పిల్లల్లో కనిపించే అంటువ్యాధుల్లో ఆటలమ్మను ప్రమాదకరమైందిగా చెప్పుకోవాలి. వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ క్రిముల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి పదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మాట్లాడుతున్నపుడు, దగ్గినపుడు, తుమ్మినపుడు వ్యాధి కారక క్రిములు ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా సోకుతాయి. ఒళ్లంతా బొబ్బలతోపాటు, తీవ్రమైన దురదలు, దద్దుర్లతో వేధిస్తుంది.
పిల్లల్లో ఆటలమ్మ (Chikenpox) లక్షణాలు
ఆటలమ్మను తెచ్చిపెట్టే వారిసెల్లా క్రిములు పిల్లల ఒంట్లోకి చేరిన రెండు వారాల నుంచి లక్షణాలు మొదలవుతాయి. ఈ సమయంలో పిల్లలకు తరచుగా జ్వరం వస్తుంటుంది. తలనొప్పి, ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఛాతీ భాగంలో చిన్న చిన్న మచ్చలు మొదలవుతాయి. ఈ మచ్చలు క్రమంగా బొబ్బలుగా మారతాయి. ఈ బుగ్గల్లోకి నీరు చేరి క్రమంగా చీము పడతాయి. దీంతో పిల్లలకు దురదలు, నొప్పి బాధలు మొదలవుతాయి. ఆటలమ్మతో బాధపడే పిల్లలకు హోమియోలో మంచి ఔషధాలు ఉన్నాయి. వాటిలో ముందుగా రస్టాక్స్ గురించి చెప్పుకోవాలి.
ఇవే మంచి ఔషధాలు
రస్టాక్స్ పిల్లలకు రాత్రిపూట బాధలు ఎక్కువగా ఉంటాయి. ఒంటి మీద దద్దుర్లతోపాటు, చలి, జ్వరం కూడా వస్తుంటాయి. పక్క కుదరక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి పిల్లలకు రస్టాక్స్ బాగా పని చేస్తుంది. ఆటలమ్మకు మరొక మంచి ఔషధం… యాంటింటార్ట్. ఒంటి మీద బుగ్గలతోపాటు, జ్వరం వస్తున్నపుడు, మగతగా ఉంటున్నపుడు యాంటిటార్ట్ ఔషధం బాగా పని చేస్తుంది.
దురదలు, దద్దుర్లకు ఏపిస్
పిల్లల్లో ఆటలమ్మకు మరొక మంచి ఔషధం. ఏపిస్ పిల్లలకు ఒంటిపై పెద్దపెద్ద బుగ్గలు కనిపిస్తుంటాయి. వీరికి చురుకు మంటలతోపాటు, దురదలు ఎక్కువగా ఉంటాయి. చన్నీళ్లు తాగితే బాధలు ఉపశమిస్తాయి. అలాగే ఆర్సెనికం ఆల్బ్. నీటి బుగ్గలు తీవ్రంగా ఉండి, విపరీతంగా మంట పెడుతున్నపుడు ఈ ఔషధాన్ని వాడుకోవాలి. వీరికి వేడి నీళ్లు తగిలితే హాయిగా ఉంటుంది. ఒంటి మీద బుగ్గలు, దద్దుర్లతోపాటు, తలంతా వేడిగా ఉంటున్నపుడు, కాళ్లు చేతులు చల్లగా ఉన్నపుడు బెల్లడోనా బాగా పని చేస్తుంది.
బెల్లడోనా పిల్లలకు ఉన్నట్లుండి జ్వరం వస్తుంటుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్షీలో రోజూ ఉదయం, సాయంత్రం పూట 3 మాత్రల చొప్పున ఇస్తుంటే పిల్లల్లో జ్వరాలు త్వరగా తగ్గుముఖం పడతాయి.