగ్యాన్నిస్తాయి. వీటిలో మొక్కలలో ప్రత్యేకంగా ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో ఈస్ట్రోజన్ అనే పోషకాలు ఉంటాయి.  ఫైటో ఈస్ట్రోజన్ కి క్యాన్సర్ ని నివారించే శక్తి ఉంది. ఇక పసుపులో క్యాన్సర్ పై పోరాడే లక్షణాలున్నాయని తరచుగా వింటూ వస్తున్నాం. ఇందులో ఉన్న కరక్యుమిన్ రొమ్ము క్యాన్సర్ వ్యాప్తిని ఆపుతుంది. అలాగే కీమో థెరపీ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై పడకుండా నివారిస్తుంది.

మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే టమోటా, క్యారట్లు, చిలకడ దుంపలను సైతం తరచుగా తినటం మంచిది. వీటికి రంగునిచ్చే కెరొటినాయిడ్లను మన శరీరం విటమిన్ ఎ గా మార్చుకుంటుంది. కొన్నిరకాల బ్రెస్ట్ క్యాన్సర్ల నివారణలో ఇవి సహకరిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. జిడ్డు తత్వం ఉన్న చేపలలో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సైతం రొమ్ము ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇక బ్లూ, బ్లాక్, రాస్ బెర్రీల్లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే వీటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలు అనారోగ్యానికి గురికాకుండా నివారిస్తాయి.

ఈ పళ్లను తాజావే కాదు… ఎండబెట్టినవి కూడా తినవచ్చు. అలాగే వాల్ నట్స్ కూడా రొమ్ము క్యాన్సర్ ని నివారించడంలో, ఒకసారి వచ్చాక తిరిగి రాకుండా చేయటంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని తినటం వలన రొమ్ము కణతి పెరుగుదలని నివారించే అవకాశం ఉంటుంది. ఇక ఎరుపు, పర్పుల్ రంగుల ద్రాక్షలలో హెచ్చుస్థాయిలో ఉండే రెస్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంటు సైతం రొమ్ము క్యాన్సర్ నివారణలో మంచి ప్రభావం చూపుతుంది. వీటిని తినేటప్పుడు తోలుని అలాగే ఉంచాలి. ఎందుకంటే తోలులోనే క్యాన్సర్ ని నివారించే యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి.

రొమ్ము క్యాన్సర్ ని నివారించడంలో పప్పు ధాన్యాలు సైతం చాలా చక్కని ప్రభావాన్ని చూపుతాయి. వీటి ద్వారా మనం మొక్కల ద్వారా లభించే ప్రొటీన్లను పొందుతాము. ఈ ప్రొటీన్లు శరీరంలో వాపు, మంట గుణాలకు కారణమైన ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. అలాగే ఈ ప్రొటీన్లు రొమ్ము క్యాన్సర్ ని సైతం నివారించగలుగుతాయి. పప్పుల్లో ఉండే పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు సైతం రొమ్ము క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఇక మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకునే క్రమంలో తృణ ధాన్యాలను కూడా ఎక్కువగా తినటం మంచిది. వీటిలో ఉండే మొక్కల సంబంధిత రసాయనాలకు బ్రెస్ట్ క్యాన్సర్ ని నివారించే శక్తి ఉంది. తృణ ధాన్యాలను వారానికి ఏడు సార్లకంటే ఎక్కువగా తినే స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గినట్టుగా ఓ అధ్యయనంలో తేలింది. కనుక ఆహారం విషయంలో స్త్రీలు తమ అభిరుచితో పాటు ఈ ఆరోగ్య అంశాలను సైతం గుర్తుంచుకోవాలి.

తగిన ఆహారం ద్వారా క్యాన్సర్ మహమ్మారిని నివారించే అవకాశం ఉండటం చాలా మంచి విషయం. మొక్కల ద్వారా లభించే ఆహారం తీసుకోవటంతో పాటు తగిన వ్యాయామం చేయటం వలన రొమ్ముక్యాన్సర్ ని నివారించే అవకాశం మరింతగా ఉంటుంది. వారానికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంటలు వ్యాయామం చేయటం వలన హార్మోన్ స్థాయిలు అదుపులో ఉండి రొమ్ము క్యాన్సర్ ని కూడా నివారించవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top