మహిళ గర్భందాల్చిన రెండవ నెల నుండి కడుపులోని పిండం మార్పు చెందుతూ ఉంటుంది. ఈ దశలో చాలామంది గర్భిణులు వెన్ను నొప్పి, కాలు, మడమ మొదలైన శరీర భాగాల నొప్పులగురించి చెబుతుంటారు. ఎక్కువమంది చెప్పేది ప్రధానంగా నడుము నొప్పి గురించి. ఇది కొంతమందిలో చాలా ఎక్కువగా కూడా ఉండవచ్చు.
గర్భిణులలో నడుమునొప్పికి కారణాలు ఇవే
గర్భంలో ఎదుగుతున్న శిశువు కారణంగా తల్లి ఆ బరువును మోయటానికి వెనక్కి వంగాల్సి వస్తుంది. ఈ వంపు ఆమె వెన్నుకు, కటి కండరానికి నొప్పి కలిగిస్తుంది. కటి నొప్పి అంటే నడుము కండరాలకు సంభవించే నొప్పి. ఇది గర్భవతికి చివరి దశలలో ఎక్కువగా వుంటుంది. శిశువు కటి ప్రదేశంలోకి పడటం వలన అక్కడి కండరాలకు ఒత్తిడి పెరుగుతుంది. కడుపులో ఉన్న బిడ్డ బరువు, తల్లి బరువు శరీరంమీద వత్తిడి పెంచి నడుము నొప్పికి దారితీస్తాయి.
గర్భవతికి తన ఆరోగ్యం, అలవాట్లు, ఆహారం పట్ల సరైన అవగాహన ఉండాలి. గర్భం ధరించిన సమయంలో ఆరోగ్యం గురించి తానే పద్ధతులు పాటించాలన్నదీ కాబోయే మాతృమూర్తి తెలుసుకోవడం అవసరం. గర్భధారణ వలన 10 నుంచి 12 కిలోల బరువు పెరగటం సహజం. గర్భసంచి వలన, శిశువు వలన ఈ బరువు తప్పనిసరి అవుతుందై. ఈ బరువునంతా భరించాల్సింది వెన్నెముక. దానివలన వెన్ను దిగువ భాగం మీద వత్తిడి పెరుగుతుంది.
గర్భిణి తనకు తెలియకుండానే కాస్త వెనక్కి వాలినట్టు నడవటం మొదలవుతుంది. దీనివలన నడుము నొప్పి సహజంగానే పెరుగుతుంది. గర్భిణులలో రిలాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావటంతో ప్రసవానికి వీలుగా సంబంధిత కీళ్ళు వదులవుతాయి. కానీ అదే హార్మోన్ వెన్నెముక మీద కూడా ప్రభావం చూపటం వల్ల అది వదులుగా తయారై నొప్పికి దారితీస్తుంది. గర్భసంచి పరిమాణం పెరిగే కొద్దీ ప్రసవానికి అనుకూలంగా కండరాలు కూడా సర్దుకోవటం మొదలుపెట్టి నడుము నొప్పిని మరింత పెంచుతాయి.
గర్భిణీలలో నడుము నొప్పికి చికిత్స
గర్భధారణకు ముందు నుంచీ నడుము నొప్పి ఉంటే దానికి ముందుగానే తగిన చికిత్స తీసుకోవాలి. అలా కాకుండా గర్భధారణ తరువాత మొదలైతే కాన్పుకు దగ్గరవుతున్నకొద్దీ ఆ నొప్పి తగ్గుముఖం పట్టటం ఒక విశేషం. అయితే నడుము నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి బాగా ఇబ్బందిపెడుతున్నప్పుడు మాత్రం డాక్టర్ ను సంప్రదించటం మంచిది.
నొప్పి క్రమంగా పెరుగుతున్నప్పుడు, అకస్మాత్తుగా నొప్పి వచ్చి అది కొద్ది సేపట్లోనే ఎక్కువవటం లాంటి లక్షణాలు కనబడినప్పుడు కచ్చితంగా డాక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళటం అవసరం. మరికొన్ని సందర్భాలలో ఒక లయబద్ధంగా నడుము నొప్పులు వస్తున్నట్టు కనిపిస్తాయి.
కొన్ని అరుదైన సందర్భాలలో గర్భధారణకు సంబంధించిన ఇతర సమస్యల కారణంగా కూడా నడుము నొప్పి రావచ్చు. అందులో ప్రధానమైనది ఆస్టియోపొరోసిస్ అని పిలిచే ఎముకల క్షీణత సమస్య. వెన్నుకు వచ్చే ఆస్టియోపొరోసిస్, సెప్టిక్ ఆర్థ్రైటిస్ కూడా కారణాలు కావచ్చు. అందుకే ఇలాంటి సమస్యలకు చికిత్స అవసరం. గర్భిణులు డాక్టర్ సలహా లేకుండా మామూలు నొప్పి నివారణ మాత్రలు వాడటం మంచిది కాదు.
గర్భవతులకు సురక్షితంగా ఉండేలా కండరాలకు విశ్రాంతినిచ్చే మందులను డాక్టర్లు సాధారణంగా సిఫార్సు చేస్తారు. అదే సమయంలో కూర్చునే విధానం, పడుకునే పద్ధతి గురించి కూడా సలహాలు ఇస్తారు. ఆక్యుపంక్చర్ లాంటి ఊరటనిచ్చే పద్ధతులను సైతం సిఫార్సు చేయవచ్చు.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.
Nice one