ప్రపంచంలో చాలా మందిని వేధిస్తున్న వ్యాధుల్లో ఉబ్బసం వ్యాధి కూడా ఒకటి. శ్వాసకోశ ఇబ్బందుల వల్ల వచ్చే ఈ వ్యాధికి ఇప్పటికీ సరైన చికిత్స లభించడం లేదు. చలికాలం, వర్షాకాలంలో ఉబ్బసం రోగులు నానా అవస్తలు పడుతూనే ఉన్నారు. ఐతే రోగుల్లో చాలా మందికి తమ జబ్బుపై అవగాహన కూడా లేదు.
ఆస్తమా ఈ శ్వాసకోశ వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల 50 లక్షల మంది బాధపడుతున్నారు. అంటే జబ్బు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ జలుబు శ్వాసకోశ ఇబ్బందులతో మొదలై దీర్ఘకాళిక రోగంగా పరిణమిస్తుంది. కొంత మందిలో వ్యాధి తీవ్రత ముదిరే వరకు కూడా వారికి ఉబ్బసం వ్యాధి ఉన్నట్లు అవగాహన ఉండదు. సాధారణంగా వాతావరణ మార్పుల వచ్చే సమస్యే అని తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. శ్వాసకోశ నాళాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ల కారణంగా ఆస్తమా వ్యాధి వస్తుంది.
ఆస్తమా ఉన్న వారిలో తరుచూ ఆయాసం , పిల్లికూతలు, దగ్గు, ఛాతీ బరువుగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందిలో తరుచూ తుమ్ములు రావడం, ముక్కునుంచి నీరు కారడం, కొద్దిపాటి వాతావరణ మార్పులు రాగానే జలుబు చేయడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆస్తమా వ్యాధికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ వాటిలో ప్రధానంగా జన్యుసంబంధిత కారణాలు ఎక్కువని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఓ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అన్నమాట. దీంతోపాటు వాతావరణ పరిస్థితులు, ఇంటిలోపల, బయటా కాలుష్యం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో, పిల్లల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధికి ఇప్పటి వరకు సరైన చికిత్స అందుబాటులో లేదు. అందుకే వ్యాధి నివారణ ఒక్కటే మార్గమని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం పరీక్షలను క్షుణ్నంగా పరిశీలించడం. జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుందంటున్నారు.