చిన్నపిల్లలు నిద్రలో పక్కతడపటం సాధారణం. ఎదుగుతున్నా సమస్య ఇంకా కొనసాగుతుంటే అది తల్లిదండ్రులకు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. మూత్రాశయం నిండినట్టు పిల్లలు గుర్తించలేకపోవటం, రాత్రంతా మూత్రాన్ని నిల్వ చేసుకోగలిగేలా మూత్రాశయం పెరగకపోవటం లాంటి కారణాలే ఈ పరిస్థితికి దారితీస్తాయి. ఎదిగిన పిల్లల్లోనూ ఈ అలవాటు కొనసాగటం గమనించినప్పుడు వైద్య పరంగా పరిష్కారాలు వెతుక్కోకతప్పదు.
పిల్లలు పక్క తడపటం అనేది చాలా సహజం. అందువలన కంగారు పడాల్సిన అవసరం లేదనే డాక్టర్లు తల్లిదండ్రులకు చెబుతుంటారు. అయితే ఏడేళ్ల తరువాత కూడా ఈ సమస్య కొనసాగుతున్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించాలి. దాన్ని చాలా ఓర్పుతో పరిష్కరించుకోవాలే తప్ప హైరానా పడి పిల్లల మీద వత్తిడి తీసుకురావటం మంచిది కాదు.
ఇలాంటి కారణాలు ఉండవచ్చు
పిల్లలు మామూలుగా ఐదేళ్ళు నిండేసరికి మూత్రవిసర్జన సమయాలకు అలవాటు పడతారు. అయితే మూత్రాశయం మీద పూర్తి నియంత్రణ రావటానికి ఒక నిర్దిష్టమైన సమయమంటూ లేదు.5-7 సంవత్సరాల మధ్య దాదాపుగా పక్కతడిపే సమస్యకు దూరమవుతారు.
ఏడేళ్ళు దాటిన తరువాత కేవలం కొద్ది మందిలో మాత్రమే కొనసాగవచ్చు. అయితే, అలా కొనసాగటానికి అంతర్లీనంగా ఏదైనా సమస్య ఉండి ఉంటుంది. అందువలన ఏడేళ్ళు దాటినా పక్కతడుపుతున్నప్పుడు, కొంతకాలం మామూలుగానే ఉండి ఒక్కసారిగా మళ్ళీ తడపటం కొనసాగిస్తున్నప్పుడు, తడిపిన వెంటనే బాగా దాహం అనిపించటం, మూత్రం ఎరుపు లేదా ఊదా రంగంలో ఉన్నప్పుడు, మలం గట్టిగా విసర్జిస్తున్నప్పుడు, లేదా సన్నగా గురకపెడుతున్నప్పుడు డాక్టర్ ను సంప్రదించటం మంచిది.
నిజానికి పక్కతడిపే అలవాటుకు స్పష్టమైన కారణమంటూ తెలియదు. కానీ రకరకాల అంశాలు కారణం కావచ్చునని భావిస్తున్నారు. మూత్రాశయ పరిమాణం ఎదగకుండా చిన్నదిగానే ఉండిపోవటం వలన ఎక్కువ మూత్రాన్ని నిల్వచేసుకోలేక ఇలా జరగవచ్చు. మూత్రాశయంతో అనుసంధానమైన నాడులు సరిగా పనిచేయకపోతే గాఢ నిద్రలో ఉన్న పిల్లలకు మూత్రాశయం నిండినట్టు సంకేతాలు అందక పోవటం కూడా కారణం కావచ్చు.
రాత్రిపూట మూత్రం తయారీని నిదానింపజేసే హార్మోన్ల ఉత్పత్తి జరగకపోవటం, మూత్రనాళానికి ఇన్ఫెక్షన్ సోకటం, మధుమేహం, తీవ్రమైన మలబద్ధకం, మూత్రనాళ నిర్మాణంలో లోపం లాంటివి కూడా పక్క తడపడానికి దారితీయవచ్చు.
లక్షణాలు ఇలా ఉన్నాయా?
పక్కతడపటమనే సమస్య ఎవరికైనా ఎదురుకావచ్చు. అయితే ఆడపిల్లల్లో కంటే రెట్టింపు ఎక్కువగా మగపిల్లల్లోఈ లక్షణం కనబడుతుంది. తమ్ముడు లేదా చెల్లి పుట్టటం, కొత్తగా స్కూల్లో చేరటం, ఇంట్లో కాకుండా మరెక్కడైనా పడుకోవాల్సి రావటం లాంటి ఉద్విగ్న ఘట్టాలు ఎదురైనప్పుడు ఇలా పక్కతడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు తేల్చాయి.
తల్లిదండ్రులకు చిన్నప్పుడు అలాంటి అలవాట్లు ఉంటే పిల్లలకు కూడా రావచ్చు. శారీరకంగా ఎలాంటి సమస్యలూ లేనప్పుడు పక్కతడపటాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. అయితే పిల్లల్లో అది ఆత్మన్యూనతాభావం కలిగించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బయట ఎక్కడైనా రాత్రికి బస చేయాలన్నా వీలు కావటం లేదని పదే పదే అనటం మంచిది కాదు.
పక్కతడిపాక ఎక్కువ సేపు అలా బట్టలు మార్చకపోతే మర్మావయవాల దగ్గర దద్దుర్లు రావచ్చు. డాక్టర్ దగ్గరికి వెళితే రాత్రిపూట ఎంత ద్రవాహారం ఇస్తున్నారు, తల్లిదండ్రులకు చిన్నప్పుడు ఇలాంటి అలవాటు ఉండేదా, మూత్ర, మల విసర్జనల సమయాలు అనేవి అడిగి తెలుసుకుంటారు. ఇన్ఫెక్షన్ లేదా మధుమేహం లక్షణాలు ఉన్నాయేమో తెలుసుకోవటానికి మూత్ర పరీక్షలు చేయించవచ్చు.
మూత్రనాళ నిర్మాణం, మూత్రపిండాల స్వరూపం తెలుసుకోవటానికి ఎక్స రే కూడా తీయించాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బైటపడటానికి ముందుగా కొన్ని జీవనశైలి సంబంధమైన మార్పులు చేసుకోవాలి. పిల్లలకు సాయంత్రం వేళలో ఎక్కువ ద్రవాహారాలు ఇవ్వకూడదు. పగలు ఎక్కువ ఇవ్వాలి. మూత్రాశయాన్ని ప్రేరేపించే కెఫీన్ ఉన్న పానీయాలు ఇవ్వకూడదు.
ఈ జాగ్రత్తలు పాటించండి
పిల్లలు చాలామంది పెరుగుతూ ఉండగా పక్కతడిపే అలవాటు పోగొట్టుకుంటారు. ఒకవేళ చికిత్స దాకా వస్తే మాత్రం డాక్టర్ ఇచ్చే సలహా తీసుకోవాలి. అందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా సందర్భానికి తగినట్టు చికిత్స నిర్ణయిస్తారు. ఎప్పుడైనా ఒకసారి తడుపుతుంటే దాన్ని బూతద్దంలో చూడాల్సిన అవసరంలేదు. కేవలం ద్రవాహారం ఇవ్వటం కాస్త తగ్గిస్తే చాలు. ఇలాంటి మార్పులు కూడా ఫలితం ఇవ్వనప్పుడు డాక్టర్ ను ఆశ్రయించవచ్చు.
ఏదైనా అంతర్లీనంగా ఉన్న కారణం తెలిస్తే దానికి చికిత్స చేయటం అవసరం. ఇందులో రెండు పద్ధతులున్నాయి. తేమ తగలగానే అలార్మ్ మోగే పరికరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. చిన్నపాటి బ్యాటరీతో నడిచే ఈ పరికరాలు ఈ మధ్య బాగానే ప్రచారం పొందుతున్నాయి. పిల్లలు మూత్ర విసర్జన మొదలుపెట్టగానే ఇవి మోగుతాయి.అప్పుడు పిల్లలు మేలుకొని మూత్రవిసర్జనకు వెళతారు. ఇది మూడు నెలల్లోనే ఫలితాలిస్తుందని చెబుతారు.
ఇక చివరిగా ఆలోచించాల్సింది మందుల వాడకం గురించి. రాత్రిపూట మూత్రం ఉత్పత్తి తక్కువగా ఉండేట్టు చూసే డెస్మోప్రెస్సిన్ లాంటి మందుల వలన కొంత ప్రయోజనం ఉంటుంది.
అయితే జ్వరం, డయేరియా, వాంతుల వంటి లక్షణాలు కనబడితే వాడకం ఆపెయ్యాలి. ఇది ఐదేళ్ళు పైబడిన వాళ్ళకే సిఫార్సు చేస్తారు. మూత్రాశయం పరిమాణం చిన్నదిగా ఉంటే ఆక్సీబ్యుటినిన్ లాంటి మందులు ఇస్తారు. అవి మూత్రాశయం పరిమాణం పెంచటానికి పనికొస్తాయి. పగటిపూట పక్కతడిపేవాళ్ళకూ పనికొస్తాయి. మిగిలిన మందులేవీ పనిచేయనప్పుడే ఇవి వాడతారు.
చివరిగా
అయితే, మందుల వలన శాశ్వత పరిష్కారం దొరక్క పోవచ్చు. వాడకం ఆపేయగానే సమస్య తిరగబెట్టే అవకాశం ఉంది.
Subscribe for regular Health Blogs