అందరిలో సాధారణంగా కనిపించే సమస్య శరీరం పొడిబారడం. ముఖ్యంగా, వయసైపోయిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఎదురువుతుంది. చలికాలంలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళలు చాలా ఇబ్బందిపడుతుంటారు. దీన్ని నియంత్రించేందుకు, సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో కొందరికి సత్వర ఉపశమనం లభిస్తే, మరి కొందరికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది, వారివారి శరీర స్వభావంమీద ఆధారపడి ఉంటుంది.
కొంతమందిలో శరీరంలోని నూనె గ్రంథులు, చెమట గ్రంథులు తక్కువగా ఉంటాయి. ఫలితంగా చర్మంలో తేమ తగ్గిపోతుంది. దీంతో చర్మం గరుకుగా, పొడిగా తయారవుతుంది. దీనికి చిట్కా వైద్యంగా వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవడం. ప్రతి నలుగురిలో ఒక మహిళ.. ఈ డ్రైనెస్ కారణంగా చేతిగోళ్లు, అరికాళ్లు, అరిచేతులు పెలుసుగా, పొడిగా మారే సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసు పెరిగే కొద్దీ గోర్లు.. చీలిపోయినట్టు తయారవుతుంటాయి. తరచూ నీటితో తడపడం వల్ల ఈ సమస్య ఎదురుకావొచ్చు. రాత్రి సమయాల్లో చల్లగాలి నుంచి కాపాడుకునేందుకు గ్లౌజులు ధరించడం, సాక్సులు ధరించడం, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక, నోరు పొడిబారడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. నోటిని తేమగా ఉంచేందుకు సహాయపడే లాలాజలం ఉత్పత్తి కాకుండా చేస్తుంది. తద్వారా దంతక్షయం, నోటిలో పుండ్లు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్ ను సంప్రదిస్తే ఈ వ్యాధికి గల మూలకారణాలను తెలుసుకుని సరైన మెడిసిన్ ఇస్తారు.